గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు
పోలింగ్ ఉదయం 7గం.నుంచి సాయంత్రం 5గం. వరకు ఓటింగ్ ప్రక్రియ
పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు : ఎస్‌ఇసి పార్థసారధి
ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ నోడల్ అధికారి
మనతెలంగాణ/హైదరాబాద్: మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు చేపట్టారు. కరోనా నియంత్రణలో భాగంగా సిబ్బందికి ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల సిబ్బంది కొంత భయం భయంగానే విధులకు హాజరవుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హన్మకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. వరంగల్‌లో మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లు ఉన్నారు. 5 వేల 125 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1,021 బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేశారు. 3 వేల 7 వందల మందికిపైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా 561 కేంద్రాల్లో సిసిటివిల ద్వారా ప్రక్రియను రికార్డ్ చేస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 3 వేల 700 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 167 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఖమ్మం బరిలో 251 మంది అభ్యర్థులు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు పోలింగ్ జరగనుండగా 377 కేంద్రాల ఏర్పాటు చేశారు. 2 వేల 5 వందల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 752 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్‌లో 2 లక్షల 88 వేల929 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం బరిలో 251 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ ఆంక్షలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిఈ ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. జడ్చర్లలోని బిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అచ్చంపేటలోని జయం జై హైస్కూల్‌లో ఎన్నికల సామగ్రి సిబ్బందికి పంపిణీ చేశారు. నకిరేకల్, కొత్తూర్, సిద్దిపేట మున్సిపాలిటీల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని లింగోజీగూడ డివిజన్‌లో ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మే 3న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఏర్పాట్లు : ఎస్‌ఇసి పార్థసారధి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొవిడ్ నిబంధనలు పకడ్బంధీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి అధికారులకు సూచించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ సంబంధించి పాటించవలసిన కొవిడ్ నిబంధనలపై పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది ఒక్క చోట చేరకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లు విశాలమైన గదుల్లో ఏర్పాటు చేసి ముందుగా శానిటైజ్ చేయాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోనూ పూర్తి నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న ఏ ఒక్కరినీ కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. లెక్కింపు అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారాదని, రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన ధృవపత్రం అందుకునేందుకు అభ్యర్థితో పాటు మరొకరిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయాలి
పోలింగ్, కౌంటింగ్ రోజులలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాలను ముందు రోజు, పోలింగ్ రోజు శానిటైజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రవేశించే ముందు, బయటికి వెళ్లే ముందు చేతులను శానిటైజ్ చేసుకోవాలని అన్నారు. ఇందుకోసం ఓ ఇన్‌ఛార్జ్‌ను నియమించడంతో పాటు శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భౌతికదూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్క్ చేయాలని పేర్కొన్నారు. ఓటర్లు భౌతికదూరం పాటించేలా పర్యవేక్షణకు ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను నియమించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం లోపల సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్ భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది, పోలీస్ సిబ్బంది విధిగా మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు, గ్లౌజులు ధరించాలని, వీలును బట్టి ఎన్- 95 మాస్క్ లేదా రెండు మాస్కులు ధరించాలని తెలిపారు. ఎవరైనా సిబ్బంది అనారోగ్యంగా ఉన్నట్లైతే పోలింగ్ విధులు కేటాయించరాదని పార్థసారధి చెప్పారు. పోలింగ్, పోలీస్ సిబ్బందిని తరలించే వాహనాల సీటింగ్ కెపాసిటీలో సగం మాత్రమే అనుమతించాలని తెలిపారు.
ప్రతి మున్సిపాల్టీలో హెల్త్ నోడల్ అధికారులు
కొవిడ్ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం ప్రతి మున్సిపాల్టీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్ నోడల్ అధికారులను నియమించాలని కమిషనర్ పార్థసారధి తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది అవసరమైన మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో పెద్ద షామియానాలు ఏర్పాటు చేసి అందులో భౌతిక దూరం పాటించేలా ఓటర్లకు కుర్చీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అవసరమైన అంబులెన్సులను ఆక్సిజెన్ సిలిండర్‌లతో సిద్ధంగా ఉంచాలని అన్నారు. పోలీస్, పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి పరిశుభ్రమైన సురక్షిత ఆహారం, రక్షిత త్రాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
Telangana Municipal Elections 2021 on April 30