Monday, November 25, 2024

నూతన సచివాలయం నిర్మాణం, ప్రత్యేకతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతిని, భాగ్యనగర విఖ్యాతిని నలుదిశలా చాటే అధునాతన పాలనా సౌధం ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. దీంతో రేపటి నుంచి ఈ పాలనా సౌధం అందుబాటులోకి రానుంది.

దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు..  

28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలో లేదు. దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఇది ఒకటి. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్‌తో కూడిన పాస్‌లు జారీ చేయనున్నారు. 300 సిసి కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు.

Also Read: రావి ఆకుపై నూతన సచివాలయ భవనం

ఆరు అంతస్తుల్లో 635 గదులు
ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఎసి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను నెలకొల్పారు.
24 లిఫ్ట్‌లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేశారు. కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎటిఎం సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్‌లు ఉన్నాయి. వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్‌ను నిర్మించారు.

265 అడుగుల ఎత్తులో అశోకుడి చిహ్నం
సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్య భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు. సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు.

635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు….
635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలతో ఈ కొత్త సచివాలయ నిర్మాణం జరిగింది. సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఆరో అంతస్తులోని సిఎంఓకు చేరుకునేందుకు రెండు లిప్టులను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు.

స్కై లాంజ్ నుంచి 360 డిగ్రీల్లో
విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్‌లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించోచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్ గా వ్యవహారిస్తారు. పార్లమెంట్ భవనానికి వినియోగించిన ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్‌సి చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News