Monday, December 23, 2024

భవిష్యత్తరాలకు స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొట్లాట జరిగి.. గెలిచి నిలిచిన తెలంగాణలో కేవలం దశాబ్ద కాలంలోపే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీస వసతుల లేమితో, సరైన ప్రభుత్వ భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడే సందర్భం. అటువంటి గతాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్చి వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలు భవిష్యత్తరాలు.. తరతరాలుగా చెప్పుకునేలా, గుర్తుంచుకునేలా నిలుస్తున్నాయి. అటువంటి గొప్ప కట్టడాలు జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. అటు పరిపాలనకు సంబంధించిన భవనాలు, ఇటు ఆధ్యాత్మికమైన ఆలయాల నిర్మాణాలతో తెలంగాణ ఓ నిత్యనూతన పర్యాటక ప్రాంతంగా మారుతున్నది. ఆధ్యాత్మికతకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఇవే కాకుండా కొండగట్టు, వేములవాడ రాజన్న వంటి ఆలయాలకు సైతం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాగు నీటికి సంబంధించిన మిషన్ భగీరథ కట్టడాలు ఊరూరా దర్శనమిస్తూ.. తాగు నీటి సమస్యను తీర్చడమే కాకుండా తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ కట్టడాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరో పక్క రైతులకు సంబంధించిన మిషన్ కాకతీయ పనులు సైతం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ప్రారంభం కావడంతో… అది నేడు కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో పూర్తయి మనకు జీవనాధారమైంది. హైదరాబాద్ నిజాం సంస్థానంగా ఉన్న సమయం లో అప్పటి ఇంజినీర్ నిజాం అలీనవాబ్ జంగ్ తనదైన రీతిలో కట్టడాలు కట్టి నేటికీ అవి శాశ్వతంగా నిలిచేలా ఆయన కృషి చేశారు. మొదటిగా ఆయన నిజామాబాద్ జిల్లాలోని ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. అలాగే చారిత్రక భవనం ఉస్మానియా యూనివర్శిటీ నేడు తెలంగాణ లో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అటువంటి కట్టడాలు ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల నిర్మాణం వడివడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ కట్టడాలు తెలంగాణ త్యాగానికి, పరిపాలన నిబద్ధతకు దిక్సూచిగా నిలిస్తే.. మరో అద్భుత ఆవిష్కరణ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం. అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో సంబురంగా ఆవిష్కృతమైంది.

అలాగే తెలంగాణ పరిపాలనకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పద్ధతిలో రావడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేడ్కర్ సచివాలయంగా నామకరణం చేసి వడివడిగా పనులు పూర్తి చేసుకుంది. అటు అంబేడ్కర్ నింగిని తాకే నిలువెత్తు విగ్రహం సాక్షిగా.. పరిపాలన భవనానికి ఆయన పేరును పెట్టి అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సెక్రటేరియట్ ఉండనుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా.. తెలంగాణ కోసం తమను తాము ఆత్మబలి దానం చేసుకొని.. ఉద్యమానికి దారి చూపినట్లుగా దివిటీగా మారిన అమరుల స్ఫూర్తిగా వారి స్మారకార్థం.. అమరజ్యోతి నిర్మాణం భాగ్యనగరంలో ఆధునిక ఆదర్శ కట్టడాలుగా నిలవగా.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి నిచ్చేలా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఈ కట్టడాలు శాశ్వత సాక్ష్యాలుగా నిలవనున్నాయి. ముఖ్యమంత్రి సూచనలతో తెలంగాణలో.. ఇటు దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం, అటు అంబేద్కర్ సచివాలయం.. అమరుల త్యాగాలు ఎప్పుడూ గుర్తుండేలా అమరజ్యోతి నిర్మాణాలు.. తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోకుండా నిత్య స్ఫూర్తి పొందే ఈ కట్టడాలు ఆదర్శం. భవిష్యత్తు తరాలకు ఓ గొప్ప చారిత్రిక కట్టడాలుగా నిలిచిపోనున్నాయి.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News