Sunday, December 22, 2024

దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటిసి ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిసి అతిపెద్ద పేపర్‌ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణపై ఐటిసి చైర్మన్‌ సంజీవ్‌పురి ప్రశంసలు సంతోషం కలిగించాయని చెప్పారు.

ఈ ప్లాంటులో గోధుమ పిండి, చిప్స్‌, బిస్కెట్లు, నూడుల్స్‌ తయారు చేస్తున్నారని వెల్లడించారు. నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కెటిఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని అన్నారు. అనతి కాలంలోనే మిగులు విద్యుత్‌ సాధించామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు.

10 టీఎంసీల కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.. మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులను బాగుచేశామని, దీంతో వ్యవసాయ స్థిరీకరణ, సాగుపెంపు సాధ్యమైందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులతో సాగువిస్తీర్ణం రెట్టింపు అయ్యిందని చెప్పారు.
వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విదేశాల నుంచి నూనెల దిగుమతిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఐటిసికి ఆసక్తి ఉంటే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పెట్టాలని సూచించారు. ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రజలు సహకారం అందించాలన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటిసి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా వైద్యారోగ్య, విద్యా రంగంలో ఐటిసి సహకారం అందించాలని, స్థానిక రైతుల నుంచి ముడి పదార్థాలు కొనాలని కోరారు. భూమి కోల్పోయినవారిని ఆదుకునే బాధ్యతపై అందరిపై ఉందన్నారు.ములుగు జిల్లా కమలాపురంలో రేయాన్స్‌ ఫాక్టరీని టేకప్‌ చేయాలని కోరారు. పరిశ్రమల వల్ల స్థానికులు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News