Sunday, December 22, 2024

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ట్యాంక్ బండ్ పై ఎర్ర కవాతు…పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా

మన తెలంగాణ/హైదరాబాద్ : భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కమ్యూనిస్టు యోధుల చేతిలో కుక్కచావు చవాల్సి వస్తుందనే భయంతో నిజాం అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి భారతదేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని విలీనం చేశారన్నారు. తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటంలో ఏమాత్రం పాత్రలేని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు సభలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలలో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్యాంక్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి మగ్దూం మొయినుద్దీన్ విగ్రహం వరకు సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ఎర్రకవాతు నిర్వహించారు. దారి పొడవున మహిళలు కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ ఎర్రజెండాలతో ర్యాలీ సాగించారు. మగ్దూం మొహియొద్దీన్ విగ్రహానికి నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఇ.టి.నరసింహ, సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ రాష్ట్ర నాయకులు బి.వెంకటేశం, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 11న రావి నారాయణ రెడ్డి, బద్ద ఎల్లా రెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, ఆరుట్ల కమాలాదేవిలు సాయుధ పోరాటానికి పిలుపు నిచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ స్టేట్ విలీన దినోత్సవాన్ని బిఆర్‌ఎస్, ఎంఐఎంలు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతామని ప్రకటించాయన్నారు. సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేని బిజెపి విమోచన దినోత్సవం పేరుతో సభలు నిర్వహిస్తుందని విమర్శించారు. బ్రిటిష్ పాలకులకు అనుకులంగా ఉన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటానికి ఏ విధంగా ప్రతిబింబం అవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఏ హడావుడి చేయని బిజెపి తెలంగాణలో ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు.

కమలం గుర్తు పెట్టుకొని, జి-20 సమావేశాలు నిర్వహించారని నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిని చూడగానే మోడీకి భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో విలీన దినోత్సవాన్ని అధికారంగా చెపట్టాలని నారాయణ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కేవలం ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. భూస్వాముల నుంచి భూములను రక్షించారన్నారు. గ్రామాల నుంచి భూస్వాములను తరిమికొట్టారని అన్నారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ భూమి కోసం, భూక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం, నిజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటంలో ఆర్ పాత్రం ఏమాత్రం లేదన్నారు. షోయాబుల్లాఖాన్, అల్లాఉద్దీన్, మహ్మద్ రఫీ లాంటి అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హింధూ, ముస్లిం వివాదంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. భూస్వాములు, దేశ్ ముఖ్ లను  పోరాటదారులు తరిమి కొట్టారని అన్నారు.  జి-20 పేరుతో ఢిల్లీలో 79 మురికివాడలను కుల్చివేశారని అజీజ్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రయాణ్ మిషన్ కు  రూ.640 కోట్లు ఖర్చు అవుతే, జి-20కి కేంద్రం వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. పేదలు, సామాన్యుల కోసం పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని విమర్శించారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, కాంపెల్లి శ్రీనివాస్, ఎం.డి. ఓమర్ ఖాన్, నగర నాయకులు ఆర్. శంకర్ నాయక్, చక్రిబాయి, జెర్రిపోతుల కుమార్, అమీనా, కొమురెల్లి బాబు, ఎస్.కె.లతీఫ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News