మన తెలంగాణా/హైదరాబాద్: తొమ్మిదవ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటిల్లో భారత జట్టుకు ఎంపికైంది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి మడావి కరీనా. కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కరీనా గత నెల 12, 13 తేదీల్లో లక్నోలో 200 మంది క్రీడాకారులతో ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తా చాటి, తొమ్మిదవ ఏషియన్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. మార్చి 18 నుంచి 25 వ తేదీ వరకు కుజకిస్థాన్ లో ఈ పోటీలు జరగనున్నాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన కరీనా, కష్టాలకు ఏమాత్రం కుంగిపోకుండా ఆటలపై కఠోరమైన సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశం నుండి ప్రాతినిధ్యం వహించే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశ జట్టుకు దక్షిణ భారతం నుండి ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా కరీనా నిలిచి అంతర్జా తీయస్థాయిలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పేరును నిలబెట్టింది.