Monday, December 23, 2024

మారుతున్న తెలంగాణ ముఖచిత్రం ‘నెనరు’

- Advertisement -
- Advertisement -

కవులు, రచయితలు, విద్యావంతులు, ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు ఇట్లా సమాజంలోని భిన్న వర్గాల వారు ఎవరు? ఏమి? ఎప్పుడు? ఎలా మాట్లాడాలి లేదా ఎలా మాట్లాడకూడదు అనేది ఇయ్యాల మీడియా నిర్దేశిస్తోంది. థాట్ పోలిసింగ్ చేస్తోంది. ఎవరికి వారు, వారి అనుభవం, విచక్షణ, జ్ఞానం ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారు. ఇదొక అయోమయ స్థితి. దీనికి భిన్నంగా మరోవైపు రాజకీయ నాయకులు తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే కవులు, రచయితల స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న సమయంలో రచయితల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను హరించేది ఈ రాజకీయ నాయకులే అనేది గ్రహించాలె. కొన్ని కులసంఘాలు తన పుస్తకాన్ని తగలబెట్టడంతో అందుకు నిరసనగా తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ ఇక పెన్ను పట్టేది లేదని తన నిరసనను తెగేసి చెప్పిండు. అంటే రచయితను భౌతికంగా కాకున్నా సాహిత్యపరంగా చంపేసినట్టే! ధబోల్కర్ లాంటి వారిని భౌతికంగా కూడా ఖతం చేసిండ్రు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానూ, తెలంగాణలోనూ ఇలాంటి భిన్న రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నది. రవీశ్ కుమార్ లాంటి నిక్కచ్చి జర్నలిస్టులకు వేదిక కల్పించిన ప్రణయ్‌రాయ్, రాధికారాయ్‌ల అధీనంలోని ఎన్డీటీవి ఛానల్ నిన్న మొన్నటి వరకు ప్రజల పక్షాన నిలబడి మోది ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ సంస్థపై కూడా ఈడీలను ప్రయోగించించారు. అయినా లొంగి రాకపోవడంతో ఏకంగా ఆ సంస్థను దొడ్డిదారిన ‘అదాని’ గ్రూప్ కొనేసింది. దొడ్లె కట్టేసుకుంది. దీంతో నిష్పక్షపాత మీడియా గొంతు నొక్కేసినట్లయింది. అలాగే కన్నడలో దేవనూరు మహదేవ అనే సీనియర్ రచయిత ఆర్‌ఎస్‌ఎస్ లోతు పాతులను అంచనా వేసి అది ఎలా ప్రజావ్యతిరేకమైనదో రాసినందుకు చంపేస్తామని రోజూ బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు. ఇదే కర్నాటకలో గతంలో గౌరీ లంకేష్‌ని మతోన్మాదులు చంపేసిండ్రని గుర్తుంచుకోవాలి.

సోషల్ మీడియాలో తాము ఎలాంటి బూతులు మాట్లాడినా చెల్లుబాటవుతుందనే దురహంకారం ఒకవైపూ, తమని (ప్రభుత్వాన్ని) నిలదీసే వారు ఎక్కడా నిలబడకుండా చేయడం మరోవైపు రెండూ ఏక కాలంలో జరుగుతున్నాయి. పొద్దున లేస్తే చాలు ప్రవచనకారులు స్త్రీలను కించపరుస్తూ ‘హితబోధ’లు చేస్తూ ఉంటారు. బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. అయినా ఈ ప్రవచనాలు వినేది ఎక్కువగా మహిళలే. ఈ ప్రవచనాల మధ్యన వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్లు చూసినట్లయితే ఈ విషయం ఈజీగానే అర్థమయితది. ఇదే ట్రెండును యూట్యూబ్ ఛానల్స్ కొనసాగిస్తున్నాయి.

చోటా మోటా యూట్యూబర్లు, యూ ట్యూబ్ ఛానళ్లు తాము నిలదొక్కుకోవడానికి ఒక వైపు అడ్డదారులు తొక్కుతూ, ఏదో ఒక పార్టీకి ‘భజన’ చేస్తూ మరోవైపు తాము పునీతులమైనట్టు ‘జ్ఞానబోధ’ చేస్తున్నారు. తమ వైపు నాలుగు వేళ్లు ప్రశ్నిస్తున్నాయనే సోయి లేకుండా ఎదుటి వారిని వేలెత్తి ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. మీడియా స్వేచ్ఛ మాటున హద్దుమీరి బూతులు మాట్లాడుతున్నారు. దుర్మార్గమేమిటంటే ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని అడ్డగోలుగా, ఎలాంటి నియంత్రణ లేకుండా బండ బూతులు తిడుతూ న్యూస్‌కు వ్యూస్‌కు తేడా తెలియకుండా యూట్యూబ్‌లో పోస్టులు పెడుతున్నవారికి మాంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లకు లక్షల సబ్‌స్క్రయిబర్లున్నరు.

అంటే ప్రజలు కూడా మాయమాటల్లో పడుతున్నారా? అనే అనుమానమొస్తుంది. ప్రభుత్వాల మీద తమకున్న వ్యతిరేకతను ప్రజలు యూట్యూబ్ సబ్‌స్క్రయిబింగ్ ద్వారా తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యతిరేకత ఎవరి నుంచి ఎందుకు వస్తుంది? అని ప్రభుత్వం గుర్తిస్తున్నదా! గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించేవారు. ప్రస్తుతం అంబేడ్కరిజం విసృ్తతంగా ప్రచారమవుతుండడంతో ఈ అన్ని విషయాలు చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నాయి. ప్రజలకు అర్థంగాకున్నా దార్శనికులైన రచయితలకు అర్థమయింది. అందుకే ఈ సంకలనంలో చదువు, అంబేడ్కరిజం, వృత్తి జీవితాల గురించి ఎక్కువగా కథలున్నాయి.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు విద్యద్వారానే తెలంగాణ సమాజంలో మెరుగైన, మేలైన మార్పులు వస్తాయనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని సీనియర్ కథకులు కాలువ మల్లయ్య, గాదె వెంకటేశ్‌లు చాటింపేసినట్టు చెప్పిండ్రు. అంబేడ్కరిజం, స్వేరోఇజాన్ని ఈ కథలు చిత్రికపట్టాయి. కాలువ మల్లయ్య కుక్క సద్ధి కథ అలాంటిదే! గాదె వెంకటేశ్ కథ ‘అర్బన్ అన్‌టచబిలిటీ’ కూడా విద్యద్వారానే కుల వివక్షను అధిగమించ వచ్చని చెప్పిండు. ఫూలెఅంబేడ్కర్ భావజాలంతో రాజ్యాధికారానికై పోరాటాలని రాసిండు. అదే సమయంలో వృత్తి జీవితాల్లో చోటు చేసుకుంటున్న మార్పులను కూడా ఇందులోని కథలు చిత్రించాయి.

చదువుకుంటే ప్రశ్నించడం అలవడుతుంది. ప్రశ్నిస్తే కొన్ని సమస్యలయినా ఎజెండా మీదికి వస్తాయి. కొన్నింటికైనా పరిష్కారం దొరుకుతుంది. భావజాల వ్యాప్తి జరుగుతుంది. అందుకే చదువు అనేది నేటి ‘లైవ్‌వైర్’. ఈ లైవ్‌వైర్‌లో కరెంటు పాస్‌గాకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. విద్యను ప్రయివేటు పరం జేస్తున్నాయి. ఒకటి రెండు శాతానికి మించి నిధులను విద్యారంగానికి కేటాయించడం లేదు. ఇట్లాంటి సమయంలో ఇందులోని కథలు దిశా నిర్దేశం చేసే విధంగా ఉన్నాయి. తెలంగాణ జనజీవనంలో వస్తున్న మార్పులు, కనుమరుగవుతున్న ‘నోస్తాల్జిక్’ సింబల్స్, మార్కెట్ మాయాజాలం, పెరిగిన రియల్ ఎస్టేట్ దందాలు, సాఫ్ట్‌వేర్ మాయాజాలం, పేదల బతుకులను కుప్పకూలుస్తున్న మద్యపానం ఈ సంకలనంలో రికార్డయ్యాయి. తెలంగాణ రైతు జీవితం గతం కన్నా మెరుగుపడింది. అయితే అర్బన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ‘డ్రగ్స్’కు బానిసలవుతున్నారు.

సమకాలీనంలో జరుగుతున్న ఈ విష సంస్కృతిని చిత్రిస్తూ చిత్తలూరి సత్యనారాయణ రాసిన ‘గోధుమరంగు పాము’ కథ ఇందులో ఉన్నది. వ్యవసాయంలో దేశంలో ఒకప్పుడు ముందున్న పంజాబ్ ఆ తర్వాత డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందంటూ ‘ఉడ్తా పంజాబ్’లాంటి సినిమాలొచ్చాయి. తెలంగాణలో కూడా నయారిచ్ మూలంగా డ్రగ్స్ పెరుగుతున్న తీరుని, దాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకతను చిత్తలూరి తన కథలో చెప్పిండు. నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మెరుగైన ప్రగతి సాధించిందని తాయమ్మ కరుణ లాంటి కథకులు గుర్తించారు. ఒంటరి స్త్రీలను వేధించే దుర్మార్గులకు బుద్ధిచెప్పడమే గాదు, దైన్యతను కూడా ధైర్యంగా ఎదుర్కొనే సాహస మహిళ గురించి చందు తులసి ‘తక్కెడ’ కథలో చెప్పిండు.

మోకుదెబ్బ పేరిట జాలిగామ భానుప్రసాద్ దొరల దౌర్జన్యానికి బలయిన గౌడ్‌ల జీవితాలను కథగా మలిచిండు. దొరలను ఎదిరించి సమైక్యంగా ధిక్కార స్వరాన్ని వినిపించాడు. అంగట్లో ఆధునిక ‘అభివృద్ధి’ మాయాజాలంలో ఆగమైతున్న బతుకుల గురించి శ్రీధర్, ఆధిపత్య వర్గాల దమనకాండను ఎదిరిస్తూ ధిక్కార స్వరాన్ని వినిపించిండు. నేతన్నల మగ్గం బతుకులను తాయమ్మ కరుణలు ఆర్ద్రంగా చిత్రించారు. ఇట్లా తెలంగాణ రాష్ర్టంలోని బహుజన జీవితాలను అద్దం పట్టారు. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు, బహుజనుల గురించి ఈ సంకలనంలోని కథలు పట్టించుకున్నాయి.
ఆగమైతున్న బహుజన జీవితాలతో పాటు మతఉన్మాదం ఎట్లా పెరిగిపోతుందో దాని వల్ల రాజకీయాలు ఎట్లా భ్రష్టుపట్టి భిన్న మతాల వారిని ఒకరి నుంచి ఒకరిని ‘దూరం’గా శత్రువులుగా ఎట్లా నిలబెడుతున్నాయో పెద్దింటి అశోక్ కుమార్ రాసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత నూతనంగా ప్రభుత్వ భవనాలు, కట్టడాలు వెలిసి అభివృద్ధి జరిగిందని గుర్తిస్తూనే భవిష్యత్‌ని అంధకారంగా మారుస్తున్న మతోన్మాదాన్ని బట్టబయలు చేసిండు.

అందరు కథకులు తెలంగాణ భాషా మాధుర్యాన్ని అందించినా దానికి మరింత తీపిని అద్దిన వారిలో తమ్మెర రాధిక ముందున్నారు. భాషను, వృత్తి మాండలికాలను, తెలంగాణకే ప్రత్యేకమైన నుడికారాన్ని భానుప్రసాద్ గౌడ్, వెల్దండి శ్రీధర్, పెద్దింటి అశోక్‌కుమార్, తాయమ్మ కరుణలు తమ కథల్లో చిత్రించారు.

మొత్తమ్మీద ఈ సంకలనంలోని కథలు మారుతున్న తెలంగాణ ముఖచిత్రాన్ని అద్దం పట్టాయి. ఆధునికత వైపు పయనిస్తూ ఐటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌ని మన్‌ప్రీతం ‘కేటి’ పేరిట రికార్డు చేసిండు. అఫ్సర్ కూడా కోవిడానంతర ఐటీ జీవిత పార్శ్వాలను కథగా మలిచిండు. తనదైన ముద్ర ఉండే ‘రొమాంటిక్’ కథను కిరణ్ చర్ల చెప్పిండు. అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్న రూరల్ లైఫ్‌ని కూడా కథలు చిత్రించాయి. తాయమ్మ కరుణ, వెల్దండి శ్రీధర్, పెద్దింటి అశోక్ కుమార్‌లు ఆ వేదనను ఆర్తితో అక్షరాలుగా మలిచిండ్రు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన నాటి నుంచి ‘తెలంగాణ కథ’ సిరీస్‌ని ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం తరపున వెలువరిస్తున్నాము. ఆ పరంపరలో ఇది తొమ్మిదో సంకలనం. గత తొమ్మిదేండ్లుగా తెలంగాణ కథా ప్రతిభకు పట్టం కడుతూ ఉన్నాము. ఇన్నేండ్లు తెలంగాణ నుంచి ఏ కథా సంకలనం ఇట్లా నిరంతరాయంగా వెలువడలేదు. వివక్షకు, విస్మరణకు గురైన కథా సాహిత్యాన్ని గర్వంగా తెలుగు సాహిత్యంలో నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమిది. మేము వెలువరించిన కథా సంకలనాలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. స్వయంపాలిత తెలంగాణ నడిచొచ్చిన తొవ్వకు ఈ సంకలనాల్లోని కథలు అద్దం పట్టాయి. నడుస్తున్న చరిత్రకు, నలుగుతున్న బతుకులకు, నీటి రాకతో మిగులుతున్న మెతుకుకు, ఐటీ రంగంలో వెలుగుతున్న దర్పానికి, నిరుద్యోగంతో మలుగుతున్న యువతను ఈ కథలు చిత్రికగడుతున్నాయి.

తెలంగాణ జీవితంలోని వెలుగునీడలను కండ్ల మందుంచుతున్నాయి. తెలంగాణ సమాజం నడిచొచ్చిన తొవ్వ జాడ కనుక్కోవడానికి ఈ కథా సంకలనాలు కరదీపికగా ఉపయోగపడుతున్నాయి. రాగద్వేషాలకు అతీతంగా, నీరక్షీర వివేకంతో చేస్తున్న ఈ పని థాంక్‌లెస్ జాబ్ అని తెలుసు. ఆర్థికంగా నష్టం అనే ఎరుకతోనూ ఉన్నాము. ఇందులో చోటు చేసుకున్న కథలకన్నా రాని కథలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంకలనాన్ని దాదాపు 1314 కథలతో వెలువరిస్తున్నాము. మా ఆర్థిక శక్తి ఇంతకు మించి లేకపోవడే ఈ పరిమితికి ప్రధాన కారణం. ఇంతకుమించి మెరుగైన కథలు లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. అయితే మా ఫోకస్ ప్రధానంగా తెలంగాణ జీవితాల్లో సమకాలీనంలో వస్తున్న మార్పుని, భిన్న కోణాల్లో, భిన్న సామాజిక వర్గాల వారు ఆవిష్కరిస్తున్న కథలపై ఉన్నది. తెలంగాణ సంస్కృతి, భాష, నుడికారాన్ని గుండె తడి అద్దిరాసిన వాటివైపు కాస్తంత మొగ్గు చూపిస్తూ ఉన్నాము. అంతేగాదు ఎక్కడా పుస్తక రూపంలో రాని కథలను తొలిసారిగా ‘కథాసిరీస్’లో ప్రచురించాలనే ప్రయత్నం వల్ల కూడా కొన్ని ‘యోగ్య’మైన కథలను మిస్సవుతున్నాము.

ఇందులో స్థానం దక్కని వారు చేటు మాటలు అంటారు. బురద పూసే పనీ చేస్తారు. అయినా ప్రతి యేటా స మయమూ, ఆర్థిక వనరులూ వెచ్చిస్తూ ఈ పనిచేయడానికి తె లంగాణ కథా సాహిత్యం మీది ప్రేమ తప్ప మరేమీ కాదు. భవిష్యత్ తెలంగాణ సాహితీ సౌధ నిర్మాణానికి ఈ కృషి అవసరమై న బాధ్యతగా భావిస్తున్నాము. మేము కరెక్ట్ తొవ్వలనే వెళ్తున్నా ము అనేందుకు యువ కథకులను మేము మొదట గుర్తించి ప్రో త్సహించడమే నిదర్శనం. ప్రతి సంకలనంలోనూ సీనియర్ కథకులతో పాటు కొత్త కథకులకూ స్థానం కల్పిస్తున్నాము. వారు తమ ప్రతిభను సానబెట్టుకోవడానికి తోడ్పాటునందిస్తున్నాము.

రాయలసీమ మిత్రుడు, కథకులు వేంపల్లె షరీఫ్ ఇటీవల ‘అన్వీక్షికి’ ప్రచురణ కోసం ‘యువ’ పేరిట నలభైమంది కథలను సంకలనం చేసిండు. అందులో తెలంగాణ నుంచి దాదాపు 11 మంది కథకులకు చోటు దక్కింది. ఆ 11 మందిలో ఒక్కరిద్దరు మినహా అందరి కథలను ‘తెలంగాణ కథ’ సిరీస్‌లో ప్రచురించినాము. తెలంగాణ యువ కథకుల గొంతుకై నిలిచినాము. యువ కథా ప్రతిభను గుర్తించడంలో మేము చేస్తున్న కృషికి ఇదొక కొండగుర్తు.
మా ఈ ప్రయత్నంలోని మంచి చెడ్డలను పట్టించుకొని, నీరక్షీర వివేకంతో ఎత్తిపట్టాలని పాఠకులను, విమర్శకులను, కథకులను, సాహిత్యాభిమానులను వేడుకుంటున్నాము..

-సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News