తెలంగాణ విభిన్నమైన సంస్కృతి గల ప్రాంతం. తెలంగాణ ప్రాంతం అనాదిగా సంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రాంతం. ఇదియే కాదు ఏ జాతి, ఏ ప్రాంతం ప్రజలు ఎంత కాదనుకున్నా సంప్రదాయాన్నీ అనుసరించి జీవనం సాగిస్తున్నవారే. ఎవ్వరూ సంప్రదాయానికి దూరంగా ఉండలేరు. అంతెందుకు సంప్రదాయ వ్యతిరేకులైన కమ్యూనిస్టులు సైతం మార్క్సిజాన్ని, వాటి సిద్ధాంతాలను, వాటి సూత్రాలను సాంప్రదాయబద్ధంగా అనుసరిస్తున్నవారే. ఆలోచిస్తే ఆటవికుల నుంచి నాగరికుల వరకూ ఏదో ఒక అంశంలో సాంప్రదాయ ఉల్లంఘన చేయకుండా పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే సాహిత్యంలో తెలంగాణ దేశంలో నూతన ఆలోచన విధానానికి 19వ శతాబ్దం నాంది పలికింది అని చెప్పవచ్చు. ఆ నూతన సాంప్రదాయాన్నీ సిద్ధం చేసినది దాశరథి యుగమున ఆయితే ఆ తర్వాత కాళోజీ, సినారె, ఎన్.గోపి వంటి కవులు తమ కవితా ప్రయోగాలతో తెలంగాణ కవిత్వాన్ని సుసంపన్నం చేశారు.సినారె అన్నట్లు ఏ ప్రయోగానికైనా సంప్రదాయ వాసన ఉండక తప్పదు. ఆధునిక కాలంలో భాష విషయంలో పునాది పడింది తెలంగాణ ఉద్యమంలో. ఇక ఈ ఉద్యమం ఒక్క ఉదటున పుట్టింది కాదు. మొలకగా మొలకేత్తి ప్రజలలో పాలనపై అసంతృప్తి కాస్త మర్రిచెట్టు మాదిరి పెరిగి విస్తరించింది. అదియే నూతన సంప్రదాయాలకు ప్రయోగాలకు దారితీసింది.
ఎప్పుడూ లేనిదీ కవిత్వంలో కొత్త పదాలు, మాండలిక పదాలుతో పాటుగా కొంత వెగటు, మొరటు పదాలు కూడా ప్రయోగింపబడ్డాయి. కవికి ఆగ్రహం ఒక దివ్యశక్తి అని చెప్పవచ్చు. అది ఉన్నప్పుడే కవిత్వం రక్తికడుతుంది. అలాంటి ఆగ్రహావేషాలే తెలంగాణ కవులలో కలదు. అదియే కవిత్వం ఆధారం. ఇక్కడి కవులకు నాటి వర్తమానంలో గల సమస్యలపై అవగాహన కలదు. అంతేకాదు భవిష్యత్ పరిణామాలపై కూడా అంచనఉంది. అందుకే కొందరు ఉద్యమంకు దూరంగా ఉన్నారెమో. అయితే కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఆయితే తెలంగాణలో స్థాపించబడినదో అప్పటి నుంచి ఆది సంప్రదాయవాదులకు అడ్డంకిగా మారింది. కమ్యూనిస్టులు సంప్రదాయములనూ నిరసిస్తూ పనిచేశారు. ఇదీ కొందరికి శరాఘాతంగా ఉండేది. తెలంగాణలో భాష ప్రత్యేకమైంది. అంతకుముందున్న కావ్యభాషతో పోలిస్తే పాల్కురికి సోమనాథుని తొలి శతకం ఒక ప్రయోగం.
మకుట నియమం, రగడ ఉదాహరణలు. ఇలా అన్నింటా పాల్కురికి సొంత రచనలు చేశారు. ఇవేకాదు చాలా సాహిత్య ప్రయోగాలకు పాల్కురికి ప్రథముడు. ఆ తర్వాత గమనిస్తే సాహిత్య చరిత్రలో నిలిచిపోగల సంస్థానం గద్వాల సంస్థానం. దీనిని ఏడుగురు రాజులు పరిపాలించారు. వారు రాజా చిన సోమభూపాలుడు (1762-93), రాజాచిన రామా భూపాలుడు (1794-1806), రాజా సీతారామ భూపాలుడు (18081840), రాణి లింగమ్మ (1840-44), రాజా మూడవ సోమ భూపాలుడు (1840-44), రాణి వెంకట లక్ష్మమ్మ (1844-75), రాజారాం భూపాలుడు (1803- 1907) ఈ ఏడుగురు పాలనలో చక్కని సాహిత్యం పోషణ జరిగింది. వీరి పాలనలో ప్రతి యేటా ప్రతి కార్తీక మాసంలో పండితులను, మాఘ మాసంలో కవి, గాయకులను సన్మానించే చక్కని సంప్రదాయాన్ని గద్వాలలో నెలకొల్పారు. ఈ సంప్రదాయం ఆధునిక యుగంలో కూడా కొనసాగుతూ వచ్చిందనీ ఆరుద్ర పేర్కొన్నారు. ఈ సత్ససంప్రదాయాన్నీ మొదలుపెట్టిన తాత గారి అడుగుజాడల్లో నడిచిన చిన సోమ భూపాలుడు స్వయంగా కవి. చక్కని పోషకుడు. ఇతనికీ సారస్వత వైభవాభినవ భోజ రాజా అనే బిరుదు కూడా కలదు.
ఆ తర్వాత కవులలో కాణదం పెద సోమయాజీ చతుర్విధ కవిత్వ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ముకుంద విలాసం,పేరిట సుభద్ర పరిణయంను కథగా రాశాడు. ఇందులోని విశేషాలు చమత్కారాలు కోకొల్లలు. ఈ కావ్యంలోని సొగసులు అనంతర కవి ఒకాయన తస్కరించడం జరిగిందంటేనే ముకుంద విలాసం గొప్పదనం చెప్పవచ్చు. (ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అధారంగా) చిన సోమన గారు జయదేవుని గీతగోవిందంలోని అష్టపదులను గేయానువాదం చేశాడు. అష్టపదిలోని పల్లవి చరణంలకు ప్రయోగంగా శ్లోకం, ద్విపద, చూర్ణిక, దరువు అనే వాటిని వాడి రచన పెంపు సొంపులు పెంచాడు. ఇదీ ఇప్పటికీ మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉంది. మదుకూరి పండరీనాథం హనుమకొండలో ఉండేవాడు. ఇతడు ఆధ్యాత్మ రామాయణంను తెనుగించినాడు. ఇది ఒక విధంగా ప్రయోగమే అనీ చెప్పవచ్చు. రామాయణంలో ఉండే అంతర్లీన విషయాలను ఆధ్యాత్మ రామాయణం చెప్పింది.
రొటీన్ కల్పనలు, రొటీన్ శిల్పాలు, పాత వర్ణనలు ఇవ్వన్నీంటిని దాటి 19వ శతాబ్దంలో తెలంగాణలో ఎన్నో ప్రయోగాలు, ఎంతో వైవిధ్యమైన రచనలు రావడం జరిగింది. తెలంగాణలో దాశరథి కొత్త గొంతుక వినిపించగా, కాళోజీ అలాంటి సంప్రదాయాన్ని అనుసరించాడు. కాళోజీ రచించిన నా గొడవ రచన కేవలం ఆత్మఘోష మాత్రమే కాదు. అది ఒక అస్తిత్వ ప్రతిపాదన. తెలంగాణలోని పాలన, రాజకీయాలు తగాదాలు, అరాచకాలు, నియంతృత్వం ఇలాంటివన్నీ గల తెలంగాణ వృక్షమునకు నా గొడవ చెంపపెట్టు. ఈ రచన కేవలం కాళోజీ సంబంధించి మాత్రమే కాదు అది ఒక అస్తిత్వ గ్రంథం. దానిని అనుసరిస్తూ అస్తిత్వ చైతన్యంను భుజముల మీద వారెందరో కలరు. అందరికీ ఎంతో కొంత పాత సంప్రదాయాలు లేకపోలేదు. పాత వాసనలతో కొత్త రుచులు కొనసాగించడమే ప్రయోగం. ఇదీయే భావకవిత్వంకు పునాది అనీ చెప్పవచ్చు.
1933లో నవ్యసాహిత్య పరిషత్ స్థాపిస్తే 1943లో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. 1969లో తెలంగాణలో జరిగిన ఉద్యమం సంఘటనలు తెలంగాణ కవిత్వం మీద పరోక్ష ప్రభావాన్ని చూపెట్టాయి. అప్పటి యువతరం రాజకీయ వైముఖ్యాన్నీ అవలంబించుటకు కారణం అయ్యాయి. తెలంగాణ కవులు బిరుదులు, పదవులు సన్మానాలపై విముఖత చూపుతూ రాష్ట్ర ఆవిర్భావానికి తోడ్పాటు అందించారు. 1953లో నవ్వని పువ్వు అనే రచనతో తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టారు సినారె. అంతకు ముందు కవులు తెలంగాణ కవిత్వం అని, విప్లవ కవిత్వం అని, అభ్యుదయ కవిత్వం అని కొత్త పుంఖానుపుంఖలుగా దారులు తొక్కుతుంటే సినారె మాత్రం శృంగార రసాత్మకమైన కావ్యాల వైపు మొగ్గు చూపారు.
అంతేకాదు చారిత్రక రచనలకు శ్రీకారం చుట్టారు. కర్పూర వసంత రాయలు, విశ్వనాథ నాయకుడు వంటి చారిత్రక వీరుల గాథలు రచించి ప్రజానీకంకు ఇలాంటి రచనలపై ఆసక్తి పెంచేలా చేశారు. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. దీని మొదటి సమావేశం తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరగగా, రెండవ సమావేశం 1944 డిసెంబర్ 29-31 జులై తేదీలలో విజయవాడలో జరిగింది. ఆ సభలో కార్యవర్గ విస్తరణ జరిగింది. ఆ కార్య వర్గంలోని వట్టికోట ఆళ్వారుస్వామి ప్రవేశించి క్రియాశీల పాత్ర పోషించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కొందరు తెలంగాణ కవులు విశాలాంధ్ర కోరుకున్న వారు ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం ఆగలేదు. అలాగే 1955లో 5వ మహాసభలో విజయవాడలో అభ్యుదయ రచయితల సంఘంలో కాళోజీ కలసి కార్యవర్గంలో క్రియాశీల భూమికను పోషించారు. వచన కవిత్వం ప్రారంభంలో కొందరు కవులు దగ్గర్లో ఉండే మాత్రా ఛందస్సు తలపించే వచన గీతాలు రాశారు. వచన కవిత్వం ప్రయోగంగా వచ్చిన రోజులలో వీళ్ళకు ఛందస్సు రాదు అందుకనే వచనం రాదు అనే విమర్శలు బయలుదేరాయి.
కానీ మన తెలంగాణ కవులలో దాశరథి మినీ కవిత్వమే కాదు వృత్త పద్యాలు రాయడంలో కూడా దిట్ట. అంతేకాదు వచన కవిత్వంలో అక్షర గణకవిత్వాన్ని లక్షణంగా చెప్పగల దాశరథి కొత్త ప్రయోగాలు చేయడానికి తెరతీశాడు. అలా దాశరథి మస్తిష్కంలో లేబోరేటరీ అనే కవితను రాశారు. తెలంగాణలో హైదరాబాద్ రాజధాని కాగానే గేయ కవిత్వం తగ్గుముఖం పట్టి వచన కవిత ప్రయోగంగా పుంజుకొంది. అనేక ప్రయోగాలకు దారి తీసింది. టెక్నిక్, ఛందస్సు, గణవిభజన లో చిక్కుకుపోయిన కవిత్వానికి కొత్త ఊపిరి వదిలింది వచన కవిత్వం. ఈ కవిత్వం ప్రజలకు దగ్గరగా వెళ్లి వాళ్ళ అవగాహనకు వీలైన భాషనే వాడింది. ఇక ఆ తర్వాత వచ్చిన దిగంబర కవులలో కూడా తెలంగాణ కవులు ఉన్నారు. వీరు ఎన్నో ప్రయోగ విన్యాసాలు చేశారు. ఇక్కడ ప్రజలు భుక్తి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడారు. సంప్రదాయాలకు భిన్నంగా గేయాలు, గీతాలు, పాటలతో అభ్యుదయ దృక్పథంతో రచనలు చేశారు.
ఇలాంటి ప్రక్రియలు లేకపోతే తెలంగాణ ఉద్యమంను, ఏ ఉద్యమం నైనా సరే ఊహించలేం. ఉదాహరణకి ఒక సంఘటన చూస్తే కక్ష వలనో, కారుణ్యం వలనో నర్సిరెడ్డి అనే వ్యక్తిని అతని శత్రువు హతమార్చాడు. అతని బంధువులు చిందే నెత్తురునీ బిందెల్లాంటి కడువలల్లో పట్టారు. గుర్తు తెలియకుండా ఉండాలనీ జాగ్రత్తపడ్డారు. నర్సిరెడ్డి పై అతని మిత్రులు ఒక పాట కట్టుకున్నారు. ఈ పాటయే శివసాగర్ గారు రాసిన నరుడో… ఓ భాస్కరుడా అనే పాటకు ప్రేరణ కావచ్చు అని ఆరుద్ర అన్నారు. నిత్యజీవితంలో పగ తీర్చుకోలేనివారు పాటతో అవమానం చేసి నవ్వుకున్నారు. గ్రామ పాలన వర్గంలోని ప్రముఖులను ఎంతో వ్యంగ్యంగా జానపదులు హేళన చేయగలను చేయగలరనీ దేవరాజు మహారాజు అంటారు. పాటల ప్రయోగాలు తెలంగాణకు ప్రత్యేకం. తెలంగాణలోని వివిధ జిల్లాలోని దోపిడీదారుల ఆస్తి వివరాలు చూస్తే కూడా అంత విస్తీర్ణం అయ్యిందనీ తెలుస్తుంది.
సూర్యాపేట తాలూకాలోని జిన్నారెడ్డికి ఒక లక్ష 50 వేల ఎకరాల భూమి ఉండేదట, ఖమ్మం జిల్లా మధిర తాలూకా కల్లూరు దేశ్‌ముఖ్‌కు కూడా లక్ష ఎకరాలు ఉండేవట. ఇలాంటి భూస్వాముల చేతుల్లో చిక్కిన ప్రజలు తెలంగాణలో ఉద్యమంలో పాల్గొ న్నారు. అంతేకాదు సాధించిన ప్రతి విజయం మీద, వీర పోరాటం లో నేల ఒరిగిన ప్రతి వీరుని మీద ప్రజలు ఆనాడు పాటలు రాసుకున్నారు. సంవత్సరాల నుంచి జరుగుతున్న సంప్రదాయం నేడు సంఘ సంస్కరణ భావాలతో మార్పు చెందుతుంది. అది కొత్త తేజస్సుకు కొత్త దారికి తెర తీసింది. సాహిత్యంలో భావాలలో, భాషల్లో తెలంగాణ కవులు మార్పులు సాధించారు. ఇలాంటి విషయాలపైన ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
ఐ.చిదానందం
8801444335