Friday, November 22, 2024

చరితార్థుడి ‘చరితార్థులు2’

- Advertisement -
- Advertisement -

ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వ కారణం?/ వైషమ్యం, స్వార్థపరత్వం/ కౌటిల్యం, ఈర్ష్యలు,స్పర్థలు/ మాయలతో మారు పేర్లతో/ మన చరిత్ర గతిని మార్చేశారు/కుటిల శక్తుల మాయలతో/ బలవంతుల దౌర్జన్యాలతో./ మత శక్తుల పన్నాగాలతో/ మసిబారె చరిత దేశ భవిత/ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి/ ఒక జాతిని వేరొక జాతి/ పీడించే సాంఘిక ధర్మం/ ఇంకానా! ఇకపై సాగదు/ ఇతిహాసపు చీకటి కోణం/ అట్టడుగున పడి కాన్పించని/ త్యాగాల కథలన్నీ కావాలిప్పుడు/ దాస్తే దాగనిది చారిత్రక సత్యం!!/ (శ్రీశ్రీ గారికి క్షమాపణలతో)/ మన చరిత్ర అంతా ఆధిపత్య వర్గం కన్నుసన్న/ ల్లోలిఖించబడింది. వలస పాలకుల ఆదేశాల నీడలో పెరిగిన ’బోన్సాయి’ చెట్టు మన దేశ / చరిత్ర. ముఖ్యంగా భారత స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన చాలామంది అజ్ఞాత వీరుల వివరాలు వెలుగులోకి రాలేదు.

దేశం కోసం/ త్యాగంచేసిన యోధులు ఎంతో మంది గుర్తింపు/ లేకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రలో కొందరికి మాత్రమే పేరొస్తుంది. అందరికీ రాదు. అర్హత. త్యాగశీలత వున్నా, అవి అక్కరకు రాకుండా పోతాయి. దీనికి రాజకీయ, సామాజిక, మతేతర కారణాలెన్నో వున్నాయి. అయితే&. చారిత్రక నిజాలు తాత్కాలికంగా మరుగునపడి/ పోవచ్చు.కాలగర్భంలో కలిసిపోవచ్చు. కానీ ఓసమయమంటూ వస్తుంది. అప్పుడు మట్టిలో కలిసిన నిజాలు మాణిక్యాల్లా బయటకు వస్తాయి. నిజాల వెలుగులు విరజిమ్ముతాయి. నిజాలు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చుగాక, శాస్వతంగా నిజాల్ని పాతిపెట్టి వుంచడం ఎవరి తరమూ కాదు. అలాంటి నిజాలు కొన్ని ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఇంకా ఎన్నో సత్యాలు బయటకు రావలసివుంది. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల త్యాగాలు, పాత్రకు సంబంధించిన ఎన్నో నిజాలు ఉద్ధేశ్య పూర్వకంగా దాచబడినాయి. ఇంకొన్ని వక్రీకరించబడ్డాయి. భారత స్వాతంత్య్ర సమరంలో ఎందరో ముస్లిం యోధులు తమ ధన, మాన,ప్రాణాల్ని దేశం కోసం అర్పించారు. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా మడమ తిప్పకుండా పోరాడారు. దేశమాత నుదుటన ‘వీరతిలకం’ దిద్దారు. అయినా, వారిలో చాలా మందికి గుర్తింపు లేకుండా పోయింది.

అసలు వాళ్ళ పేర్లు కూడా దేశ భక్తుల (యోధుల) జాబితాలో లేకుండా పోయాయి. చరిత్రలో ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అలా మన చరిత్రకు పట్టిన ’చెద ’ వల్ల మరుగునపడ్డ నిజాలనేకం. అయినా,కాలం ఎల్లవేళలా ఒకేలా వుండదు. మట్టిలో కూరుకుపోయిన మాణి క్యాల విలువ తరగదు. అవి ఎప్పటికైనా, బయట పడక మానవు. అప్పుడు ’దూద్ కాదూద్ పానీకా పానీ’ లాగా నిజాలేమిటో, వరుసగా ఒక్కొక్కటీ బయటకు వస్తాయి. నిష్పక్షపాత చారిత్రక పరిశోథకులు వస్తారు. బూజుపట్టిన రికార్డుల దుమ్ముదులిపి, కాల గర్భంలో నిక్షిప్తమైన చారిత్రక ‘సత్యాల’ను వెలికితీసి లోకానికి చాటి చెబుతారు. అప్పుడు త్యాగాలు, దేశభక్తిమూర్తీభవించిన &‘విస్మృత’ స్వాతంత్య్ర సమర యోధులు చీకటి తెర చీల్చుకొని మన ముందుకు వస్తారు. నిజానిజాలు వెల్లడవుతాయి.

చరిత్రకు పట్టిన ’వివక్ష గ్రహణం’ వదిలి పోతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా గత 25 యేళ్ళ నుండి ఓ జర్నలిస్టు చారిత్రక పరిశోథకుడిగా మారి, భారత స్వాతంత్య్రోద్యమంలో మరుగున పడిన ముస్లిం యోధుల వివరాలను తవ్వి బయటకు తీస్తున్నాడు. విస్మృత నిజాల తెరను తొలిగించి నిప్పులాంటి సత్యాలను ఆవిష్కరిస్తున్నాడు. అతని పేరు సయ్యద్ నశీర్ అహమ్మద్. వృత్తి రీత్యా జర్నలిజంలో అడుగుపెట్టి, అప్పట్లో ’ఉదయం’, ‘వార్త’ దినపత్రికలో రిపోర్టర్‌గా క్రియాశీలకంగా పనిచేశాడు. చివరకు 2004 లో జర్నలిజం వృత్తికి స్వస్తి పలికి, పూర్తికాలం చారిత్రక పరిశోధనకు అంకితమయ్యాడు. స్వాతంత్రోద్యమంలో ముస్లింలత్యాగాలు, పోరాటాలు బలిదానాలకు సంబంధించి చరిత్రలో మరుగుపడిన నిజాలను వెలికితీస్తూ,గత మూడుదశాబ్దాలుగా అహర్నిశం చరిత్రను శోధిస్తూ, అధ్బుతమైన ఫలితాలను సాధిస్తున్నాడు.చారిత్రక పరిశోథకుడిగా ముఖ్యంగా స్వాతంత్య్ర సమరంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర గురించి ఆయన చేసిన /చేస్తున్న పరిశోధన ఎంతో విలువైంది. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు నిర్వహించిన పాత్ర గురించి ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఘోషా.. పరదా వంటి సాంప్రదాయిక కట్టుబాట్లు, నియమాల్ని దాటి ధైర్యంగా బయటకు వచ్చి ముస్లిం మహిళలు ఎలా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నదీ, భాగస్వాములైనదీ తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకోక మానవు. ఈ క్రమంలో నశీర్ అహమ్మద్ ఇప్పటి వరకు 23 బృహత్తర చరిత్ర గ్రంథాలను తెలుగు పాఠకులకు అందించారు. ఈ పుస్తకాలు ఆంగ్లం, ఉర్దూ, గుజరాతీ, తమిళం, కన్నడం హిందీ భాషల్లో అనువదించారు..

నశీర్ అహమ్మద్ గ్రంధాలు : 01. భారత స్వాతంత్రోద్యమం : ముస్లింలు, 02. భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు, 03. భారత స్వాతంత్రోద్యమం : ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, 04. మైసూరు పులి : టిపూ సుల్తాన్, 05. భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం ప్రజా పోరాటాలు, 06. షహీద్ యే ఆజం : అష్ఫాఖుల్లా ఖాన్, 07. చిరస్మరణీయులు (ప్రథమ భాగం), 08. చరితార్థులు (ఆల్బమ్), 09. భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు, 10. భారత స్వాతంత్య్ర సంగ్రామం : ముస్లిం యోధులు (ప్రథమ భాగం), 11. 1857 : ముస్లింలు, 12. అక్షరశిల్పులు, 13. ఆజాద్ హింద్ ఫౌజ్ : ముస్లిం పోరాట యోధులు, 14. కువైట్ కబుర్లు, 15. గాంధీజీ ప్రాణ రక్షకుడు : బతక్ మియా అన్సారీ, 16. మహాత్మా గాంధీ : ముస్లిం అనుచరులు సహచరులు, 17. పండిత రాంప్రసాద్ బిస్మిల్ – అష్ఫాఖుల్లా ఖాన్, 18. బిస్మిల్ : అష్ఫాక్ , 19. కవిరాజు డాక్టర్ ఉమర్ అలీ షాహ్, 20. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు : ఫాతిమా షేక్, 21. చరితార్ధులు2, 22. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం : హిందూ – ముస్లింల ఐక్యత.

భారత ఉపఖండం లో తొలి గ్రంథం : ‘చరితార్ధులు.’ The Immortals.!!/ ముస్లింలను అనుమానంగా చూసేవారికి సయ్యద్ నశీర్ అహమ్మద్ 2014 లో వెలువరించిన ‘చరితా ర్థులు‘ పుస్తకం ఓ ‘మేలుకొలుపు‘. దారిదీపం& చూపుడువేలు&భారత స్వాతంత్య్రోద్యమంలో తమ జీవితాల్ని పణంగా పెట్టి తెల్లదొరల్ని ఎదిరించి మరుగున పడిన ముస్లిం సమర యోధుల్ని వెలుగు లోకి తెచ్చిన చారిత్రక సత్యాల సమాహారదర్శనమిది.! భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమ ఘట్టం ఎంతో సుదీర్ఘమైంది (1757-1947 ) చరిత్ర పుటలు తిరగేసి,ఈ సుదీర్ఘ కాలంలో దేశంకోసం పోరాడిన వారి వివరాలు సేకరించి, ఆయా సంవత్సరాల వారీగా వర్గీకరించి, వరుస క్రమంలో కూర్చడం ఎంతో కష్టం. ఇంత కష్టాన్ని కూడా నశీర్ అహమ్మద్ ఎంతో ఇష్టంగా చేశాడు. 1757నుండి 1947 వరకు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న 155 మంది ముస్లింయోధుల చిత్రపటాలు, వారి జీవితం, పోరాటాలు, త్యాగాలకు సంబంధించిన సంక్షిప్త వివరాలతో తెలుగు, ఇంగ్లీషు భాషలులో ఫొటోలతో కూడిన ‘చరితార్ధులు ‘ ఆల్బమ్ ఇది బెంగాల్ నవాబ్ సిరాజుద్దేలా (1733..1757), మీర్’ ఖాసిం ఆలీ ఖాన్ ( 1777), హైదర్ ఆలీ (1722-1752) టీపూసుల్తాన్ (1750-1799), మొదలుకొని ఖాదర్ మొహియుద్దీన్ (1926) వరకు వారి జీవిత వివరాల్ని పొందుపరిచాడు. అచిర కాలంలోనే విశేషాదరణ పొందిన ఈగ్రంథం వివిధ భాషల్లోకి అనువదింపబడింది. గత చరిత్ర తెలీని వారికి ఈ ‘ఆల్బమ్‘ గైడ్ లా ఉపయోగ పడుతుంది.ఇటువంటి అమూల్యమైన ఆల్బమ్ ఇచ్చి నశీర్ అహమ్మద్ నిజంగానే చరితార్థుడయ్యాడు.

ప్రస్తుత ‘చరితార్ధులు-2 (The Immortals-2): భారత్ దేశవ్యాప్తంగా విశేషాదరణ పొందిన ‘చరితార్ధులు‘కు పొడిగింపుగా ఇప్పుడు ‘చరితార్ధులు-2 / The Imortals -2‘ పుస్తకాన్ని 2022లో వెలువరించాడు. ఈ గ్రంథం కూడా ‘చరితార్ధులు‘ గ్రంథం లాగే తెలుగు,ఇంగ్లీషు భాషల్లో వుంది..! ‘చరితార్ధులు‘ 2014 లో ప్రచురితమయ్యాక నశీర్ తన పరిశోధను కొనసాగించి 2022 వరకు మరో180 మంది ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను, వారి జీవిత వివరాలను సేకరించాడు. ఈ 180 మందితో ‘చరితార్ధులు – 2‘ తెద్దామనుకున్నాడు. అయితే గ్రంధ విస్తరణ భీతివల్ల 155 మంది తోనే ‘చరితార్ధులు-2‘ గ్రంధాన్ని తీసుకు వచ్చాడు. ఈ నూతన ‘చరితార్ధులు – 2‘ గ్రంథంలో 1780 నుండి 1947 వరకు బ్రిటీష్ వలసపాలకుల కు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని ముస్లింయోధుల చిత్రపటాలు, వారి సంక్షిప్త వివరాలను పొందుపరిచారు. రాజులు, రాజ ప్రముఖులు, సైనిక ప్రముఖులు, సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, సాహసిక సైనికులు, సామాన్య ప్రజల చిత్రాలు, ఆయా సమర యోధుల వివరాల్ని ఇందులో చూడొచ్చు, చదవవచ్చు.

ఈ చిత్రాల్లో కొన్ని ఊహాపరంగా చిత్రించినవి కూడా వున్నాయి. విజయవాడకు చెందిన చిత్రకారుడు శ్రీ షేక్ అబ్దుల్లా ఆల్బమ్‌లోని అత్యధిక చిత్రాలను చిత్రీకరించారు. వినుకొండకు చెందిన చిత్రకారుడు శ్రీ వజ్రగిరి జెస్టిస్ చిత్రించిన కొన్ని చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో 1780 నాటి సుబేదార్ షేక్ అహ్మద్ తో ఆరంభమయ్యి మజ్నుషా ఫకీర్, అసిఫ్ జా మిర్జా వజీర్ అలీఖాన్, నవాబ్ ..మిర్జా షంషుద్దీన్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అలావి ..తంగల్, నవాబ్ అబ్దుర్ రహమాన్ ఖాన్, మౌలానామహమ్మద్ బాఖర్, రాయ్ అహ్మద్ నవాజ్ ఖాన్, సర్దార్ హిక్మతుల్లా ఖాన్, మౌల్వీ ఇమాం బక్ష్ సహబాయి, షేక్ పీర్ షా, సుబేదార్ నాదిర్ ఆలీఖాన్, మానత్ ఆలీ, మౌలానా ఫైజ్ అహ్మద్ బదాయాని, బక్షిష్‌ఆలీ, నవాబ్ అహ్మద్ ఆలీఖాన్, బేగం అజీజున్, మౌలానా ఖిఫాయత్ అలీఖఫీ, వలీషాహ్, నవాబ్ ఆలీ మొహమ్మద్ ఖాన్, బేగం మొదలుకొని ముల్లాహ్ అక్బర్ ఆలీ, మీర్జా నశీం బేగ్ చెంగేజి, షేక్ రంజాన్ ఖురేషి, బేగం హమీదా హబీబుల్లాహ్, మౌలానా షౌకత్ ఆలీ హష్మీ, ముహమ్మద్ యూనస్ లోహియా, ముహమ్మద్ బాజి (1917-2019) తదితరుల కూడిన మొత్తం 155 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల తోపాటుగా ఆ సమర యోధుల వివరాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో ఇందులో వున్నాయి. ఈ పుస్తకానికి ప్రొఫెసర్ రాం పునియాని పరిచయ వాక్యం రాశారు. నశీర్ తెలుగు వెర్షన్ ను అయన మిత్రుడు, నరసరావుపేటకు చెందిన శ్రీ భువనగిరి వెంకట కృష్ణ పూర్ణానందం ఆంగ్లీకరించారు.

‘నశీర్ అంటే చరిత్ర.’. ‘చరిత్ర అంటే నశీర్’: అన్నట్లు గత మూడు దశాబ్దాలుగా ఆయన జీవన ప్రస్థానం కొనసాగుతోంది. ఈపని తప్ప. ఆయనకు వేరే పనిలేదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఒకటే ఆలోచనపరిశోథన, సమాచార సేకరణ, విశ్లేషణ, రచన. ఇదే ఆయన దినకృత్యం. కంప్యూటర్ ముందు కూర్చొనిటైప్ చేసుకోవడం మినహా &మరో పనిలేదు. నిత్యంఒకటే ధ్యాస&& ఒకటే ఆశ. చరిత్రగర్భంలో కూరుకుపోయిన ముస్లిం స్వాతంత్య్రసమర యోధుల జీవితాలను వెలికి తీసి, లోకానికి చాటాలన్న ఒకే ఒక ధ్యేయం..ఆయనది..!! అవిశ్రాంతంగా, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల మహోన్నత పాత్రను, తన వినూత్న పరిశోధనాత్మక చరిత్ర రచనల ద్వారా, పలు ప్రచార కార్యక్రమాల ద్వారా, ప్రజలకు ఎరుక పర్చుతూ గత రెండున్నర దశాబ్దాలుకు పైగా సయ్యద్ నశీర్ అహమ్మద్ సాగిస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా పలు ప్రాంతీయ, జాతీయ స్థాయి సంస్థలు అవార్డులు, పురస్కారాలతో సత్కరించాయి.
చరితార్ధులు-2, పేజీలు-366, ప్రకటిత ఖరీదు : రూ.1000-00, ప్రతులకు: తెలుగు బుక్ హౌస్, # 3.3.862, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ – 500027. ఫోన్ నెం. 040-65347374, రచయిత, 9440241727.

అబ్దుల్ రజా హుస్సేన్
9063167117

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News