Sunday, December 22, 2024

దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్: డిజిపి అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం, బచ్‌పన్ బచావో ఆందోలన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి మంగళవారం ఎస్‌ఐపియు, ఎహెచ్‌టియు, ఎఎల్‌ఒ, సిడబ్లూసి, డిసిపియు, ఎన్‌జిఒలలతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ -రెస్క్యూ, పునరావాసంపై రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ సదస్సు కు ముఖ్య అతిధిగా హాజరైన డిజిపి మాట్లాడుతూ, సమాజానికి ముప్పుగా పరిణమించిన మానవ, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకై పోలీస్ శాఖ పాటు స్వచ్ఛంద సంస్థలు కలసి కట్టుగా పనిచేయాలని కోరారు.

ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడానికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని వీటిని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి నిర్వహించే అన్ని కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజి షీకా గోయల్ పేర్కొన్నారు. అన్ని పోలీసు జిల్లాల్లో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్ర పోలీసులు మానవ అక్రమ రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.

దీనివల్లనే, డబ్ల్యుఎస్‌డబ్ల్యు, ఎహెచ్‌టి విభాగాల సంయుక్త కృషితో గత రెండేళ్లలో 738 కేసులు నమోదుచేసి , 1961 మంది నిందితులను అరెస్టు చేశామని షికా గోయల్ వెల్లడించారు. అదేవిధంగా, 110 మంది నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో ఎహెచ్‌టియు యూనిట్ పోలీసు యూనిట్లకు సహాయం చేస్తోందని, తెలంగాణలో గుర్తించిన పిల్లల శాతం (96%)తో దేశంలోనే అత్యధికంగా ఉందని ఆమె తెలిపారు.
డబ్లూఎస్‌డబ్లూ, ఎన్‌జిఒలు, ఇతర వాటాదారుల సహకారంతో రెస్క్యూ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందన్నారు. ప్రొఫెషనల్ డేటా మేనేజ్‌మెంట్ ద్వారా ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేక మెకానిజంను అభివృద్ధి చేసే ప్రక్రియలో మహిళా భద్రతా విభాగం ఉందని ఆమె వెల్లడించారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి చట్టంలోని నిబంధనల గురించి వివరించారు. ఈ నేరాల మూలాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్గాన్ ట్రేడింగ్ అనే అంశంపై సిఐడి
విభాగం అడిషనల్ డిజి మహేష్ భగవత్ ప్రసంగించారు. అవయవ వ్యాపారంలో వస్తున్న కొత్త పోకడల గురించి, కేసులను నిరోధించే, బాధితులను రక్షించే ,గుర్తించే పద్ధతులను వివరించారు. ఈ సదస్సులో ఎన్డీఆర్‌ఎఫ్ రిటైర్డ్ డిజి డా. పి.ఎం.నాయర్, మహిళా భద్రతా విభాగం ఎస్‌పి పివి పద్మజ, అడిషనల్ ఎస్‌పి పి.అశోక్ తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు. ఈ వర్క్‌షాప్‌లో పోలీస్, లేబర్, మహిళా శిశు సంక్షేమ శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News