Friday, November 22, 2024

నామినేషన్ వేసిన ఎలక్షన్ కింగ్!

- Advertisement -
- Advertisement -

నటుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే పద్మరాజన్ ఎలక్షన్ కింగ్! ఎవరీ ఎలక్షన్ కింగ్..  ఏమా కథ అనుకుంటున్నారు కదూ. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా ఓ టైర్ల రిపేర్ షాపు యజమాని. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయన ప్రవృత్తి.  అక్కడా ఇక్కడా అని లేదు. ఎవరిపై పోటీ చేస్తున్నామన్నదీ చూసుకోడు. ఎక్కడికైనా వెళ్లి, ఎవరిపైనైనా నామినేషన్ వేసి, తొడగొట్టి, బరిలోకి దిగడం అతని నైజం. ఇప్పుడీ ఎలక్షన్ కింగ్ గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి, ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే సవాల్ విసురుతున్నాడు మరి! ఇది అతను దాఖలు చేసిన 237వ నామినేషన్ కావడం ఓ విశేషం.

తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ని అందరూ ‘ఎలక్షన్ కింగ్’ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. 1988లో మొదటిసారి మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి నామినేషన్ వేశాడు. ఇక అప్పటినుంచీ ఇప్పటివరకూ 236సార్లు ఎన్నికల్లో పోటీకి దిగాడు. గెలిచామా లేదా అన్నది కాదు… నామినేషన్ వేశామా లేదా అన్నదే పద్మరాజన్ లెక్క. స్థానిక ఎన్నికలనుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ నామినేషన్లు వేస్తూనే ఉంటాడు. ఇందుకోసం ఇప్పటిదాకా కోటి రూపాయల వరకూ ఖర్చయిందట. అటల్ బిహారీ వాజపేయి, పివి నరసింహారావు వంటి దిగ్గజాలపైనా తాను పోటీ చేశానని అతను గర్వంగా చెబుతాడు.

ఇన్నిసార్లు నామినేషన్ వేసినా, పద్మరాజన్ ఎప్పుడూ ఎక్కడా గెలవలేదని వేరే చెప్పాలా? ఒకసారి మెట్టూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసినప్పుడు మాత్రం తనకు 6,273 ఓట్లు వచ్చాయనీ, ఇన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా, అవే తనకు అత్యధికంగా వచ్చిన ఓట్లనీ ఆయన గర్వంగా చెప్పుకుంటాడు. కొన్ని పంచాయతీ ఎన్నికల్లో తనకు అసలు ఓట్లే పడలేదని అంతలోనే బిక్కమొహం పెడతాడు.

గజ్వేల్ లో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం, పద్మరాజన్ వార్షికాదాయం లక్ష రూపాయలు. రూ. 1,10,000 విలువ చేసే చరాస్తులు, ఒక మోపెడ్ ఉన్నాయి. ఎన్నడూ ఆదాయం పన్నురిటర్స్న్ దాఖలు చేసిన పాపాన పోలేదట. ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్న పద్మరాజన్, ప్రస్తుతం తాను అన్నామలై ఓపెన్ యూనివర్శిటీలో ఎంఎ చదువుతున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News