Friday, December 20, 2024

తెలంగాణలో సీట్ల పంపకంపై బిజెపి-జనసేన కసరత్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై బిజెపి, జనసేన పార్టీ మధ్య చర్చలు జరగనున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కలసి పనిచేయాలని ఆయన వారిద్దరికీ సూచించారు. తాను హైదరాబాద్ వచ్చే లోగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని వారిద్దరికీ ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన సమన్వయ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

ఎన్‌డిఎలో భాగస్వామ్య పక్షమైన జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. కాగా అక్టోబర్ 18న హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్‌తో కలసి పవన్ కల్యాణ్‌ను కలుసుకున్న కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తమ పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెగేసి చెప్పారు. బిజెపి కేంద్ర నాయకులతో తాను చర్చలు జరుపుతానని కూడా ఆయన వారికి చెప్పారు.

ఇదిలా ఉంటే బిజెపి 52 మంది అభ్యర్థులతో తన మొదటి జాబితాను అక్టోబర్ 22న ప్రకటించింది. ఇందులో జనసేన పోటీచేయాలని ఆసక్తిని కనబరుస్తున్న స్థానాలు కూడా ఉండడం విశేషం. కాగా..ఈ సమస్యను ఈ రెండు పార్టీలు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో తమ పార్టీ జనసేనతో మాత్రమే పొత్తులో ఉంటుందని, తెలుగు దేశం పార్టీతో కాదని బిజెపి వర్గాలు తెలిపాయి. అయితే పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ డిడిపితో పొత్తు పెట్టుకుంటుందని ఇదివరకే ప్రకటించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలసిరావాలని పవన్ పిలుపునిచ్చినప్పటికీ బిజెపి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

కిషన్‌రెడ్డితో జరిగిన భేటీలో పవన్ కల్యాణ్ 2014లో తాను ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాక బిజెపి నాయకత్వం అభ్యర్థన మేరకు 2021లో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయలేదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలలో తమ పార్టీ పోటీ చేయకపోతే పార్టీ కార్యకర్తల మనోబలం దెబ్బతింటుందని కూడా పవన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు సమాచారం.

జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాలలో అత్యధికం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నవే కావడం గమనార్హం. ఈ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లు అధిక సంఖ్యలో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అక్టోబర్ 2న జనసేన పార్టీ విడుదల చేసిన 32 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల జాబితాలో కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బి నగర్, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి, మేడ్చల్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ఆంధ్రకు చెందిన ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉండడం, పవన్ కల్యాణ్ మూలాలు ఆంధ్రలోనే ఉండడం, పవన్ కల్యాణ్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉండడం కూడా తమకు కలసివస్తుందని జనసేన అభ్యర్థులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News