Sunday, December 22, 2024

విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రూ.261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది. దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది.

విద్యుత్తు సంస్థలకు భారీ షాక్ : గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు భారీ షాక్ తగిలింది. ఏకంగా రాష్ట్రమంతటా విద్యుత్తు సరఫరా నిలిచిపోయే ప్రమాదం హైకోర్టు జోక్యం చేసుకోవటంతో త్రుటిలో తప్పినట్లయింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్తు సరఫరాకు పవర్ గ్రిడ్ తో చేసుకున్న కారిడార్ ఒప్పందం చినికి చినికి గాలివానగా మారింది. కారిడార్ కు సంబంధించి తమకు చెల్లించాల్సిన రూ.261 కోట్లు బకాయి పడిందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణను డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్టీ పోర్టల్ లో నమోదు చేసింది. పవర్ గ్రిడ్ ఫిర్యాదు ఆధారంగా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలంగాణ డిస్కంలు విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా నిలిపివేసింది. బకాయిలు ఇచ్చేంత వరకు పవర్ ఎక్షేంజీల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల లావాదేవీలు ఆపాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం నుంచి పవర్ ఎక్ఛేంజీలు తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా నిలిపివేశాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. సీఎం సూచనలతో డిస్కం, ట్రాన్స్ కో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం తలెత్తే ప్రమాదముందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కారిడార్‌కు రీలింక్విష్మెంట్ ఛార్జీల చెల్లింపు వ్యవహారం సెంట్రల్ ఈఆర్సీ విచారణలో ఉండగా ఈలోపు పవర్ గ్రిడ్ వ్యవహరించిన తీరును డిస్కం అధికారులు తప్పు బట్టారు. తెలంగాణను డిఫాల్టర్‌గా ప్రకటించి, విద్యుత్తు కొనుగోళ్ల లావాదేవీలను నిలిపివేయడం అన్యాయమని, రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని డిస్కంల తరపున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రాప్టీ పోర్టల్ లో పవర్ గ్రిడ్ నమోదు చేసినా మరో 75 రోజుల పాటు చెల్లింపులకు గడువు ఉంటుందని, అదేమీ పట్టించుకోకుండా కరెంట్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించటం సరైంది కాదని నివేదించారు. ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు డిస్కంలకు వెంటనే పవర్ ఎక్ఛేంజీల లావాదేవీలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత బాధ్యులకు తెలియచేయాలని సూచించింది. కారిడార్ ఛార్జీలు, బకాయిల విషయంలో సెంట్రల్ ఈఆర్సీలో ఉన్న కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పవర్ గ్రిడ్ కు సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ డిస్కంల మెడకు కారిడార్ వివాదం : ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు గత ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) తో విద్యుత్తు సరఫరాకు కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుంది. అవసరం లేకున్నా గత ప్రభుత్వం అనాలోచితంగా కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుంది. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు అడ్వాన్సు కారిడార్ బుక్ చేసింది. తెలంగాణ డిస్కంలు ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో మర్వా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2015 సెప్టెంబర్ 22న 12 ఏండ్ల కాలానికి బ్యాక్-టు-బ్యాక్ లాంగ్ టర్మ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. చత్తీస్ గఢ్ విద్యుత్తును రాష్ట్రానికి తెచ్చుకునేందుకు డిస్కంలు పవర్ గ్రిడ్ తో 2000 మెగావాట్ల సామర్థ్యముండే కారిడార్ బుక్ చేసింది. 25 సంవత్సరాల పాటు విద్యుత్తు సరఫరాకు పవర్ గ్రిడ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి.

ఛత్తీస్‌ఘడ్ నుంచి ఆశించిన విద్యుత్ రాకపోవడంతో డిస్కంలు కారిడార్ విషయంలోనూ వెనుకడుగు వేశాయి. కేవలం 1000 మెగావాట్ల విద్యుత్తు కారిడార్ కు సంబంధించిన పీపీఏపై పవర్ గ్రిడ్ ఒప్పందంపై డిస్కంలు సంతకం చేశాయి. కానీ పవర్ గ్రిడ్ మొత్తం 2000 మెగావాట్ల ఒప్పందంపై సంతకం చేయాలని పట్టుబట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ గ్రిడ్ తో ఆ ఒప్పందం చేసుకున్నట్లు డిస్కం చెబుతోంది. అందులో వెయ్యి మెగావాట్లు 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు కావాలి. మిగిలిన 1000 మెగావాట్లు 2018 నవంబర్ నుంచి అందుబాటులోకి రావాలి. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వస్తుందనుకున్న విద్యుత్తు రావటం లేదని, డిస్కంలు అదనంగా తీసుకున్న 1000 మెగావాట్ల కారిడార్ను మినహాయించారని పవర్ గ్రిడ్ ను అభ్యర్థించాయి. కానీ పవర్ గ్రిడ్ అంగీకరించలేదు. ఈలోపు రిలింక్విష్‌మెంట్ ఛార్జీలుగా రూ.261 కోట్లు తమకు చెల్లించాలని పిటిషన్ వేసింది. ఈ విషయంలో తెలంగాణ డిస్కంలు సీఈఆర్సీని ఆశ్రయించాయి. అక్కడ విచారణ కొనసాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News