తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నైజాం రాష్ట్ర ప్రజలకు 1949, సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా విముక్తి కలిగించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 మీద వివాదాలు నెలకొంటున్నాయి. నైజాం ప్రజలకు విముక్తి కలిగిన రోజును ఎలా జరుపుకోవాలో ఒక ఖచ్చితమైన పేరేమీ లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం‘ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజు రాష్ట్రంలోని హైదరాబాద్ సహ 33 జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలియజేసింది. ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే ప్రజాప్రతినిధుల వివరాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.