రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
పలు జిల్లాలో భారీ వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే
అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారంలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
Also Read: 3 ఏళ్ల కిత్రం మహిళ అదృశ్యం… సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరం…
మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, -పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో ఆవర్తన ప్రభావంతో ఇదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది.