ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్‌ఎన్‌సియు సేవలు
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు
25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు సంరక్షణలో కేరళ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, హిమచల్ ప్రదేశ్‌లు ఉన్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల నివేదికను వెల్లడించింది. అయితే మన రాష్ట్రంలో ప్రతి ఏటా నూతనంగా జన్మించిన వారిలో సుమారు 15 శాతం మంది నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సియు సేవలు అవసరమవుతుండగా, నిత్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 50 వేల మంది పిల్లలకు ఎస్‌ఎన్‌సియు(ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు)లలో సేవలు అందుతున్నాయి. వీరందరికీ మెరుగైన వైద్యం అందిస్తూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖలు సమన్వయమై చిన్నారుల రక్షణకు అండగా నిలుస్తున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వివరిస్తున్నారు.
18 నుంచి 42 కేంద్రాలకు పెంపు….
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 ఎస్‌ఎన్‌సియులు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో వాటిని 42 కు పెంచారు. ప్రస్తుతం 29 కేంద్రాలు పూర్తిస్థాయి నిర్వహణలో ఉండగా మరో 13 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏకంగా 24 అదనపు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవంగా తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు 6 లక్షల యాభై వేల మంది శిశువులు జన్మిస్తుండగా, వీరిలో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లో జన్మిస్తున్నారు.
దీనిలో 50 వేల మందికి ఎస్‌ఎన్‌సియు సేవలు అందాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే కేంద్రాలు పెంచాల్సి వచ్చిందని వైద్యశాఖలోని ఓ కీలక అధికారి తెలిపారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 18 కేంద్రాల్లో బెడ్లు నిండితే మిగతా వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చేది. తద్వారా ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం పడేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సెంటర్లను పెంచి ప్రస్తుతం నిర్వహణలో ఉన్న 29 కేంద్రాల్లో 560 పడకలతో సేవలందిస్తున్నామన్నారు. అదే విధంగా నిర్మాణ దశలో ఉన్న మరో 13 కేంద్రాల్లో 220 పడకలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్త జిల్లాల పరంగా ప్రతి జిల్లాకు ఒకటి వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని వైద్యశాఖ వివరిస్తుంది. రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు 1,45,648 మందికి చికిత్సను అందించగా, వీరిలో 75 శాతం కంటే ఎక్కువ మందిని ఆరోగ్యవంతంగా ఇళ్లకు పంపినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.
ఈక్రమంలోనే నవజాత శిశువులలో మరణాల రేట్ కూడా కేవలం 6.7 శాతం మాత్రమే నమోదవుతోంది. ప్రతి సంవత్సరం ఎస్‌ఎన్‌సియు సేవలు అందించే సిబ్బందికి యూనిసెఫ్, ప్రభుత్వ వైద్యకళాశాలల ద్వారా ప్రత్యేక శిక్షణను కూడా ఇస్తున్నారు. అంతేగాక ఎస్‌ఎన్‌సియు సేవల బలోపేతం కొరకు నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్, ఇన్వాసివ్ వెంటిలేటర్ సేవలను కూడా క్రమపద్ధతిలో ప్రవేశపెడుతున్నామని వైద్యశాఖ వివరించింది. దీంతో పాటు 46 ఎన్‌బిఎస్‌యు(న్యూ బోర్న్ స్టేబులైజేషన్ యూనిట్)లు, 562 న్యూ బోర్న్ బేబి కార్నర్లు కూడా నిర్వహణలో ఉన్నాయి. అదే విధంగా కంగారు మదర్‌కేర్, మిల్క్ బ్యాంక్ సేవల్లో కూడా తెలంగాణ అగ్రగామీగా ఉందని అధికారులు అంటున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నవజాత శిశుమరణాల రేట్ 25 నుంచి 19కి పడిపోయిందన్నారు. ఇది దేశ సగటు 22 కన్న తక్కువ నమోదు కావడం గమనార్హం.
2016 నుంచి 2020 ఏప్రిల్ వరకు నిర్వహణ ఇలా…..
2016-17లో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎస్‌ఎన్‌సియు కేంద్రాల్లో 31,720 మంది అడ్మిట్ అయితే 24,398 మంది పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా మారి ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా అతి క్రిటికల్ కండీషన్‌తో 2780 మంది శిశువులు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2017-18లో 33,464 మందిలో 25,661 మంది డిశ్చార్జ్ కాగా, మరో 2327 మంది మరణించారు. 2018-19లో 31,310లో 23,550 మంది డిశ్చార్జ్ కాగా, మరో 1890 మంది శిశువులు చనిపోయారు. ఇక 2019- 20లో చేరిన 35,324లో 26,958 మంది డిశ్చార్జ్ కాగా, 1910 మంది చనిపోయారు. 2020 ఏప్రిల్ వరకు 13,830లో 10,318 మంది డిశ్చార్జ్ కాగా, మరో 873 మంది చనిపోయినట్లు కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల్లో స్పష్టమైంది.
2016 నుంచి 2020 ఏప్రిల్ వరకు….(ప్రభుత్వ ఎస్‌ఎన్‌సియు కేంద్రాల్లో చికిత్స పొందిన వారు)
సంవత్సరం అడ్మిషన్ డిశ్చార్జ్ మరణించినశిశువులు డిశ్చార్జ్ శాతం డెత్‌రేట్
2016-17 31,720 24,398 2780 76.9 8.8
2017-18 33,464 25,661 2327 76.7 7.0
2018-19 31,310 23,550 1890 75.2 6.0
2019-20 35,324 26,958 1910 76.3 5.4
2020 ఏప్రిల్ 13,830 10,318 0873 74.6 6.3