Tuesday, September 17, 2024

రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం

- Advertisement -
- Advertisement -

Telangana ranks fifth in Corona recovery rate

 జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా రోజుకు 34 వేల మందికి పైగా రోగులు కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఏప్రిల్‌లో 7.85 శాతం ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 64.4 శాతానికి చేరుకుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాలలో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉందని ఆయన చెప్పారు.

ఢిల్లీలో రికవరీ రేటు 88 శాతం ఉండగా లడఖ్‌లో 80 శాతం, హర్యానాలో 78 శాతం, అస్సాంలో 76 శాతం, తెలంగాణలో 74 శాతం, తమిళనాడు, గుజరాత్‌లో 73 శాతం చొప్పున, రాజస్థాన్‌లో 70 శాతం, మధ్యప్రదేశ్‌లో 69 శాతం, గోవాలో 68 శాతం ఉందని భూషణ్ వివరించారు. జూన్ 4వ తేదీనాటికి ఒక లక్ష మంది కోలుకోగా జూన్ 25వ తేదీకి ఈ సంఖ్య 3.47,978కి చేరుకుందని, జులై 29 నాటికి ఇది 10 లక్షలు దాటిందని ఆయన చెప్పారు. నేటికి ఆ సంఖ్య 10.20 లక్షలు ఉందని, కేంద్ర, రాష్ట్రాల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో రికవరీ రేటు సాధించడంలో వైద్య సిబ్బంది, కృషి ఎనలేనిదని ఆయన ప్రశంసించారు. దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. జూన్‌లో మృతుల రేటు 3.33 శాతం ఉండగా ఇప్పుడది 2.21 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. కొవిడ్-19 మరణాల రేటు రష్యాలో 1.6 శాతం ఉందని, అయితే ఇతర వర్ధమాన దేశాలు, పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని భూషణ్ తెలిపారు. దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కన్నా తక్కువగా మరణాల రేటు ఉందని ఆయన తెలిపారు.

హెర్డ్ ఇమ్యూనిటీ మన దేశంలో సాధ్యం కాదు

భారత దేశ జనాభా, వైశాల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్-19ని సమూలంగా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌పైన ఆధారపడక తప్పదని పేర్కొంది. హెర్డ్ ఇమ్యూనిటీ ఒక వైరస్ నుంచి పరోక్షంగా కాపాడుతుందని, అయితే అది వ్యాక్సిన్ తయారైనపుడు లేదా ఆ వైరస్ నుంచి ప్రజలు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. భారతదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ ప్రత్యామ్నాయం కాబోదని, వ్యాక్సిన్ తయారైన తర్వాతే అది ఏర్పడగలదని ఆయన వివరించారు. వైరస్‌ను తట్టుకునే పరిస్థితి ప్రజలకు కలిగినపుడు, వైరస్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం లేకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి నిలిచిపోయిన పరిస్థితిని హెర్డ్ ఇమ్యూనిటీగా పేర్కొంటారు.

ఒక్కరోజే 52000 మందికి కరోనా

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 24 గంటల వ్యవధిలోనే ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో 52000 మందికి కరోనా సోకింది. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 775 కోవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. దీనితో కరోనా మహమ్మారి దేశంలో తన ఉగ్రరూపాన్ని వీడటం లేదని స్పష్టం అయింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఒక్కరోజు వ్యవధిలో కరోనా వైరస్ పరిస్థితిని వివరించారు. తీవ్రస్థాయిలో కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ కరోనాతో పోరాడి ఆసుపత్రి నుంచి విడుదల అయిన వారి సంఖ్య గురువారానికి 10 లక్షలు దాటింది.

ఈ విధంగా రికవరీ శాతం పెరగడం ప్రస్తుత దశలో కొంత ఊరట కల్గించే విషయంగా మారింది. ఉదయం వెలువరించిన బులెటిన్ మేరకు చూస్తే బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,46,642 మంది నుంచి శాంపుల్స్ సేకరించారు. ఇది ఓ రికార్డు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా దాదాపు 1.82 కోట్ల శాంపుల్స్ పరీక్షించారు. రోజుకు 5 లక్షల టెస్టులు నిర్వహించాలని కేంద్రం లక్షంగా పెట్టుకుంది. రోజురోజుకీ టెస్టుల సంఖ్య పెంచుతోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది, వీరిలో పదిలక్షలు పైగా కోలుకున్నారు. అయితే కొత్త కేసులు రోజువారి రికార్డుగా నమోదు కావడం ఆందోళనకు దారితీసింది. 4రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వారిగా చూస్తే మహారాష్ట్రలోనే యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 1,46,433కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News