ఆర్థిక వృద్ధిలోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ నెం.1
దేశానికి దిక్సూచి, కెటిఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ 50వేలకు పైగా ట్వీట్లతో పెద్ద ఎత్తున స్పందన
మన తెలంగాణ/ హైదరాబాద్ : విజయోత్సవ తెలంగాణ.. థాంక్యూ యూ కెసిఆర్ హ్యాష్ ట్యాగ్‌లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో తెలంగాణ నాయకులకు అసలు పరిపాలన చేతనవుతుందా అని మొదలైన అపోహల నుండి నేడు ఎనిమిదేళ్ల కాలంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఒక రంగం అన్ని కాకుండా అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కెటిఆర్ తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ మంగళవారం ట్వీట్ చేయడం జరిగింది.
తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కెటిఆర్ చేసిన ట్వీట్ రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసించడం జరిగింది. మరోవైపు కెటిఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించడం జరిగింది. మంత్రులు, ఎంఎల్ఎలు, కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యావత్ సమాజం కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో తమ ట్విట్ట ద్వారా వివరించడం జరిగింది. ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికే తెలంగాణ రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ అంటూ కోట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని, కెసిఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని అన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం..కేంద్రంలోని మోడీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. సొంతంగా తన కాళ్ళ మీద తానూ నిలబడిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణఃగా నేడ జరుగుతున్న అభివృద్ధి భావి తెలంగాణకు గొప్ప భరోసా అని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరును, వివక్షను పెద్ద ఎత్తున ఎండగట్టారు. 2014లో 5 లక్షలుగా ఉన్న జిఎస్‌డిపి 2022 నాటికి 130 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 11.54 కోట్లకు ఒక్క కెసిఆర్ పాలనా సామర్థంతోనే సాధ్యమైందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 50 వేలకు పైగా ట్వీట్లతో విజయోత్సవ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ హోరెత్తి దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది.