Friday, November 22, 2024

కెసిఆర్ పుణ్యం, ‘సాగులో’ అగ్రగణ్యం

- Advertisement -
- Advertisement -
Telangana ranks second in agriculture in India
రైతు కష్టం తెలిసిన కెసిఆర్ ప్రత్యేక దృష్టితో నిర్విరామంగా కృషి చేయడంతోనే వ్యవసాయరంగంలో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానాన్ని అలంకరించింది, 201112 నుంచి 201920 మధ్య దశాబ్దకాలంలో తెలంగాణ వ్యవసాయరంగంలో 6.59 వృద్ధిని సాధించి రెండవ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ సభ్యులు రమేశ్ చాంద్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు, ఎపి నాలుగో స్థానానికే పరిమితమైంది : మంత్రి కెటిఆర్ ట్వీట్

మొదలైన క్షీర విప్లవం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయం దండగ అన్న చోటే పండుగైంది..వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది..ఈ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటి పరిశ్రమలు పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ వెల్లడించారు. పంటల సాగు విధానాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రశంసలు అందుకుంటోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి కష్టాలు లేకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, స్వల్పకాలంలోనే కొత్త ప్రాజెక్టులను నిర్మించడం, వ్యవసాయ రంగానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, రైతుబంధు పథకం ద్వారా పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10వేలు చొప్పున రైతులకు అందచేయడం వల్లనే ఈ విజయం సాధ్యపడిందన్నారు.

రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించి ,నిర్విరామంగా కృషి చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత విజయాలు సాధిస్తోందని మంత్రి కెటిఆర్ ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నీతి అయోగ్ సభ్యులు రమేష్ చాంద్ .. స్వాతంత్య్ర భారతదేశంలో వ్యవసాయరంగంగతం భవిష్యత్ పేరుతో ఒక నివేదకను విడుదల చేశారు.

2011-12నుంచి 2019-20 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయరంగం సాధించిన పురోగతిని ఆ నివేదికలో క్లప్తంగా వివరించారు. ఈ దశాబ్ధకాలంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 6.59శాతం వృద్ధి రేటును సాధించి ,దేశంలోనే రెండవ స్థానంలో నిలిచినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొదటి స్థానంలో త్రిపుర (6.87శాతం)నిలవగా, సిక్కిం కూడా 6.59శాతం వృద్ధిరేటుతో నిలిచినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5.41శాతం వృద్ధిరేటుతో నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే పెద్ద రాష్టోలతో ఈ వృద్ధిరేటును పోల్చితే తెలంగాణ ఆగ్రభాగాన నిలిచింది.

3శాతం కంటే అధికంగా 11రాష్ట్రాలు

దేశంలోని మొత్తం 29రాష్ట్రాల వృద్ధిరేటును పరిశీలిస్తే 11రాష్ట్రాలు మాత్రమే 3 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించాయి. మరో పది రాష్ట్రాలలో మైనస్ 3.6శాతం వృద్ధిరేటు నమోదైంది. మిగతా రాష్ట్రాల్లో ఈ దశాబ్ధకాలంలో వ్యవసాయరంగంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఉద్యాన రంగంలో కూడా రైతులు పెద్దగా వృద్ధిరేటును సాధించలేకపోయారు.

పాడిపరిశ్రమలో తెలంగాణకు 5వ స్థానం:

వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి 5వ స్ధానం లభించింది. పాడి పరిశ్రమ , పశుసంపద, మత్స సంపదలో సాధించిన వృద్ధిరేటును పరిశీలిస్తే తెలంగాణ 5వ స్థానంలో నిలించింది. మిజోరం 15.48శాతం వృద్దిరేటుతో ప్రధమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 8.92శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. త్రిపుర 8.02, సిక్కిం 6.78, శాతం వృద్ధిరేటును సాధించాయి. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో , ఎపి మూడవ స్థానంలో నిలిచాయి.

జిఎస్‌డిపిలో 3రెట్లు పెరిగిన వాటా:

తెలంగాణ స్టేట్ స్టాటస్టికల్ ఆబ్‌స్ట్రాక్ట్ 2020 ప్రకారం 201112తో పోలిస్తే 201920లో జిఎస్‌డిపిలో వ్యవసాయరంగం వాటా మూడు రెట్లు పెరిగింది. 201920లో స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.1,35,109కోట్లకు చేరింది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుండి 201112లో కేవలం రూ.54,615 కోట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 201516లో జిఎస్‌డిపిలో వ్యవసాయరంగం వాటా రూ.75,707కోట్లకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి పరిశీలిస్తే 201617లో రూ.88,979కోట్లు, 201718లో రూ.1,02,044కోట్లు, 201819లో రూ.1,13, 223కోట్లుగా ఉంది. కోవిడ్ ప్రభావం కారణంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ సమయంలో(202021) కూడా వ్యవసాయం , దాని అనుబంధ రంగాల నుంచి తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ 3శాతం నుంచి 21శాతం వృద్ధికి (జాతీయస్థాయిలో) పెరిగింది.

రాష్ట్రంలో మొదలైన క్షీర విప్లవం

రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలు రంగాల్లో తెలంగాణ విప్లవాత్మకమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. అనేక విప్లవాలకు నాంది పలుకుతోందన్నారు. ఇప్పటికే హరిత విప్లవంలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. ఇప్పుడు క్షీర విప్లవం కూడా ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో క్షీర విప్లవంలో గణనీయమైన వృద్ధి సాధించేందుకుగానూ సమగ్ర ప్రణాళికలను రూపొందించాలన్నారు. నల్గొండ జిల్లాలోని నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మదర్ డైరీని పూర్తిగా లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విజయా డైరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డెయిరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని…. అటువంటి డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా బలోపేతం చేసిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ అనునిత్యం దిశా నిర్దేశం చేస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. కాగా కెటిఆర్‌ను కలిసిన వారిలో నార్ముల్ డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్చ లక్ష్మినరసింహా రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News