Saturday, December 21, 2024

వైద్యంలో మనమే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి పని చేయడం వల్లే ఇంతటి వృద్ధి సాధించామని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)లో ఆదివావారం మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్యశాఖ 2022 వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్త్ సెక్రటరీ ఎస్‌ఎఎం రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, డిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పనితీరుకు నిదర్శనమని, అలాగే ఆరోగ్య శాఖను సమీక్షించుకుని పనితీరును మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు.

ప్రగతి నివేదికలు గతేడాది కంటే మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయని చె ప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలుచేసే అవకాశం కలిగింది. ‘హె ల్త్ ఫర్ ఎవ్‌రీ ఏజ్… హెల్త్ ఎట్ ఎవ్‌రీ స్టేజ్.. టువార్డ్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని ఎంచుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ యసుల వారికి వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సుల తో వైద్యారోగ్య శాఖలో 2022లో అ ద్భుత కార్యక్రమాలు చేపట్టామని అ న్నారు. ఎంఎంఆర్‌ను 56 నుంచి 43 కు తగ్గించామని తెలిపారు. ఎంఎంఆర్‌లో జాతీయ సగటు 97 ఉంటే తెలంగాణ సగటు 43గా ఉందని పేర్కొన్నారు. అలాగే ఐఎంఆర్‌లో 23 నుంచి 21కి తగ్గించామని, జాతీయ సగ టు 28గా ఉందని అన్నారు. ఆరోగ్య శాఖలో కొన్ని రంగాల్లో తెలంగాణ కంటే కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ముందున్నాయని, ఆయా రా ష్ట్రాల్లో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2022 సంవత్సరం వైద్యరంగంలో సు వర్ణ అక్షరాలతో లిఖించదగినదని మంత్రి పేర్కొన్నారు.

వైద్యరంగంలో మెరుగైన పనితీరు కలిగిన మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్ గుర్తించిదని అన్నారు. సిఎం కెసిఆర్ బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు రూ.11440 కోట్లు కేటాయించారని, దీంతో తలసరి హెల్త్ బడ్జెట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని వెల్లడించారు. 2022లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని,దేశ చరిత్రలో ఇదో రికార్డ్ అని పేర్కొన్నారు. ఎనిమిది కాలేజీల్లోమరో 9 కాలేజీలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాలేజీల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2022లో అదనంగా 200 పిజి మెడికల్ సీట్లు వచ్చాయని తెలిపారు. ఎంబిబిఎస్ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 7 పిజి మెడికల్ సీట్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచామని అన్నారు.

హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈ ఏడాది 8200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా.. 2022లో పనులు ప్రారంభించామని తెలిపారు. అలాగే రూ. 1,100 కోట్లతో 2000 పడకలతో వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నిమ్స్ విస్తరణతో మరో 2000 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. గతేడాది 515 మిషన్లతో 61 కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నొస్టిక్స్ హబ్స్ నడుపుతున్నామని, త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారుకు చివరి స్థానం

ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్ వైద్య సేవల్లో చివరిస్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిడ్ వైఫరీ సేవల్లోనూ తెలంగాణను కేంద్రం, యునిసెఫ్ ప్రశంసించాయని తెలిపారు. అవార్డులు వచ్చాయని ఉప్పొంగడం లేవని, మరింత బాధ్యతగా పని చేస్తామని పేర్కొన్నారు.

మనం దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలీ కన్సల్టెన్సీ సేవలు అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. ఎంబిబిఎస్ సీట్లలో దేశంలో తొలిస్థానంలో ఉండగా, పిజి మెడికల్ సీట్లలో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. టిబి నివారణలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చిందని అన్నారు. గత ఏడాది ప్రభుత్వాసుపత్రుల్లో 716 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27,500 పడకలు ఉంటే వాటన్నిటికీ ఆక్సిజన్ పడకలుగా మార్చామని వివరించారు.రోగికి అందించే భోజనం ఖర్చును రూ. 40 నుంచి రూ. 80కి పెంచామని చెప్పారు. 18 ప్రధాన ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు సైతం భోజన ఏర్పాట్లు చేస్తున్నాయని అన్నారు. శానిటేషన్ చార్జీలను రూ.5 వేల నుంచి రూ.7,500కి పెంచామన్నారు. డైట్, శానిటేషన్ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 2.59 లక్షల మందికి సేవలు అందించామని తెలిపారు.

గతంలో ఆరోగ్య శ్రీ కింద రూ.2 లక్షలు ఉన్న పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని, అలాగే తీవ్రమైన వ్యాధులకు రూ.10 లక్షల వరకు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. పిహెచ్‌సి కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో పరికరాల నిర్వహణ కోసం ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చామని అన్నారు.బస్తీ దవాఖానలను 334కు పెంచుకున్నామని తెలిపారు. బస్తీ దవాఖానల వల్ల గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానల్లో ఒపి భారీగా తగ్గిందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లో రాష్ట్రంలో 105 శాతం మందికి మొదటి డోసు వేసుకోగా, 102 శాతం మంది రెండో డోసు వేసుకున్నారని అన్నారు. ప్రికాషనరీ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే, తెలంగాణ రెట్టింపు స్థాయిలో 47 శాతం పూర్తి చేసిందని తెలిపారు.

నార్మల్ డెలివరీకి రూ.3 వేల ఇన్సెంటివ్

బాలింతల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా ఉండేందుకు గాను ప్రత్యేకంగా న్యూట్రీషన్ కిట్స్ అందిస్తున్నామని మంత్రి అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కెసిఆర్ కిట్ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో పడినప్పుడు కెసిఆర్ న్యూట్రీషన్ కిట్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. సిజేరియన్ రేట్ తగ్గించేందుకు నార్మల్ డెలివరీ చేసిన సిబ్బందిని రూ.3 వేల ఇన్సెంటివ్ ఇస్తున్నామని తెలిపారు.దీనిని కేంద్రం ప్రశంసించడంతోపాటు అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించిందని తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం 56 ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 61 శాతానికి పెరిగిందని వెల్లడించారు. గతేడాది 5.40 లక్షల డెలివరీలు జరగగా, ఇందులో 61 శాతం అంటే 3.27లక్షల డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని వివరించారు.ఆసుపత్రి ప్రసవాలు 97 శాతం నుంచి 99.99 శాతానికి పెరిగాయని అన్నారు. గత ఏడాది ఎఎన్‌సి రిజిస్ట్రేషన్లు 17 శాతం వృద్ధి సాధించాయని చెప్పారు.

ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ఒపి

2021లో ప్రభుత్వాసుపత్రుల్లో 4.21 కోట్ల మంది ఔట్ పేషెంట్(ఒపి) ద్వారా చికిత్స చేయించుకుంటే.. 2022లో అది 4.80 కోట్లకు పెరిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2021 ఇన్‌పేషెంట్(ఐపి) బాధితులు 14.16 లక్షలకు కాగా.. 2022లో 16.90 లక్షలకు చేరినట్లు చెప్పారు. 2021లో 2.57 లక్షల శస్త్ర చికిత్సలు చేస్తే.. 2022లో అది 3.04 లక్షలకు పెరిగినట్లు వివరించారు. ఏడాది కాలంలో 986 మంది వైద్యులను నియమించినట్లు వెల్లడించారు. మాతాశిశు సంక్షేమానికి రూ. 403 కోట్లు కేటాయించామన్నారు. ప్రసవ సమయంలో మహిళలు చనిపోతే ప్రతి మరణాన్నీ నమోదు చేసి సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు వచ్చే రోగాలను ముందుగా గుర్తించేందుకు రాష్ట్రంలో ఎన్‌సిడి స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని, బీపీ, షుగర్ రోగులకు మందులతో కూడిన కిట్‌లు అందజేస్తున్నామని అన్నారు.

ఐదు అంచెల్లో వైద్య సేవలు

రాష్ట్రంలో ఐదు అంచెల విధానంలో వైద్య సేవలు అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెలకు మార్చామని అన్నారు.ఇదివరకు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ హెల్త్ కేర్ మాత్రమే ఉండగా, కొత్తగా కింది స్థాయిలో ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ కేర్.. పై స్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే క్వాటర్నరీ హెల్త్ కేర్ వ్యవస్థను జోడించినట్లు పేర్కొన్నారు. 2,500 పల్లె దవాఖానాలు ప్రారంభించే ప్రక్రియకు 2022లోనే శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్ కాకుండా ఇతర నగరాల్లో 100 బస్తీ దవాఖానాల ఏర్పాటు పనులు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలోనూ తెలంగాణకు పలు అవార్డులు వచ్చాయని చెప్పారు. గతేడాదిలో 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందులో ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. కేవలం 5 నెలల్లోనే నియామక పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 1,147 అసిస్టెంట్ పోస్టులు, 5204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. వారం పది రోజుల్లో ప్రొఫెసర్ల పదోన్నతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ఛార్జ్‌షీట్‌పై మంత్రి ఫైర్

రాష్ట్ర వైద్యారోగ్యశాఖపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల చేయడంపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలంగాణతో పోల్చిచూసుకోవాలని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్ వైద్య సేవల్లో చివరిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. నీతి అయోగ్ సూచిలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16వ ర్యాంకులో, చత్తీస్‌ఘడ్ 10వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 7వ స్థానంలో ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రగతి నివేదికను ఆయ రాష్ట్రాలకు ఇచ్చి అక్కడ అమలు చేయమని చెబితే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడ చార్జిషీట్ వేస్తే కనీసం అక్కడ ప్రజలకు మంచి జరుగుతుందని సూచించారు.

2022లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు వచ్చిన అవార్డులు

* నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో 3వ స్థానం

* దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు. యూనిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించింది.

* హై రిస్క్‌గర్బిణులను గుర్తించి, సంరక్షించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు గాను కేంద్రం నుంచి అవార్డ్.

* తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్‌ఎబిఎల్ గుర్తింపు.

* తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌పై నేషనల్ హెల్త్ మిషన్ ప్రశంసలు. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచన.

* తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలను ప్రత్యేకంగా కొనియాడిన నీతి అయోగ్.

* లక్ష్యాన్ని మించి పల్లె దవాఖానల ఏర్పాటుకు గాను కేంద్రం నుంచి అవార్డు.

* ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, రాష్ట్రంలో నిర్వహిస్తున్న వెల్‌నెస్ యాక్టివిటీస్‌కు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ కార్యక్రమానికి కేంద్రం నుంచి అవార్డులు.

* రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 లక్షల మందికి టెలి కన్సల్‌టెన్సీ సేవలు అందించగా, ఇందుకు గాను కేంద్రం నుంచి రాష్ట్రానికి అవార్డ్.

* పీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి తెలగాణకు మూడు అవార్డులు.

* టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్ టీబీ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది.

* మలేరియా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.

2023 రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లక్ష్యాలు

* సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం

* ఇఎన్‌టి, సరోజినీ దేవి హాస్పిటళ్లను మరింత పట్టిష్టం చేయడం

* ఆహార కల్తీపై నివారణపై మరింత దృష్టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News