Friday, March 14, 2025

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. వేసవి సీజన్ మార్చిలోనే ప్రారంభమైంది. ఈ ఏడాది వేసవి సీజన్ ఎలా ఉండబోతుందనే అంశాలపై భారత వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. 90 రోజుల వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఏడు రోజుల పాటు రాష్ట్రమంతటా తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్పారు. దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఆయన వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.

పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం : ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో పెరగనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు : రానున్న రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న రోజుల్లో క్రమేపీ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే వేసవి కాలం కాస్త ముందుగానే వచ్చినట్లుగా తెలుస్తోందని ధర్మరాజు తెలిపారు. నాలుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసినట్లు ఆయన వివరించారు. గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ భాగంలో క్రమేపీ వేడి వాతావరణం నమోదవుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఫిబ్రవరి నెల నుంచి సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధికంగా ఉందని వివరించింది. హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల్లో గణనీయంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 38 నుంచి 39 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించింది. స్థానికంగా కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. 11.30 నుంచి 3.30 ప్రాంతంలో ఎండ వేడిమి అధికంగా ఉండే అవకాశం ఉంది. బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎండలో బయటకు వెళితే కాటన్ దుస్తులు ధరించడంతో పాటు తలకు టోపీ పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడిమి అధికంగా ఉండటం వల్ల మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.

దక్షిణ తెలంగాణలో ఉక్కపోతే : దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉందని వివరించింది. మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. రాత్రిపూట కూడా దక్షిణ, ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. మార్చి చివరి రెండు వారాలు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఏప్రిల్, మే, నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని తెలిపారు.

అన్ని రంగాలపై ప్రభావం : కొన్నేళ్లుగా భారత్‌లో వడగాలుల ప్రభావం పెరుగుతోంది. ఇది వ్యవసాయ, రవాణా, విమానయానం, ఇలా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. అతి తీవ్ర వడగాలులు వీచే సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వ్యవసాయ రంగంలో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

3 నుంచి 5 డిగ్రీల పెరుగుదల : కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. విశాఖ, నరసాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల నమోదైంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ‘రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం ప్రారంభమైంది. ఈసారి తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలకు తేమ వాతావరణం తోడు కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News