Saturday, January 4, 2025

రెండు రోజులు రూ.680 కోట్ల మద్యం విక్రయాలు

- Advertisement -
- Advertisement -

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31వ తేదీల్లో (రెండు రోజుల్లో)నే రూ.680కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 వతేదీన రూ.282 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, డిసెంబర్ 30వ తేదిన రూ.402కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 వైన్స్ షాపులు, 1,117 బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌ల ద్వారా ఎక్సైజ్ శాఖకు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 23వ తేదీన రూ. 193 కోట్లు, 24న రూ. 197 కోట్లు, 26న రూ. 192 కోట్లు, 27న రూ. 187 కోట్లు, 28న రూ. 191 కోట్లు, 30న రూ. 402 కోట్లు, 31న రూ. 282 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది.

40 టీంలతో ఎక్సైజ్ దాడులు
నూతన సంవత్సర వేడుకల్లో 40 టీంలతో ఎక్సైజ్ దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వివి కమలా సన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు జరిగిన దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. రెండు చోట్ల గంజాయి పట్టుకోవడంతో పాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి తో పాటు 17 మంది అధికారులు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అక్రమ మద్యం, డ్రగ్స్ ఆక్రమ రవాణా గురించి పర్యవేక్షించారు. నూతన సంవత్సర సంబరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందిని వివి కమలా సన్ రెడ్డి అభినందించారు.

287 ఈవెంట్స్ ద్వారా రూ.56.46 లక్షల ఆదాయం
నూతన సంవత్సర వేడుకలకు ఎక్సైజ్ శాఖ 287 ఈవెంట్స్‌కు అనుమతులిచ్చింది. ఈ అనుమతుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 56.46లక్షల ఆదాయం సమకూరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. ఈవెంట్ అనుమతుల్లో రూ. 2.50 లక్షలతో ఒక అనుమతి, రూ. లక్ష తో మూడు అనుమతులు, రూ. 50 వేలతో ఏడు అనుమతులను ఇచ్చారు. 2023 డిసెంబర్ 31వ తేదీన 224 అనుమతులకు మంజూరు చేయగా రూ.44.76 లక్షల ఆదాయం వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News