Thursday, January 23, 2025

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు లోబడే రూ.41 వేల కోట్ల నిధుల సేకరణ

Telangana
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ నిర్వహణలో ఖర్చులు తగ్గించుకుంటూ, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం విధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నిధులను సమీకరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి విజయవంతంగా గట్టెక్కింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలకు ఈ నెలాఖరు వరకు రూ.41 వేల కోట్ల నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉందని, మార్చి నెలాఖరుకు మరో 6 వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిధుల కొరతను అధిగమించింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బాండ్లను విక్రయించి సుమారు రూ.41 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకుంది. దీంతో ప్రజా ప్రయోజన పథకాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళుతోంది. ఓవైపు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చిస్తోంటే, మరోవైపు 2020 ఏప్రిల్ నుంచి కరోనా మహమ్మారి విరుచుకుపడి రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై కరాళ నృత్యం చేస్తోంది. ఆకస్మికంగా లాక్‌డౌన్ కూడా ప్రకటించాల్సి రావడంతో రాష్ట్ర ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడింది. సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం రంగంలోకి దిగాలని, రాష్ట్రాలకు ఊతమిచ్చేలా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సిఎం కెసిఆర్ అనేకసార్లు కోరడం జరిగింది. హెలికాప్టర్ మనీ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని సార్లు కోరినా స్పందన రాకపోగా, కేంద్రం తీసుకున్న అరకొర చర్యలు రాష్ట్రాల అవసరాలను తీర్చలేకపోయాయి. ఆశించిన ప్రతిసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ం మొండిచేయి చూపడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య పథకాల అమలులో సైతం అంతరాయం కలిగే దుస్థితి దాపురించడంతో నిధుల సమీకరణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఆర్థికంగా మార్కెట్లో రాష్ట్రానికి ఉన్న పరపతిని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు ఎప్‌ఆర్బీం పరిధిలోకి లోబడి 202122 ఆర్థిక సంవత్సరంలో రూ.47 వేల 500 కోట్ల నిధుల సమీకరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఆ మేరకు ఇప్పటివరకు రూ.39036కోట్లు సమీకరించింది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వేలం వేయనుంది. బాండ్లను 12 ఏళ్ల కాలపరిమితికి విక్రయించనుంది. ఈ నెల 18వ తేదీ ఆర్బీఐ బాండ్లను వేలం వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్లు సమీకరించినట్లైంది. ఒక్క జనవరి నెలలోనే ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధులను కూడగట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.6 వేల కోట్ల సమీకరణకు రాష్ట్రానికి వెసులుబాటు ఉంది. యాసంగి సీజన్ కోసం గత నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు చెల్లింపులు ప్రారంభించింది. ఈ సీజన్లో పంట పెట్టుబడి సాయం గా రూ.7 వేల 500 కోట్ల నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. మిగిలిన సొమ్ముల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News