Monday, December 23, 2024

1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్ర పంచంతోనే తమ పోటీ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది తమ సంకల్పమని సిఎం తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు తిరిగి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి బుధవారం కోకాపేట జీఏఆర్ బిల్డింగ్ వద్ద ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం ఎల్‌ఎ ప్రకాష్ గౌడ్, అధికారులుహజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 430 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్‌కు ఉందని, నగర స్థాపకుడు కులీకుతుబ్ షా నుంచి తన వరకు ఎవరు పాలించినా, ఎన్ని వ్యవస్థలు మారినా విధానాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని..

కానీ తన పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదని ప్రపంచంతోనేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం, దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కాగ్నిజెంట్ తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. కుతుబ్ షాహీలు, నిజాంలు హైదరాబాద్‌ను నిర్మిస్తే… బ్రిటిషర్స్ సికింద్రాబాద్‌ను నిర్మించారని, 1992లో ఐటీ పరిశ్రమలకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి సైబరాబాద్‌ను నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు తాము నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటన్నట్లు వెల్లడించారు. చైనా ప్లస్ 1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇతర దేశాలు ఏవైతే ఎదురుచూస్తున్నాయో… వాటన్నింటి ప్రశ్నలకు ఆ ఫ్యూచర్ సిటీ సమాధానం చెబుతుందని సిఎం స్పష్టం చేశారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు.

త్వరలోనే మరిన్ని ఒప్పందాలు..
అమెరికా, దక్షిణ కొరియాల్లో పది రోజుల పర్యటనలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పర్యటనల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనుట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణకు మూడు రింగ్స్ ఉన్నాయని, మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ అని, రెండోది అవుటర్ రింగు రోడ్డు- రీజినల్ రింగు రోడ్డు మధ్యన సెమీ -అర్బన్ ఏరియా అని పేర్కొన్నారు. అక్కడ తాము తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మూడోది రీజనల్ రింగ్ రోడ్ అని, బయట ఉన్న గ్రామీణ తెలంగాణ, అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంతో పోటీ పడేందుకు తమ ఆలోచనను ఎప్పుడో విస్తరించుకున్నామని చెప్పారు.

కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు
కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. 2002లో హైదరాబాద్‌లో ప్రారంభమైన కాగ్నిజెంట్ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదిగిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోనూ కాగ్నిజెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సిఎం ఆహ్వానించారు. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడా లేదు…
హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం మరెక్కడా లేదనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమకు ప్రపంచంతోనే పోటీ అని, పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ వంటి నగరం, అవుటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మంచి వాతావరణం లేవని పేర్కొన్నారు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత, సంస్థలకు అవసరమైన యువశక్తి తెలంగాణలో ఉందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధానం ఉండాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం మారినా విధానాల్లో మార్పు లేదని, ఇంకా వేగంగా, పారదర్శకంగా, పట్టుదలతో తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటోందన్నారు. పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, అనుమతులు తాము కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో మా నెట్‌వర్క్‌లో కీలకమైన హబ్: సూర్య గుమ్మడి
తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కీలకమైన హబ్ అని కాగ్నిజెంట్ ఈవీపీ, కాగ్నిజెంట్ అమెరికస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. 2002 నుంచి కాగ్నిజెంట్ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్‌లో నూతన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో భారతదేశంలో 2.40 లక్షల మంది ఉన్నారని, వారిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని వెల్లడించారు. ఇందులో 39 శాతం మంది మహిళలేనని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌తో తమది వ్యూహాత్మకమైన పెట్టుబడి అని, స్థానికంగా ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, ఐవోటీలో కట్టింగ్ ఎడ్జ్ సమస్యలకు తమ హైదరాబాద్ కేంద్రం పరిష్కారం చూపిస్తుందని తెలిపారు.

తెలంగాణలో విద్యా, నైపుణ్య శిక్షణ, సమాజ సంక్షేమం, పర్యావరణ సుస్థిరాభివృద్ధికి తాము కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. హైదరాబాద్‌తో తమ నూతన విస్తరణకు సహకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూర్య గుమ్మడి కృతజ్ఞతలు తెలిపారు. కాగ్నిజెంట్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, నైపుణ్యాభివృద్ధి, ప్రతిభను ప్రోత్సహించడం, సాంకేతికత, ఆవిష్కరణల విషయంలో కాగ్నిజెంట్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాసులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు క్యాథీ, జాన్కిమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News