హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యాక్రమాల వలన, తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023 -24లో 15,623 మెగావాట్ల నుండి 2027- 28లో 20,968 మెగావాట్లకు, 2034 -35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
విద్యుత్ అవసరాలు 2023 -24లో 85,644 మిలియన్ యూనిట్ల నుండి 2027 -28 లో 1,15,347 మిలియన్ యూనిట్లకు, 2034- 35లో 1,50,040 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నదని తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోవడానికి గాను 2025 జనవరి 3వతేదీ ఉదయం 11 గంటలకు మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో భాగస్వాములతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ ,విదేశాల నుండి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.