తొలి విడతగా 12,500 టన్నుల
బియ్యం కాకినాడ పోర్టు
నుంచి బయలుదేరిన నౌక
జెండా ఊపి ప్రారంభించిన
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
మొత్తం 8 లక్షల టన్నుల
బియ్యం ఎగుమతికి ఒప్పందం
మిగులు ధాన్యాన్నే ప్రపంచ
మార్కెట్‌లో విక్రయిస్తున్నాం
ఉత్తమ్ స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బియ్యం అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగిడుతున్నది. ఆగ్నేయాసియాకు తొలి రవాణాతో తెలంగాణ బియ్యం ఎగుమతులతో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించింది. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు తొలి విడతలో 12,500 టన్నుల బియ్యంతో వెళ్తున్న షిప్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఫిలిప్సీన్స్‌కు మొత్తం 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులకు ఒప్పందం చే సుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణలో పంటలకు అనుకూలమైన నేల, వాతావరణ పరిస్థితులకు తోడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించిన సహకారంతో వరి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. మిగులు వరి ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్లలో విక్రయించే దిశలో ఇది ఒక కీలకమైన మలుపుగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణ, ఫిలిప్పీన్స్ అధికారుల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయని,
బియ్యం నాణ్యతను పరిశీలించిన తర్వాత ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మొదటిసారిగా కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లాంటర్స్ ప్రొడక్ట్ ఇంక్ మధ్య ఒప్పందం కుదిరినట్లు వివరించారు. రాష్ట్రంలోని 103 బియ్యం మిల్లులు వడ్లను మిల్లింగ్ చేసి సకాలంలో బియ్యం ఎగుమతులకు సహకరించాయన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, తెలంగాణ బియ్యం త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించి పట్టు సాధిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రి ఉత్తమ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరి పండించే రైతులను, రైస్ మిల్లర్లను, పౌర సరఫరాల కార్పొరేషన్ అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో రైతుల ఆదాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని మంత్రి చెప్పారు.