సిద్దిపేట: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట, మెదక్ రెండు జిల్లాల వానాకాలం 2022 సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్,తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి హరీశ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అందించిన ఊతం మూలంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. 60 శాతం జనాభా ఆధారపడి ఉన్నా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధిస్తే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. అత్యధిక మందికి ఉపాధి ఇచ్చే వ్యవసాయరంగం సుస్థిరం కోసం పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని, రైతు వేదికలలో సంవత్సరం పొడవునా రైతులకు లాభసాటి వ్యవసాయం పై శిక్షణ తర్వాత నిర్వహిస్తామని వీటిలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు. ఆయిల్ ఫామ్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నామని దానిలో భాగంగా సిద్ధిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. రైతులను సమీకృత వ్యవసాయంలో ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.