Monday, January 20, 2025

కెసిఆర్ సుపరిపాలనతో తెలంగాణ తలెత్తుకుంది!!

- Advertisement -
- Advertisement -
  • జగన్, చంద్రబాబులపై విమర్శ
  • సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: గతంలో ఒకాయన హైటెక్ పెద్ద మనిషి ఉండే.. ఇప్పుడాయన ఏమైండు…? ఎపికి ఇప్పుడు ఏమైంది..ఎల్లెలకలా పడి పోయింది..! ఇద్దరి పుణ్యమా అని ఎటు కాకుండా పోయింది..! అని మాజీ సిఎం చంద్రబాబు, ప్రస్తుత ఎపి సిఎం జగన్‌రెడ్డినుద్దేశించి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సుపరిపాలన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణా వస్తే రాష్ట్రం చీకటి పాలవుతుందని, నక్సల్స్ వస్తారని, అసలు తెలంగాణ వారికి పరిపాలనే చేతకాదని అన్న వారంతా… ఇప్పుడు ఎక్కడికి పోయారో కూడా తెలవడం లేదన్నారు.

కానీ సిఎం కెసిఆర్ మాత్రం వారందరికి సుపరిపాలన ద్వారా సమాధానం చెప్పారని పేర్కొన్నారు.గతంలో ఉద్యమం సమయంలో వ్యతిరేకించిన లగడపాటి రాజగోపాల్ కూడా ఈమధ్య కాలంలో తెలంగాణా పాలన బాగుందని చెప్పినట్టు విన్నాను..అంతే కాకుండా మరి కొందరు వ్యతిరేకులు కూడా నాడు వ్యతిరేకించి తప్పు చేశామని పశ్చాత్తాప పడినట్టుగా విన్నాను..అని మంత్రి అన్నారు. ఇలాంటి వ్యతిరేక శక్తుల అంచనాలన్నింటిని తలకిందులు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని చెప్పారు. కెసిఆర్ పాలన బాగున్నది కాబట్టే…అభివృద్ధి ఉరుకులు పరుగులు పెడుతుందని వివరించారు. కెసిఆర్ గనుక పరిపాలనలో తడబడితే…నవ్వేటోని ముందు జారి పడ్డట్లు అయ్యేది..ఏరు బడ్డ సంసారమే అయినప్పటికీ ఎంతో గొప్పగా..దేశానికే దిక్సూచి మాదిరిగా పరిపాలన చేస్తున్నారన్నారు.

మన రాష్ట్రంలోని పథకాలను కాపీ కొట్టి కేంద్రం అమలు చేసున్నదన్నారు.ఇలాంటి వారా డబుల్ ఇంజన్ సర్కారు పాలన తెస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ధరణిపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. భూముల వివరాలను ఆన్‌లైన్ చేయడం ద్వారా 65 లక్షల మందికి 65 వేల కోట్ల రూపాయలను రైతు బంధు కింద అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా రైతు బీమా కూడా రైతు చనిపోగానే ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా సంబంధిత కుటుంబానికి అందుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు ధరణిని రద్దు చేస్తామంటే…మళ్లీ పాత విఆర్‌ఓల పాలన తెస్తారా? అని ప్రశ్నించారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

ఆన్‌లైన్ డిజిటల్ పాలనలో దేశానికే తెలంగాణా ఆదర్శంగా నిలిచిందని అన్నారు.మనం చేసిన పనులు చెప్పకపోతే కూడా అది మంచిది కాదని పేర్కొన్నారు. మంచి పనులు చెప్పకపోతే..చెడు పనులే ప్రచారంలోకి వస్తాయని, అప్పుడు దేశానికి, ప్రపంచానికి నష్టమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏనాడో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అందువల్ల సుపరిపాలన కార్యక్రమంలో ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. అస్సాంకు చెందిన బిజెపి నాయకుడొకరు ఇటీవల విద్యుత్ సరఫరా తగినంత చేయలేక,ఫ్యాన్లు, ఎసిలు తక్కువగా వాడుకోవాలంటూ అక్కడి ప్రజలకు సూచించారని మంత్రి చెప్పారు. ఇక్కడ కూడా బిజెపి నేతలు ఇలాంటి పాలన తేవాలని చూస్తునారని ఎద్దేవా చేశారు.

గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆపద్బందు పథకం కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగానని, ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా రైతుబీమా ఆసరా లభిస్తున్నదన్నారు. ఇక చెరువులు, కుంటల అభివృద్ధి గురించి ఇటీవల మహరాష్ట్ర సర్పంచ్‌ల సంఘం నేత కూడా ఆశ్చర్యపోయారని, ఆయా రాష్ట్రాలకు ఇక్కడి సర్పంచ్‌లను టూరు తీసుకుపోతేనే ఇక్కడి అభివృద్ధి తెలుస్తుందని అన్నారు.గతంలో రాజగోపాల్‌పేట చెరువులో నీరు లేక చేపల్ని బతికించేందుకు రెండు బోర్లు వేశామని, అయినా చేపలు పెద్దగా బతక లేదని అన్నారు. అదే నేడు చెరువు నిండా నీళ్లు నిండిపోయి చేపల్ని పట్టే పరిస్థితి లేదన్నది అక్కడి బెస్తవారి అభిప్రాయమన్నారు.

వారంతా వచ్చి చెరువు నీటిని ఖాళీ చేయమంటున్నారని, తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. తెలంగాణ వారంతా తలెత్తుకునే విధంగా కెసిఆర్ పాలన ఉందన్నారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ కొత్తగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. విద్యుత్ సరఫరా మెరుగుపడిందని, పోలీస్ శాఖ సహకారంతో శాంతి భద్రతలను కాపాడుతున్నామని, కొత్తగా మండలాల ఏర్పాటు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాట్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు, గ్రామ పంచాయతీల ఏర్పాటు,మున్సిపాలిటీల ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలు కలిగాయని వివరించారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ, జిల్లా ఎస్‌పి రమణకుమార్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతికిరణ్,అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌ఓ నగేష్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డిసిఎంస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, డిసిసిబి వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి,లతా విజేందర్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, కొండల్‌రెడ్డి, ప్రభుగౌడ్,డాక్టర్ శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి వికలాంగులు క్షీరాభిషేకం చేశారు. తమ పింఛన్‌ను 4016 రూపాయలకు పెంచినందుకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. తమ ఎన్నటికీ కెసిఆర్ మేలును మరవలేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News