హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణా రన్ కు నగరంనుండి పెద్ద సంఖ్యలో యువత హాజరు కావడంతో విజయవంతంగా కోనసాగింది. నెక్లెస్ రోడ్ డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం మైదానం నుండి ప్రారంభమైన 2 కె, 5 కె రన్‌లకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్‌లు హాజరయ్యారు. ప్రముఖ క్రీడాకారులు ఈషా సింగ్, ప్రముఖ సింగర్‌లు మంగ్లీ, రామ్, సినీ నటి శ్రీలీల లు హాజరయ్యారు.
ఈ తెలంగాణా రన్ ప్రారంభోత్సవానికి ముందు ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ లు ఆలపించిన తెలంగాణా పాటలు హాజరైన యువతీ, యువకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. దాదాపు 4 వేలకు పైగా రన్నర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు, బతుకమ్మలు, డప్పులు, ఇతర నృత్యాలతో హోరెత్తించారు. పోలీస్ అశ్విక దళం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2కె, 5కె తెలంగాణా రన్‌లను రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్‌లు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
దేశంలోనే నెంబర్ వన్ సిఎం కెసిఆర్
అభివృద్ధిలో నెంబర్ వన్ తెలంగాణా – : మంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా పురోగమనానికి ప్రధాన కారణమైన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సి.ఎం అని ప్రశంసించారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం గా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణా కు మంచి కీర్తి, ప్రతిష్టలు తేవాలి:యువతకు మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఐటి పారిశ్రామిక రంగాల్లో తెలంగాణా రాష్ట్రంతో మరే రాష్ట్రం పోటీ పడడం లేదని, ఇదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత బాగస్వామ్యం వహించాలని రాష్ట్ర యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. అన్ని రంగాల్లో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అంత్యంత సమర్దవంతం గా అమలు చేస్తూ తెలంగాణా రాష్ట్రానికే తెలంగాణా ఆదర్శనంగా నిలిచిందని అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ స్ఫూర్తిగా తెలంగాణా రన్‌ను నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అప్రతిహాత అభివృద్ధిని మరోసారి ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించామని తెలిపారు.
దేశంలోనే తెలంగాణ అత్యంత సురక్షిత రాష్ట్రం : డిజిపి అంజనీ కుమార్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణా రాష్ట్రం సురక్షిత నగరంతోపాటు ఆరోగ్యవంతమైన రాష్ట్రమని అన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే కాక ప్రపంచం లోనే మేటిగా నిలిచిందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అద్భుత సౌధం తెలంగాణ సచివాలయం నేపథ్యంలో తెలంగాణా రన్ నిర్వహించడం ఒక అద్భుత దృశ్యమని అంజనీ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి ఈషా సింగ్, సినీ నటి శ్రీలీల లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ డిజి లు విజయ్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, ఐజి రమేష్‌రెడ్డిలతో సహా పలువురు సీనియర్ ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.