Sunday, December 22, 2024

రైతన్నలకు అద్భుత వరం రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

‘అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే కెసిఆర్ సర్కార్ ఇది.. నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇది.. రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఇది’… ఆ దిశగా అడుగులు వేస్తున్న సిఎం కెసిఆర్ రైతు బాంధవుడిగా నిలిచారు. తాజాగా కెసిఆర్ సర్కారు తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం కర్షక సోదరుల కళ్ళలో దీనత్వం తొలగి ధీరత్వం తొణికిసలాడుతున్నది. కెసిఆర్ లో నిలువెల్లా రైతు స్వభావం నిండి ఉందనడానికి రైతు రుణ మాఫీయే తార్కాణం. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతులు పడుతున్న అవస్ధలను కళ్ళారా చూసిన కెసిఆర్ చెప్పిన ఒక్క మాట… అండగా ఉంటానన్న ఒకే ఒక్క మాట… లక్షలాది మంది రైతుల గుండెల్లో భారాన్ని దూరం చేసింది.

Also Read: జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి

పంట పండక కొందరు.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక మరి కొందరు.. ఇలా కడుపు మంటతో అల్లాడుతున్న వారికి భవిష్యత్‌పై భరోసా నింపింది. కూడు లేక అల్లాడుతున్న వారిని కుండలో మెతుకై ఆదుకునేందుకు ఒక నాయకుడు ఉన్నాడనే నమ్మకం కలిగించింది.. ఆ సమయంలో కెసిఆర్ ఆశాకిరణమయ్యారు. రైతుల ఆశలను సాకారం చేస్తూ కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు. దాంతో తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ప్రస్తుతం రైతు రుణ మాఫీ నిర్ణయం సంచలనాత్మకమనే చెప్పాలి. కెసిఆర్ నిర్ణయంతో రైతుల కళ్ళలో ఆనందానికి అవధులు లేవు. రైతుగా పుడితే తెలంగాణలోనే పుట్టాలన్న ఆకాంక్షను కర్షక సోదరులు వ్యక్తం చేస్తున్నారు.

స్వరాష్ట్రంలో రైతు రాత మారింది. సకాలంలో ఎరువులు సరఫరా, రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి, రైతు బీమా ఇలా అనేక విధాలుగా అండగా నిలుస్తోంది. కెసిఆర్ సర్కార్ ఇస్తున్న చేయూతతో రైతులు రికార్డు స్ధాయిలో పంటలు పండిస్తూ తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. ఉద్యమ సమయంలోనే తన మదిలో మెదిలిన ఆలోచనల వెలుగులో ఆవిష్కృతమైన పథకమే ‘రైతు బంధు’. ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడిగట్టిన రైతుల హృదయాల్లో రైతుబంధు ద్వారా ఆశాదీపాలను కెసిఆర్ వెలిగించారు. గతంలో ఏ సిఎం చేయని విధంగా రైతు రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు వేదికలు, రైతు బంధు సమితుల ఏర్పాటు వంటి ఒకటా.. రెండా..లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చిన సంస్కరణల వాది కెసిఆర్.

ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి జవజీవాలు అందించడంలోను, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో రాష్ట్ర సర్కారు సఫలీకృతమైంది. అధికారంలోని వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు ‘సుజల, సుఫల, సస్యశ్యామల’ తెలంగాణగా మారింది. ఇంతటి అపూర్వమైన, అద్భుతమైన మార్పుకు కర్త, కర్మ, క్రియ కెసిఆరే. అందుకే అన్నదాతలకు కెసిఆర్ ఆపద్బంధువయ్యారు. ‘పొలాల నన్నీ… హలాల దున్నీ… ఇలా తలం లో హేమం పిండగ… జగానికంతా సౌఖ్యం నిండగ…’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువు చేసింది. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణయే అనడంలో సందేహం లేదు.

కేవలం రైతు బంధే కాదు రైతు బీమా పథకం కూడా అన్నదాతల కుటుంబాలకు ఎనలేని ధీమానిచ్చింది. తాజాగా రూ. 19 వేల కోట్ల రుణాలు మాఫీ రైతులకు మరింత భరోసాను ఇచ్చింది. మరోసారి రైతు పక్షపాతిగా కెసిఆర్ నిలిచారు. వాస్తవం గా ముఖ్యమంత్రి అసామాన్యుడు. ఎవరూ అందుకోని విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయనడానికి రైతు రుణమాఫీయే నిదర్శనం. మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టినా, ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను తగ్గించినా, కరోనా లాంటి కష్టకాలమొచ్చినా, రైతుబంధు సహాయాన్ని ప్రభుత్వం సమయానికి అందించడమంటే రైతులపట్ల కెసిఆర్‌కు ఉన్న ప్రేమకు ఇది ప్రబల నిదర్శనం.

విధివశాత్తూ ఏ రైతైనా మరణిస్తే, మరణించిన నాటి నుండి పది రోజుల్లోగా రూ. అయిదు లక్షల బీమాను ప్రభుత్వం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటోంది. ఈ మాదిరిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించవు. అన్నదాతలలో సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల కోసం రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికలను నిర్మించడం కూడా చరిత్రే. ‘భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు.. వీరు అత్యంత శక్తి మంతులు, అత్యంత స్వతంత్రులు, అత్యంత ధర్మబద్ధులు’ అని ప్రముఖ శాస్త్రవేత్త థామస్ జెఫెర్సన్ చేప్పిన విధంగా తెలంగాణలోని కర్షకులకు లభిస్తున్న ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును కోరుకుంటూ రైతు శ్రేయోరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది. రైతు సంక్షేమ ప్రభుత్వ సారథి చల్లగా ఉండాలంటూ కెసిఆర్ ను రైతన్నలు దీవిస్తున్నారు.. అంతేకాదు, సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశనం చేస్తుండడం గమనార్హం. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని రైతులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది కెసిఆర్ పాలనకు దర్పణం. కెసిఆర్ నాయకత్వంలోనే దేశంలోని రైతుల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుందన్న ఆశాభావంతో ఉన్న కర్షకుల కోరిక నెరవేరాలని ఆశిద్దాం.

కోలేటి దామోదర్
(చైర్మన్, తెలంగాణ రాష్ట్ర
పోలీస్ గృహ నిర్మాణ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News