మన తెలంగాణ / హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం స్త్రీ పురుషులు ఇరువురు సంఘటితమై సమన్వయం చేసుకుంటూ ఒక స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి అన్నారు. మహిళ సాధికారతను మరింత సాధించడానికి చేయవలసిన కృషి గురించి వారు అనేక సూచనలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖ మహిళలతో ‘మెరుగైన సమాజం కోసం సమ్మిళిత స్ఫూర్తితో’ అనే అంశంపై చర్చా గోష్టి , కవి సమ్మేళనం నిర్వహించారు.
ప్రముఖ కవయిత్రి మహెజబిన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కవులు కళాకారులతో పాటు సాహితీవేత్తలు మేధావులు అంతా కలిసి ఒక వారధిగా ఉండి, మహిళల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఏది అయితే అమలు చేయాలంటుందో వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ మానవ సంబంధాలు బాగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి, సంస్కరించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అమ్మాయిలకు చెప్పే జాగ్రత్తలన్నీ అబ్బాయిలకు కూడా చెప్పాలని సూచించారు. అనంతరం హిప్నో పద్మాకమలాకర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కష్టాల గురించే గాక మన ఆడపిల్లలతో పిల్లలు పుట్టడం, సెక్స్ గురించికూడా మాట్లాడుతూ నేటి ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించాలన్నారు . మహిళలు తమకు తాము సంస్కరించుకోవడానికి పురుషులను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదని మరో నాయకురాలు ఉప్పల పద్మ అన్నారు. జీవితం గురించి లౌక్యం జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండాలని కృష్ణవేణి అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలని చెబుతూ అభము శుభము తెలియని అమ్మాయిలను ఎత్తుకుపోయి వేశ్యాగృహాలకు అమ్ముకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. డాక్టర్ రజిని మాట్లాడుతూ సమాజంలో మనం ఏ అమ్మాయిల ఎదుగుదల గురించి మాట్లాడుకుంటామో ఆ వర్గం వారు లేకుండా చర్చలు చేయడము సబబు కాదని సూచించారు. మహిళా సాధికారత మహిళ అభ్యుదయం తదితరాలపై చదివిన కవితలు ఈ సందర్బంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో అనేకమంది మహిళలతో పాటు కొందరు విద్యార్థినిలు పాల్గొన్నారు.