Wednesday, January 22, 2025

వితంతు జీవితాలపై పరిశోధన

- Advertisement -
- Advertisement -

వితంతు స్త్రీలు రెండు జీవన్మరణ పోరాటాలు చేస్తూ మానవ గౌరవం లేని అసమానకరమైన జీవితాల్ని హీనంగా దీనంగా గడువుతున్నారు. లోకనీతి అంటూ పురుషస్వామ్యం శాసనాలు జారీ చేస్తున్నది. శాసనోల్లంఘనం శిక్షలు సహించబోమని చెప్తున్నది. అదొక అమానుషం, అంటరానితనం, అమానవీయమే అని అంటారు రచయిత అనిశెట్టి రజిత. భారత దేశంలో వితంతు వ్యవస్థపై సామాజిక సాహిత్య వ్యాసాలు ‘వ్యక్తిత్వాలు’ కథనాలు గ్రంథం ప్రముఖ రచయిత అనిశెట్టి రజిత సంపాదకవర్గంలో డిసెంబర్ 2023 రుద్రమ ప్రచురణలులో వెలువడింది.

ఈ గ్రంథంలో మొత్తం 36 మంది రచయితలు రాసిన 58 వ్యాసాలు ఉన్నాయి. అందులో సామాజిక వ్యాసాలు పద్దెనిమిది. సాహిత్య వ్యాసాలు ఇరవై, వ్యక్తిత్వాలు ఏడు, పదమూడు కథనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అందులో స్త్రీ రచయితలు 27 మంది, పురుషులు 9 మంది ఉన్నారు. ఒక్కొక్క రచయిత పది వ్యాసాల నుండి కనిష్టంగా రెండు వరకు ఈ గ్రంథంలో రాశారు. రచయితలు కోల్లాపురం విమల, శీలా శుభద్రా దేవి, కొండవీటి సత్యవతి దీనికి ముందుమాటలు రాశారు. మొత్తం గ్రంథాన్ని పరిశీలించినప్పుడు భారతదేశంలో కొనసాగుతూ వస్తున్న ఆచార వ్యవహారాల పరిణామక్రమంలో మార్పులకు లోనవ్వుతూ కొనసాగుతున్నది

వితంతు వ్యవస్థ. ‘విధ్వ’ అనే సంస్కృత పదం నుండి వచ్చినది. విధవ అనే పదం వైధవ్యం పొందిన స్త్రీ, భర్తను కోల్పోయిన భార్య అని అర్థం. మన దేశంలో వైధవ్యం పొందిన స్త్రీ ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అవి సామాజిక, ఆర్థిక కుటుంబపరమైన సమస్యలుగా ఉంటాయన్నారు. ఇక సాధారణంగా భర్త చనిపోతే భార్య బొట్టు పెట్టుకోకూడదు కుంకుమ అసలు ముట్టుకోరాదు. మంగళసూత్రం మట్టెలు తీసేయాలి. తెల్ల చీరనే ధరించాలి వైధవ్యానికి గుర్తుగా. శుభకార్యాలకు వెళ్ళకూడదు. వీరు వయసుతో నిమిత్తం లేకుండా నిరంతరం భగవత్ ధ్యానంలో నిమగ్నం కావాలి. పేదరికం, నిరక్షరాస్యత, అండగా ఎవరూ లేకపోవడం, ఆర్థిక కుంగుబాటు, చిన్న మధ్య వయసు వితంతువులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుందన్నారు. ఒంటరిగా ఉన్న మహిళ ఎదిగిన ఆడపిల్లను రక్షించుకోవడం, తనను తాను రక్షించుకోవడం సవాలుగా మారుతుంది.

కుటుంబపరమైన సమస్యల్లో వయసు మళ్ళిన వితంతువులకు కుటుంబపరంగా తీవ్ర అనాధరణకు గురవుతుంటారు. పెళ్లయిన కొత్తలోనే భర్త చనిపోతే వారి బాధలు వర్ణనాతీతం. తిండి, బట్ట, ఇల్లు సమస్యలు పిల్లల చదువులు పెళ్లిళ్ల సమస్యలతో పాటు పిల్లల నియంత్రణ కష్టతరమైతుంది. ఇంటా బయటనుండి వచ్చే లైంగిక వేధింపులను తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉన్నదని రచయిత డా. మెట్టా ఉషారాణి అభిప్రాయపడ్డారు. రచయిత హేమలత దేవి అన్నట్టుగా భర్త చనిపోయి విపత్కర పరిస్థితుల్లో ఆమె జీవనపోరాటం సాగిస్తుంటే సామాజిక ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. వీరి బతుకు మారాలి అన్నా, వీరి జీవన విధానంలో మార్పు రావాలన్నా, మన పురాణంలో చెప్పిన కట్టుబాట్లు నేటి సమాజ పరిస్థితుల్లో అన్నిటినీ పాటించవలసిన అవసరం లేదని, మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా మనం, మన సమాజం, మన చట్టాలు మారితేనే అది సాధ్యపడుతుందంటారు రచయిత హేమలత.

స్త్రీల జీవన విధానంలో మార్పుకు చేసే కృషిలో స్త్రీని శారీరకంగా, మానసికంగానే గాక, సామాజికంగా, నైతికంగా, ఆర్థికంగా, బానిసగా ఒక దోపిడీ వస్తువుగా మార్చిన వితంతు వ్యవస్థ నిర్మితి భావనను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ వ్యవస్థకు ప్రధాన మూలాలైన కుల వ్యవస్థ, జెండర్ వీటి నుండి ఆవిర్భవించిన బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ భావజాలం చారిత్రక నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటారు రచయిత డా. తెన్నేటి విజయచంద్ర. ప్రాచీన సాహిత్యంలో గాని, ఆధునిక సాహిత్యంలో గాని సామాజిక సమస్యలు ఎన్నో సాహిత్యంగా వచ్చాయి. కానీ చాలా వరకు మహిళా సమస్యల దృష్టి కోణంలో సాహిత్యం తక్కువ మొత్తంలో మనకు లభ్యమవుతాయి. అయితే వారి జీవితాలను నవలలుగా, కథలుగా తేవాలనుకుంటే వారి జీవితాల చుట్టూ అల్లుకోబడిన అనేక సమస్యలు, సంఘటనలు, సంవేదనలు, సంఘర్షణలు, భయాలు, ఆందోళనలు మొదలైనవన్నీ కళ్ళ ముందు ఉంచే విధంగా రచనల్ని చిత్రించాల్సిన అవసరం ఉన్నది.

ఈ అవసరాన్ని గుర్తించిన రచయిత సోమంచి శ్రీదేవి పైన చెప్పిన అంశాలన్నిటినీ కలిపి సంగమం అనే నవలను తీసుకొచ్చిందనే విషయాన్ని రచయిత డా. కొమర్రాజు రామలక్ష్మి ప్రస్తావించారు. భారతదేశంలో వితంతు వ్యవస్థ తీరుతెన్నులను స్త్రీల జీవిత పరిణామాలను, ఆ వ్యవస్థలోని సామాజిక రుగ్మతల నుండి బయటపడడానికి స్త్రీలు చేసే పోరాటాలను విప్పి చెప్పే ప్రయత్నం చేసిన నవల శతాబ్ది సూరీడు. ఈ నవలలో ప్రధాన పాత్ర సూరీడు పుట్టుకతో మొదలై మరణంతో ముగిస్తుందని రచయిత డా. బండారి సుజాత అన్నారు.

భారతదేశ చరిత్రలో సాంప్రదాయ ఆచారాల పేరు మీద వేల ఏళ్లుగా హింసకు గురవుతూ వచ్చింది మాత్రం స్త్రీలే. అటువంటి సాంప్రదాయ ఆచారాల మధ్య నలిగిపోయిన స్త్రీల జీవితాలను చిత్రించిన గురజాడ, కందుకూరి వీరేశలింగం పంతులు గార్ల సాహిత్య రచనలను సమీక్షించి మన ముందు ఉంచారు రచయిత డా. కందాళ శోభరాణి. పైన చెప్పినట్టు యువ వితంతువులు తమ జీవితం మొత్తం భగవంతుని సేవలోనే నిమగ్నం కావాలనే వాదన ఉండేది. ఈ అంశం ప్రధానంగా ఒక నవల అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి రాశారు. కృష్ణ మందిరాలలో ఉన్న, బ్రహ్మచార్యులు సైతం పైకి నియమ నిష్టలతో బతికినవారుగా కనిపించినా భక్తి ముసుగులో ఆడవారిపై వారి ఆగడాలు చేసేవారు. రాధేశ్యామీలు తమ మరణాంతరం దహన సంస్కారాల కోసం, కర్మకాండాల కోసం దాచుకున్న డబ్బును సైతం దోచుకునే పరిస్థితులు అక్కడ ఉండేవి. రాదేశ్యామీలా పరిస్థితులు ఆనాటి 50, 60 ఏళ్ల క్రితం సమాజానికి ప్రతిబింబంగా కనిపిస్తాయి.

పవిత్ర నగరంగా పిలవబడే బృందావనంలోని కఠోర సత్యాలను వెలుగులోకి తెచ్చింది రచయిత్రి ఇందిరా గోస్వామి రాసిన ‘కన్నయ్యవాడలో క్రీనీడలు’ నవల అంశమన్నారు రచయిత డా. మురాడి శ్యామల. చరిత్రలోని ‘నాచి’, ‘మొల్ల’ లాంటి స్త్రీలు తమ తమ సామాజిక కులవర్గాల హోదాలు ఏవైనా వాటిని జ్ఞానం ద్వారా అధిగమించి తమ అస్తిత్వాలను గౌరవ ప్రతిష్టలను పొందారు. ప్రాచీన కాలంలో మరుగున పడి ఉన్న స్త్రీల అస్తిత్వాలు ఎన్నో…వారు దాటి వచ్చిన అగ్నిసరస్సులూ, వైతరణి నదులు ఎన్నో…ఎంతైనా స్త్రీత్వపు శక్తుల ఆవిష్కరణలో తొలి అడుగులు వాళ్ళవే. దారులేసిన అక్షరాలు వాళ్ళవే. ఆ స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు ప్రకటిస్తారు రచయిత అనిశెట్టి రజిత.

భారతీయ సాంప్రదాయ ఆచారాల పేర, విశ్వాసాలమధ్య మగ్గిపోతున్న మహిళా జీవితాల ఉద్ధరణకు కృషి చేసిన ఎన్నో వ్యక్తిత్వాలను రచయితలు అనిశెట్టి రజిత, మెట్టా ఉషారాణి, బొమ్మకంటి కృష్ణకుమారి, శాంతిశ్రీ బెనర్జీలు మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు. బాల్యవివాహాలు, అవిద్య వల్ల ఆడపిల్లల బతుకులు ఒంటరితనాల్లోకి అనివార్యంగా తోసేస్తున్నది ఈ సమాజం. ఇది నాటి మాట కాదు ఇప్పుడు జరుగుతున్న కథ కూడా. ఇటువంటి సంఘటనలు కథనాలు గ్రామాల్లో తండాల్లో కోకొల్లలు.

తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో సుందరయ్యనగర్ తండాలో జరిగిన ఒక దీనగాథని మన ముందుంచే ప్రయత్నం చేశారు రచయిత ఈరగాని భిక్షం. ఇలాంటి ఎన్నో దీనమైన కథనాల్ని మన ముందుంచుతూ భారతదేశంలో వితంతువులు ఎదుర్కొంటున్న సామాజిక, సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మన ముందుంచే ప్రయత్నం చేసింది ‘భారత దేశంలో వితంతు వ్యవస్థ’ అనే గ్రంథం. మత ధర్మం, సాంస్కృతి పేర స్త్రీలను బంధించిన అమానవీ ఆచారాలకు వ్యతిరేకంగా స్త్రీలు గౌరవంగా జీవించే హక్కు కోసం స్వేచ్ఛ సమాజం నిర్మించుకునేందుకు సంఘటితం కావాల్సి ఉన్నది. ఆ దిశగా ఈ గ్రంథాన్ని పరిశోధన అంశంగా తీసుకురావడంలో అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకత్వంగా ఎంతో కృషి చేశారు. వారి కృషి చరిత్రలో మిగిలిపోతుంది.

శోభరమేష్ 8978656327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News