Friday, November 22, 2024

మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద, దళిత, బిసి, రైతుల టీమ్ అని స్పష్టం చేశారు. భారత్ పరివర్తన కోసం పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్ అని అన్నారు. బిఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే, భారతదేశంలో పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని, ఇది జాతీయస్థాయిలో పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు.

దేశాన్ని తప్పకుండా మారుస్తామని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదని అన్నారు. ఎన్నికలలో పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలని అన్నారు. దేశంలో రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలో ఎన్నో రకాల నినాదాలిచ్చాయని, కానీ మొట్టమొదటి సారి ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ నినాదమివ్వలేదని తెలిపారు. 60 శాతానికిపైగా ఉన్న రైతులు, కార్మికులు తమ మద్దతును బిఆర్‌ఎస్ పార్టీకి ప్రకటిస్తుండటం కాంగ్రెస్, బిజెపి పార్టీలకు భయాన్ని కలిగిస్తున్నదని, దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వింత వింత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం సిఎం కెసిఆర్ పండరిపూర్‌లోని విఠలేశ్వర స్వామి, రుక్మిణీదేవీని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలిలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో మాజీ ఎంఎల్‌ఎ, దివంగత భరత్ బాల్కే కుమారుడు స్థానిక ఎన్‌సిపి నేత భగీరథ బాల్కే తన అనుచరులతో కలిసి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్కోలిలో జరిగిన బహిరంగ సభలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యం అయినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని అన్నారు. వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఇలా ఉండాల్సింది కాదని, మరింత అభివృద్ధి చెందాల్సి ఉండాలని అభిప్రాయపడ్డారు. దశాబ్దాల పాటు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలపై కెసిఆర్ విరుచుకుపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయాయని, అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. అభివృద్ధి విషయంలో పొరుగు దేశం చైనా ఎక్కడున్నది…? భారత్ ఎక్కడున్నదో చూడాలని పేర్కొన్నారు.
నేతలు దివాళా.. రైతులకు దివాళి
తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే దివాళా తీస్తామని కొందరు అంటున్నారని.. కానీ, దివాళా తీసేది నేతలు, దివాళి పండుగ చేసుకొనేది రైతులని సిఎం కెసిఆర్ అన్నారు. రైతు సంక్షేమ పథకాలు అమలైతే దేశంలోని రైతులంతా బిఆర్‌ఎస్ వెంట నడుస్తారని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. అందుకే బిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

భారతదేశంలో 41 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందని, దేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షపాతం సంభవిస్తుందని వివరించారు. దీంట్లో సగం నీరు భాష్పీకరణ ప్రక్రియ ద్వారా ఆవిరిగా మారుతుండగా, మిగిలిన 70 నుంచి -75 వేల టిఎంసిల స్వచ్ఛమైన నీరు నదుల్లో ప్రవహిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ముంటే, వారు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరానికి సరిపడా సాగునీటిని అందించవచ్చని తెలిపారు. దేశంలో అందుబాటులో ఉన్న 70 వేల టిఎంసిల నీటిలో … మనం ఎన్ని టింఎంసిలు వాడుకొంటున్నామని అడిగారు. దేశంలో ఇంత నీరుండగా ఎందుకు వాడుకోలేకపోతున్నామని ప్రశ్నించారు. వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఎంత మేర మనం సాగు చేయగలుగుతున్నామని అడిగారు. ప్రభుత్వంలో సత్తా ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. బిజెపికి దమ్ము ఉంటే దేశంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సవాల్ విసిరారు. భారత జల్ నీతిని మార్చాలని, నీల్లుండగా మోసపోకూడదని పిలుపునిచ్చారు. విద్యుత్తు ఉత్పత్తి 5 రకాలుగా జరుగుతుందని, ధర్మల్ విద్యుత్తు మాత్రమే సరియైన విధానమని పేర్కొన్నారు. దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఎందుకు వాటిని సరిగా ఉపయోగించుకోకూడదని ప్రశ్నించారు. మనం ఐక్యం కానంత వరకు మన సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కిసాన్ సర్కార్ ఏర్పాటు చేసి, రైతులకు 24 గంటల నిరంతన ఉచిత విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు అండ..
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ప్రతి సంవత్సరం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. దేశంలో పండుతున్న ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రైతులు ఆందోళన బాట ఎందుకు పట్టాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. పనిచేయని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
ఈయన పేరు భగీరథ… ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తడు
భగీరథ బాల్కే.. ఈయన పేరులోనే భగీరథుడి పేరు ఉన్నదని, ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తాడని సిఎం కెసిఆర్ తెలిపారు.భగీరథ్ బాల్కే రానున్న రోజుల్లో చంద్రబాగ్ నీటిని మంగళ్ వాడ్‌కు తరలించనున్నారని చెప్పారు. భగీరథ బాల్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలయ్యే ప్రతి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చరు. ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు.
మన కళ్ళ ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయి
తాను ఈ సభలో ప్రస్తావించే విషయాలను మీరు మీ మీ గ్రామాలకు వెళ్ళాక మిత్రులతో, బంధువులతో చర్చించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశానికి ఏదైనా లక్ష్యముందా లేక లక్ష్యం లేకుండా మనం దారి తప్పిపోయామా..?, దారి మరిచి చీకట్లో మగ్గుతున్నామా..? అని ప్రశ్నించారు. ప్రతి భారతీయునికి ఈ విషయంపై ఆలోచించాల్సిన అనివార్య సమయమిదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో త్యాగాలతో నేడు మనం స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నామని, కానీ నేడు మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని మనం చేపట్టాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు. నూతనోత్సాహంతో విప్లవ మార్గంలో ఒక కొత్త ఉషోదయం కోసం భారతదేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.మనకు స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిందని, ఇది తక్కువ సమయమేమీ కాదని పేర్కొన్నారు. మన కళ్ళ ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయని తెలిపారు. సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, మలేషియా, భౌగోళికంగా హిమాలయాలకు ఆవల మన సరిహద్దు దేశమైనా చైనా దేశం ఉందని, 1982 వరకు చైనా దేశం మన దేశం కంటే బీద దేశంగా ఉండేదని వివరించారు. నేడు చైనా దేశం ఎక్కడుంది.. .మనం ఎక్కడున్నామని, ఈ విషయం పై ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు.
ఒక్క పార్టీ అయినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా..?
ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి.. ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు.. ఎన్నీ పార్టీలకు మీరు మద్దతు పలికారని ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ప్రజల అందలం ఎక్కించని ఒక్క పార్టీ పేరైనా చెప్పందని అడిగారు.కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది… వీరి తర్వాత ఎన్‌సిపికి అవకాశమిచ్చారు…శివసేనకు, బిజెపికి…ఇలా అందరికీ అవకాశం కల్పించారని, వీరిలో ఒక్కరైనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. నూతన రాష్ట్రమైన తెలంగాణలో అతి తక్కువ సమయంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. నాకు మరాఠీ మాట్లాడటం రాదు…కానీ అర్థం చేసుకోగలనని కెసిఆర్ చెప్పారు.

మన యుద్ధంలో న్యాయం ఉంది… తప్పకుండా మనం విజయం సాధిస్తామని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర మారుతుందని.. రైతుల జీవితాలు మారుతాయని చెప్పారు. తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తా.. ?(బోయా పేడ్ బబూల్ కా, ఆయే కహా సే ఆమ్…?), మామిడి పండ్లు తినాలనుకుంటే మామిడి చెట్టునే నాటాలి(ఆమ్ కా అపేక్షా హై తో ఆమ్ కో పౌదా లగానా చాహియే) అని పేర్కొన్నారు. ముండ్ల చెట్టును నాటి, పండ్లు కావాలంటే కుదరదు(కాంటోన్ కా పేడ్ లగాకే, ఫలోం కా అపేక్షా కరేతో నహీ మిలేగా), పాలు కావాలంటే ఆవులకు గడ్డి వేయండి, గాడిదలకు గడ్డి వేసి, ఆవుల నుండి పాలు ఎలా పొందగలం..?(గాయ్ సే దూద్ లేనా హై తో గాయ్ కో గాస్ దీజియే, ఘదోంకో గాస్ దేదో ఔర్ గాయోన్ కో దూద్ పూచో తో కహా సే మిలేగా) అని అన్నారు. మీకున్న ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.

మనం విభజింపబడక పోయినట్లైతే తప్పకుండా మనం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. తాను స్వయంగా రైతును అని, రైతు కుటుంబంలో పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని కెసిఆర్ అన్నారు. ఒక రైతుగా తాను రైతుల కష్టాలను, బాధలను అర్థం చేసుకోగలనని చెప్పారు. పశ్చిమ మహారాష్ట్రలో ఉచితంగా రైతలుకు కరెంటు ఇస్తున్నారా..?, రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నారా.. ? అని అడగగా సిఎం కెసిఆర్ అడగగా, ఇవ్వటం లేదని రైతుల గట్టిగా సమాధానం చెప్పారు. గ్రామ రెవన్యూ వ్యవస్థను కొనసాగించాలా..? అని కెసిఆర్ అడుగగా, వద్దు.. వద్దంటూ ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రకటించిందని, డిజిటల్ ఇండియా సరైనదే అయితే మహారాష్ట్ర రైతుల కోసం ఈ సౌకర్యాన్ని ఎందుకు కల్పించటం లేదని నిలదీశారు. రెవెన్యూ వ్యవస్థలోని అక్రమాల నుండి ప్రజలను కాపాడాలని, కానీ ఎవరూ ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. దేశ ప్రధాని మేకిన్ ఇండియా అన్నారు.. మేకిన్ ఇండియా అమలైతే ప్రతి చోట చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. పతంగుల మాంజాలు, హోళీ రంగులు, దీపావళి పటాకులు అన్నీ చైనా నుండి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. భారతదేశంలో వీటిని తయారుచేయలేమా…? అని అడిగారు.దేశంలో నూతన విధానాలు రావాలి….పారదర్శకత పెంపొందాలని, అందుకు ప్రజల ముందుండాలని పిలుపునిచ్చారు.

గ్రామ రెవెన్యూ ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని, అయినా జనం బాగు కోసం గ్రామ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ప్రతి ప్రాంతంలో తాను అడిగితే, గ్రామ రెవెన్యూ వ్యవస్థను తొలగించాలని చెప్పారని అన్నారు. భూ రికార్డుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా పకడ్బంధీగా రికార్డులను కాపాడుతున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న ఈ పథకాలను మీరెందుకు అమలు చేయడం లేదని నాయకులను అడగాలని ప్రజలకు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు తెలంగాణకు వస్తే అక్కడ అమలవుతున్న పథకాలను స్వయంగా చూపిస్తామని అన్నారు. 70 కోట్ల మంది రైతాంగం బిఆర్‌ఎస్ వెంట ఉండగా బిఆర్‌ఎస్ మరో పార్టీకి టీం ఎలా అవుతుంది..? ప్రశ్నించారు. రైతులు బిఆర్‌ఎస్ వెంట ఉన్నారా..? యుద్ధం చేద్దామా…? అని కెసిఆర్ అడుగగా, మీ వెంటే ఉన్నామంటూ రైతుల నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News