Monday, December 23, 2024

కలగా మిగిలిన కామన్ స్కూల్!

- Advertisement -
- Advertisement -

1990 తర్వాత దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పెచ్చుమీరిపోయిన తర్వాత విద్యారంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని అంతగా పట్టించుకోక, ప్రైవేట్ సంస్థలను పెంచి పోషించడంతో ఈ దుస్థితి ఏర్పడింది అనే విషయాన్ని సమాజం గుర్తించకపోతే ఈ వేధింపులకు, అకాల మరణాలకు, మానవ వనరుల విధ్వంసానికి పరిష్కారాలను కనుగొనలేము. కామన్ స్కూల్ విధానం వైపు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. అంతేకాదు సుమారుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సగం సగం మంది విద్యార్థులు ఇవాళ విద్యను అభ్యసిస్తున్నారంటే ప్రభుత్వరంగం ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలపైన బుద్ధి జీవులు, మేధావులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, సమాజం ప్రశ్నించకుండా ప్రభుత్వాలు ఎటువైపు వెళితే అదే విధానాన్ని సమర్థిస్తూపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి.

ప్రైవేటు కళాశాలలు, విద్యా సంస్థల్లో వేధింపులు ఈనాటివి కావు. విద్య ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయిందో ఆనాటి నుండి విద్యనిర్వచనం, రూపురేఖలు, స్వభా వం మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. విద్య పరిరక్షణ కోసం అనేక సంస్థలు ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ రంగంలోనే దానిని కొనసాగించాలని ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు అనాదిగా డిమాండ్ చేస్తున్నాయి. సాత్విక్ లాంటి ఎందరో విద్యార్థులు చేయని నేరానికి, తల్లిదండ్రుల ఒత్తిడికి, ప్రైవేటు సంస్థల వేధింపులకు నలిగి రాలిన మల్లెల్లా వాడిపోతున్నారు. సహజమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసించిన విద్య వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఎంతగానో తోడ్పడేది. ఎప్పుడైతే విద్య వ్యాపారీకరించబడి ర్యాంకులు, మార్కులు, ఉద్యోగాల కోసం విద్యా సంస్థల ప్రచారాన్ని జోరుగా నమ్మినటువంటి సమాజం, తల్లిదండ్రులు మెల్లమెల్లగా ఆ అశాస్త్రీయ విద్యా రంగానికి మూల్యం చెల్లించుకోవడం ఆరంభమైనది.

స్వాతంత్య్రానంతరం విద్యారంగంపైన నియామకమైన సెకండరీ కమిషన్ కొఠారి కమిషన్‌లతో పాటు అనేక విచారణ సంస్థలు సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చి ప్రభుత్వరంగంలోనే విద్యను కొనసాగించాలని, కామన్ స్కూలు విద్యా విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని, అసమానతలు, అంతరాలు, వివక్ష, కుల మత భేదాలకు తావు లేకుండా సమానత్వ భావన సాధించడానికి కామన్ స్కూల్ పరిష్కారమని ముఖ్యంగా కొఠారి చేసిన సూచన బుట్టదాఖలైన విషయం మనకు తెలుసు. 1990 తర్వాత దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పెచ్చుమీరిపోయిన తర్వాత విద్యారంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని అంతగా పట్టించుకోక, ప్రైవేట్ సంస్థలను పెంచి పోషించడంతో ఈ దుస్థితి ఏర్పడింది అనే విషయాన్ని సమాజం గుర్తించకపోతే ఈ వేధింపులకు, అకాల మరణాలకు, మానవ వనరుల విధ్వంసానికి పరిష్కారాలను కనుగొనలేము. కామన్ స్కూల్ విధానం వైపు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. అంతేకాదు సుమారుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సగం సగం మంది విద్యార్థులు ఇవాళ విద్యను అభ్యసిస్తున్నారంటే ప్రభుత్వరంగం ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి అంశాలపైన బుద్ధి జీవులు, మేధావులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, సమాజం ప్రశ్నించకుండా ప్రభుత్వం ఎటువైపు వెళితే అదే విధానాన్ని సమర్థిస్తూపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి. కొద్ది మంది సంఘ సంస్కర్తలు, విద్యావంతులు, విద్యారంగంలో మార్పును కోరే సంస్థలు కృషి చేసినంత మాత్రాన ప్రభుత్వరంగాన్ని పరిరక్షించుకోవడం సాధ్యం కావడం లేదు. ఇక పాఠశాల విద్య ప్రైవేట్‌రంగం చేతుల్లోకి వెళ్లిపోయిన కారణంగా ఫీజుల భారాన్ని మోయలేక అనేక మంది విద్యకు దూరం కావడమో, అప్పులపాలు కావడం జరుగుతున్న విషయాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు కూడా గుర్తించలేదు. హైదరాబాద్ పరిసరాల్లోని నార్సింగి శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అభ్యసిస్తున్న సాత్విక్ కళాశాల ప్రిన్సిపాల్ , అడ్మిన్ ప్రిన్సిపాల్, క్యాంపస్ ఇన్‌ఛార్జ్జిల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన లేఖలో పేర్కొంటూ తనతో పాటు తన మిత్రులకు కూడా నరకం చూపిస్తున్నారని, వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య లేఖలో పేర్కొనడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఈ పరిస్థితులకు దారి తీసిన కారణాలను నెమరు వేసుకోవడం చాలా ముఖ్యం.

39 Schools selected for Swachh Vidyalaya Puraskar 2022

‘కాలేజ్‌లో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్ళు చూపే నరకాన్ని, వివక్షను భరించలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ క్షమించండి నా కోసం బాధపడితే నా ఆత్మ శాంతించదు అని రాసిన లెటర్ నలిగిపోయి ఉండడాన్ని బట్టి చాలా కాలం క్రితమే రాసి ఉండొచ్చు అని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకా తన మాటల్లోనే ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు, మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మెన్‌గా కూడా పనికిరానని అవమానిస్తున్నారు. ఈ టార్చర్‌ను భరించలేక వెళ్ళిపోతున్నాను అంటూ కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులకు మనస్థాపానికి గురైన సాత్విక్ ఆలోచనలు ఇవాళ ప్రైవేట్ విద్యారంగంలో చదువుకుంటున్న ఎందరినో ప్రభావితం చేస్తాయి.

కొద్దో, గొప్పో తేడాతో ప్రైవేట్ రంగంలో ర్యాంకులు, మార్కులు, పోటీతత్వంతో వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు, సమాజం ఒకసారి అర్థం చేసుకుంటే ప్రైవేటు విద్యా విధానంపై బుద్ధి జీవులు, మేధావులు, విద్యావంతులతో సమగ్రమైన విచారణ చేపడితే కానీ వేధింపుల అంతరార్థం తెలవదు. 10వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలపై తల్లిదండ్రులు, విద్యార్థులు మోజు చూపుతున్న ఈ పరిస్థితులలో 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌కు పరుగులు తీసి శ్రీచైతన్య, నారాయణ వంటి కళాశాలల్లోకి ప్రాధాన్యత ఇవ్వడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ తమ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని కూడా మనం అంగీకరించాలి. ప్రైవేటు విద్యాసంస్థల్లో వేధింపులు, తప్పుడు విధానాలు, హింస ఉంటే కచ్చితంగా వ్యతిరేకించాలి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం.

స్టడీ అవర్స్ బాగా ఉంటాయని, పట్టించుకుంటారని, బయటకు వెళ్లే అవకాశం లేదని, మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు చాలా తోడ్పడతాయని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ప్రైవేటు కళాశాలలను శ్లాఘిస్తూ వాటి స్థాయిని ఆకాశానికి చేర్చేది మనమే అనే మన నేరాన్ని ముందుగా అంగీకరిస్తే కానీ ఇలాంటి దురాగతాలు, ఆత్మహత్యలు, వేధింపులకు పరిష్కారం దొరకదు. ఇటీవల శివరాత్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు వేధింపులను తట్టుకోలేనని తల్లిదండ్రులతో చెప్పినట్లు తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపినట్టు పత్రిక కథనం ద్వారా తెలుస్తున్నది. తల్లిదండ్రులకి ఫోన్ చేసి కళాశాలలో వేధింపులు భరించలేకపోతున్నానని, నాన్న చివరి చూపు అమ్మతో ఆఖరి మాటల కోసం తప్పించి జ్వరం వచ్చిందని రమ్మని కోరగా చివరిసారిగా మాట్లాడిన సాత్విక్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతాడని తల్లి కానీ, తండ్రి కానీ ఊహించలేదు. ఫిబ్రవరి 28, 2023 మంగళవారం రోజున రాత్రి 10 గం.ల ప్రాంతంలో స్టడీ అవర్స్ ముగిసిన తర్వాత తరగతి గదిలోనికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ గురించి యాజమాన్యం పట్టించుకోలేదని తోటి విద్యార్థులు ఒత్తిడి చేస్తే కానీ తాళం తీసి చూసేసరికి కొనఊపిరితో ఉన్నట్లు తోటి విద్యార్థులు చేసిన ఆరోపణ.

చనిపోయే రోజు అరగంట ముందు తండ్రి మందులు తీసుకువచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఈ సంఘటన జరగడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కళాశాల వేధింపులపై విచారణ జరిపించాలని, గుర్తింపు రద్దు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేయడం నేటి ప్రైవేటు విద్యా వ్యవస్థ ద్వారా సమాజానికి జరుగుతున్న ద్రోహానికి మచ్చు తునకగా భావించవచ్చు.సహజమైన పరిస్థితులకు భిన్నంగా యాంత్రిక జీవితానికి ఆలవాలమైనటువంటి ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్బంధం, అణచివేతతో కూడిన విద్య వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం కాదు కదా ఆందోళనకు గురి చేస్తుందనే విషయాన్ని ఇప్పటికైనా మేధావులు, మానసికవేత్తలు గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది.

విద్యకు నిర్వచనాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా ప్రకటించుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, మానసిక చైతన్యం, సామాజిక చింతన, ఉపాధి కల్పన, భవిష్యత్తుకు భరోసా వంటి అంశాలను విద్య ద్వారా సాధించడానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండాలని కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అదే సందర్భంలో సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు విద్యా అవకాశాలను కల్పించవలసినది పోయి తన బాధ్యత నుండి తప్పుకుంటూ ప్రైవేటు భుజస్కంధాల మీద పెట్టే వింత ధోరణికి అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని కూడా పునరాలోచన చేయాలి. ప్రాథమిక నుండి ఉన్నత స్థాయి వరకు విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి.

ఇంటర్మీడియట్, కళాశాల విద్య విద్యార్థి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దశ కనుక సహజ పరిస్థితులలో, సామాజిక చింతన కలిగిన ప్రత్యేక నిపుణుల సహకారంతో ప్రభుత్వరంగంలోనే విద్యా బోధన కొనసాగే నూతన వ్యవస్థకు అంకురార్పణ జరగాలి. అప్పుడు మాత్రమే సాత్విక్ లాంటి భావి భారత పౌరులు సమాజానికి దూరం కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని పట్టించుకునే రీతిగా తయారవుతారు. విద్యార్థులు, సమాజం, తల్లిదండ్రులు, అంతకుమించి ప్రభుత్వాలు కూడా ప్రైవేటు విద్యారంగం వేధింపులపై ఉక్కుపాదం మోపడంతో పాటు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని స్వేచ్ఛా రీతిలో విద్యను అందించడానికి పూనుకుంటేనే ఇలాంటి ఆటంకాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News