Monday, January 20, 2025

జిఒ 29 రద్దు చేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/విద్యానగర్: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు తారస్థాయికి చేరాయి. హైదరాబాద్ నగర నడిబొడ్డు అశోక్‌నగర్ చౌరస్తా నుంచి నిరుద్యోగు ల నిరసన సెగలు సచివాలయం వరకు తాకాయి. వందల సంఖ్యలో అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయగా వారికి మద్దతుగా వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌ డ్‌లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రావడంతో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సచివాలయం గేట్లకు తాళాలు వేశారు. గ్రూప్స్ అభ్యర్థులను కలిసేందుకు శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో బండి సంజయ్, అనేక మంది బిజెపి నాయకులతో కలిసి చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆందోళన చేయడానికి అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకోగా, ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ సైతం అక్కడికి భారీ కాన్వాయితో తరలివచ్చారు.

జి.ఓ నెంబరు 29కి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసిన హనుమాన్ అనే అభ్యర్థితో ముందుగా మాట్లాడిన కేంద్ర మంత్రి అక్కడే ఉన్న మరికొందరు అభ్యర్థులతోనూ చర్చించారు. అనంతరం వారితో కలిసి చౌరస్తాలో కూర్చున్న బండి సంజయ్.. తక్షణమే 29 జి. ఓను రద్దు చేసి, పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అభ్యర్థుల నినాదాలు మార్మోగాయి. గంటన్నర పాటు అశోక్ నగర్ రోడ్డు పైనే కూర్చున్న ఆయన సచివాలయానికి వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డిని కలుద్దామంటూ పాదయాత్ర మొదలు పెట్టారు. ఛలో సెక్రటేరియట్ కు వందల సంఖ్యలో గ్రూప్స్ అభ్యర్థులు, బిజెపి నాయకులు వెంటరాగా ఇందిరా పార్కు చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. అక్కడ పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బండి సంజయ్ ముందుకు సాగగా, ఈ సమాచారం అందుకున్న అనేకమంది నిరుద్యోగులు లోయర్ టాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం వద్దకు వచ్చారు. దాదాపు గంట పాటు పాదయాత్ర చేసిన ఆయన లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట మళ్ళీ బైఠాయించారు. జిఓ నెంబరు 29ను రద్దు చేయాలనే ప్లకార్డు ప్రదర్శిస్తూ మాట్లాడారు.

రిజర్వేషన్లను రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కనీసం ఆందోళన చేస్తున్న అభ్యర్థులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి ప్రయత్నించే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. వెంటనే పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, యదావిధిగా జి. ఓ నెంబరు 55 ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు బిజెపి అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. లిబర్టీ చౌరస్తా నుంచి సచివాలయం వెళ్ళడానికి బండి సంజయ్ ముందుకు నడవడంతో అప్పటికే అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్ళడానికి అనుమతి లేదని, శాంతిభద్రతలు కోసం సహకరించాలని పోలీసు అధికారులు కోరినప్పటికీ ససేమిరా అన్న కేంద్ర మంత్రి సచివాలయానికి అభ్యర్థులతో వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తామని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. అయితే, కేంద్ర మంత్రినే అరెస్టు చేస్తారా అంటూ బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగడంతో అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు.

రంగంలోకి బి ఆర్ ఎస్ నేతలు..
ఒకపక్క నిరుద్యోగులు, బిజెపి నాయకుల నిరసనలు కొనసాగుతుండగానే గ్రూప్స్ అభ్యర్థులకు మద్దతుగా బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, అర్.ఎస్.ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ , పార్టీ నాయకులు, అనేక మంది నిరుద్యోగులతో కలిసి లోయర్ టాంక్ బండ్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. పోటాపోటీ ఆందోళనల కారణంగా అంబేద్కర్ విగ్రహం వద్ద తోపులాట ఏర్పడి బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం మొదలైంది. అభ్యర్థుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికే వచ్చారంటూ పలువురు బిజెపి నాయకులు దాసోజు శ్రవణ్‌ను నిలదీయడంతో ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ కోసమే బిజెపి నాటకాలు ఆడుతోందని, అసలు 55 జిఓను తెచ్చింది బిజెపి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందే లిబర్టీ వద్ద బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు వెనువెంటనే అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ గౌడ్, ముఠా గోపాల్, ప్రవీణ్ కుమార్, శ్రవణ్ సహ బిఆర్‌ఎస్ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించారు.

సచివాలయ ముట్టడి…..
లిబర్టీ చౌరస్తా వద్ద ఇరు పార్టీల ఆందోళనలు, పోలీసుల అరెస్టులు కొనసాగుతుండగానే భారీ సంఖ్యలో గ్రూప్స్ అభ్యర్థులు సచివాలయం ముందుకు చేరుకున్నారు. బారికేడ్ల నిర్భందాలను దాటుకుని అభ్యర్థులు సచివాలయం లోపలికి వెళ్ళడానికి పరుగులు పెట్టడంతో అప్రమత్తమైన పోలీసులు సచివాలయం ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. అప్పటికే వందలాదిగా వచ్చిన నిరుద్యోగులు సచివాలయం ముందు మార్గంలో బైటాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినదించారు. ‘సిఎం డౌన్ డౌన్, మాకు న్యాయం కావాలి, జీవో 29 రద్దు చేయాలి’ అని నినదించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అనేక పర్యాయాలు నిరుద్యోగులను కలిసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తమ గోడు పట్టించుకోవడంలేదని వాపోయారు. 29 జీవో రద్దు కోసం కేసు నడుస్తోందని, ఒకవేళ అది రద్దు అయితే మళ్ళీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతిభావంతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తెలిసినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ , రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండి పడ్డారు.

వాహనదారుల నరకయాతన…..
గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఇటు అభ్యర్థులు, బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులను కట్టడి చేసేందుకు వందలాదిగా మోహరించిన పోలీసులు,.ప్రత్యేక బలగాల కారణంగా అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలకు నిలిపివేశారు. ఇటు లిబర్టీ చౌరస్తా వద్ద నిరసనలు తారస్థాయికి చేరడంతో ఐదారు గంటలు పాటు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. అశోక్‌నగర్ అంతర్గత దారులు వాహనాలతో నిండిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News