త్వరలోనే తెలంగాణ సెక్రటేరియట్ భద్రత ఎస్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ ఫైల్ సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరినట్టుగా సమాచారం. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ (టిజిఎస్పీ) ఈ విధులను నిర్వహిస్తోంది. అయితే టిజిఎస్పీ కింద విధులు నిర్వహించే అధికారులు, కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను గుర్తించకపోవడం వారి పట్ల నిర్లక్షంగా వ్యవహారించడం, వారిని సచివాలయంలో లోపలికి రాకుండా అడ్డుకోవడం తదితర కారణాలతో టిజిఎస్పీని తప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.
హోంశాఖ నుంచి లైన్‌క్లియర్
అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వరకు ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఇక్కడ భద్రతా విధులను నిర్వహించేవారు. గతంలో ఎస్పీఎఫ్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం, కొన్ని ఫైల్ మూమెంట్ వారి కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఎస్పీఎఫ్‌ను సచివాలయ భద్రత నుంచి తప్పించి టిజిఎస్పీకి ఆ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం 450 మందితో షిఫ్ట్‌ల వారీగా సచివాలయం భద్రతకు పహారాగా ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్,
సాయుధ రిజర్వ్ పోలీసులు కలిపి మొత్తం సెక్రటేరియట్ భద్రతలో 650 మంది పాలుపంచుకుం టున్నారు. దీంతోపాటు సుమారు 300 పైగా సిసి కెమెరాలతో నిఘా నీడలో సెక్రటేరియట్ భద్రతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎస్పీఎఫ్ బాధ్యతల్లో కీలకంగా ఉన్న ప్రస్తుత హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, తాజా మాజీ డిజిపి రవి గుప్తా ఎస్పీఎఫ్‌కు లైన్ క్లియర్ చేశారని, ఈ నేపథ్యంలోనే సిఎం వద్దకు సెక్యూరిటీ మార్పు ఫైల్ వచ్చిందని, ఇంటెలిజెన్స్ నివేదిక అనంతరం సెక్రటేరియట్ భద్రతకు సంబంధించి సిఎం ఎస్పీఎఫ్ భద్రతపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది.