Friday, January 24, 2025

దేశానికే ఆదర్శం తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం: ఎంఎల్‌ఎ బిగాల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తోందని, అందుకు నిదర్శనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యసేవలు అందించడమేనని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో వినూత , విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పేదల ముంగిట కార్పొరేట్‌వైద్యం అందించడంతో పేద ప్రజలకు వరంగా మారిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌లో ఉచితంగా వ్యాధినిర్ధారన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతుండడంతో నిరుపేదలు వేలాది డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకోలేని వారికి ఎంతో సౌకర్యంగా మారిందన్నారు.

దేశంలోనే అత్యధికంగా తెలంగాణా రాష్ట్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. వైద్య విద్యలో నవ శకం జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తీసుకురావడం వల్ల వందలాది డాక్టర్లు తయారవుతారని అలాగే రోగులకు వైద్యుల కొరత తీరుతుందన్నారు. వైద్య రంగంలో మరో ముందుడుగుగా 2000 పడకల నిమ్స్ ఆసపత్రికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైద్యసిబ్బంది సేవలు మరవలేనివని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే తల్లులకు 12వేలు, ఆరోగ్య లక్ష్మి పథకాలు అందించడంజరుగుతోందన్నారు. వైద్య సిబ్బంది కృషితో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా సాధారణ ఆసుపత్రిలలో 60 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందన్నారు.

అమ్మ ఒడి పథకం ద్వారా స్త్రీలను, శిశువులను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం రవాణా సౌకర్యార్థం ప్రభుత్వం సౌకర్యం కల్పించిందన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య సిబ్బంది కరోనా కష్టకాలంలో అందించిన సేవలను గుర్తించి సిఎం కెసిఆర్ వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ వైద్య రంగం దేశానికే దిక్పూచిగా మారిన శుభసందర్భంగా వైద్య ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రతిమారాజ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా.ఇందిర, డిఎంహెచ్‌ఓ డా.సుదర్శనం , కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News