50శాతం తగ్గనున్న యూరియా వినియోగం
తక్కువ ధరతో ఎక్కువ ఫలితాలు
రైతులకు అందుబాటులో ఉంచండి
మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : నానో యూరియాకు తెలంగాణ రాష్ట్రం పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇఫ్‌కో కంపెనీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పంటల సాగులో నానో యూరియాను విరివిగా వినియోగించాలన్నారు. ఒక బస్తా యూరియా మీద రూ.800నుంచి రూ.1000వరకూ ప్రభుత్వాలకు సబ్సిడీ భారం తగ్గిస్తుందన్నారు. కేవలం రూ.240కి లభించే 500ఎంఎల్ లిక్విడ్ బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ ఇఫ్కో ఈ ఘనతను సాధించటం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రపంచంలో మొదటి సారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పెటేంట్ కలిగి ఉండటం సంతోషకరం అని తెలిపారు. ప్రస్తుతం యూరియా వినియోగం వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయని, నానో యూరియా వాడకం వల్ల ఈ కలుషితాలను నివారించి, పర్యావరణాన్ని కాపాడుతుండటం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.
కార్పోరేట్ సంస్థలనుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థనుండి పరిశోధన ద్వారా నానో యూరియా ఉత్పత్తి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఇఫ్కో విడుదల చేసిన నానో యూరియా ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ భారాన్ని, రవాణ, నిల్వ ఖర్చులను కూడా తగ్గిస్తుందన్నారు. నానోయూరియాను పెద్ద ఎత్తున ప్రచారం చేసి మార్కెట్లోకి తీసుకుపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని వెల్లడించారు. ఏ పంటకైనా పూత కంటే ముందు, విత్తిన 20రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా రెండు సార్లు నానో యూరియాను పిచికారి చేసుకొవచ్చని తెలిపారు. మామూలు యూరియాకు 30శాతం సమర్ధత ఉంటే ,నానో యూరియాకు 80శాతం ఉంటుందన్నారు. నానో యూరియా వాడకం వల్ల పంటల్లో 8శాతం దిగుబడి పెరుగుతుందని ఐకార్ పరిశోధనల్లో వెల్లడయిందన్నారు.
పంట ఉత్పత్తులతోపాటు నాణ్యత కూడా అధికంగా ఉంటుందని తేలిందన్నారు. ప్రస్తుతం వాడుతున్న యూరియా కంటే తక్కువ మోతాదు ,తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలను నానో యూరియా ఇస్తుందన్నారు. ఇది పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వాడుతున్న యూరియా వినియోగం 50శాతం తగ్గుతుందన్నారు. ఎరువుల నియంత్రణ చట్టం కింద ఆమోదం పొందిన నానో యూరియా క్షేత్ర స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుజరాత్ రాష్ట్రం కలోల్ నుండి తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్‌ను ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ సందర్బంగా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావుతోపాటు ఇఫ్కో సంస్థ వైస్ ఛైర్మన్ దిలీప్ సంఘానీ, ఎండి డా. అవస్తీ, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేద్ర కుమార్ , సిజిఎం డా.జగన్మోహన్ రెడ్డి , మారుతి కుమార తదితరులు పాల్గొన్నారు.