రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండో దశ సమగ్ర కులగణనకు మంత్రిమండలి ఆమోదించనున్నట్టుగా సమాచారం. బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమి షన్ సిఫార్సుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
బిసి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, బడ్జెట్ సమావేశాల్లో ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలా అన్న విషయంపై ఈ కేబినెట్‌లో స్పష్టత రానుంది. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానితో సమావేశం, ఎపితో ఉన్న నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అదే విధంగా ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకు రానున్నట్టు గా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా పథకాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం.