ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి) సొంత భవనం నిర్మాణం నిమిత్తం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లక్డీకాపూల్‌లోని అమరావతి థియేటర్ పక్కన ఉన్న స్థలంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఆధునిక సాంకేతికతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీని నిర్మాణంలో సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ ఎపిసెన్సీ, పర్యావరణ రహిత భవనం వంటి ప్రత్యేకతలున్నాయన్నారు. అక్టోబర్ 2022 వరకు ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. విద్యుత్ నియంత్రణ భవనం జీరో పొల్యూషన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీని నిర్మాణం చేపడుతున్నామన్నారు. సిఎం కెసిఆర్ సహకారంతో ఈ భవనం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎండి ప్రభాకర్‌రావు, టిఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి, స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ, డిజిపి మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.