Monday, December 23, 2024

ఆరోగ్య తెలంగాణలో సువర్ణాధ్యాయం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వైద్య, విద్యారంగంలో మంగళవారం ప్రగతి భవన్‌లో చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ ఎనిమిది మెడికల్ కాలేజీల్లోని ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు నాంది పలికారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వైద్య విద్యార్థులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును, ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఒకనాడు అనేక సమస్యలతో త్రాగునీటికి, సాగునీటికి, కరెంటుకు, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డామన్నారు.

కానీ ఈ రోజున స్వరాష్ట్రాన్ని సాధించుకొని, అద్భుతంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతూ దేశానికి మార్గదర్శనం చేస్తూ అనేక వినూత్నకార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యపేటలో నాలు గు మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామన్నారు. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని కలలో కూడా ఎవరూ ఊహించలేదన్నారు.

కానీ స్వరాష్ట్ర ఏర్పాటు, ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చేపట్టడం మన కలలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖామాత్యులు హరీష్ రావు కృషితోనే ఈ ఎనిమిది కళాశాలల నిర్మాణం రూపుదాల్చిందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. వారికి సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నామన్నారు.

మరో 17 జిల్లాలో మెడికల్ కాలేజీలు

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 17కు పెరిగిందని కెసిఆర్ వివరించారు. మరో 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటి నిర్మాణానికి మత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడి మన్నిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా తానే చేస్తానని అన్నారు. గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవన్నారు. కానీ ఈ రోజు వాటి సంఖ్య 2,790 కి పెరిగిందన్నారు.

ఈ సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగి మన పిల్లలందరికీ సీట్లు లభించడం తనకు చాలా సంతోషం కలిగిస్తున్నదన్నారు. అదే విధంగా పిజి సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నామని కెసిఆర్ తెలిపారు. గతంలో 531 పిజి సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పిజి సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ఈ రోజు 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రత్నాల్లాంటి, వజ్రల్లాంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన, బిసి, మైనార్టీ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమన్నారు.

జనాభా నిష్పత్తికి అనుగుంగా డాక్టర్లు

జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది ఉండడం అంతే అవసరమని కెసిఆర్ అన్నారు. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని కెసిఆర్ వివరించారు. అన్ని ప్రాంతాల్లో సమతూకంగా ఉండేట్లు వీటి ఏర్పాటు జరుగుతున్నదన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నా, వీటి సమగ్రాభివృద్ధి జరగాలనీ రెండు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశామన్నారు.కరోనా వంటి పాండమిక్ భయోత్పాతాన్ని కూడా చూశామన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు.

రక్షణ కవచంగా వైద్య రంగం

ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కెసిఆర్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తున్నదే దేశం అనుసరిస్తుందన్నారు. వైద్యరంగం లో కూడా తెలంగాణ ఎదగడం తనకు చాలా సంతోషం గా ఉందన్నారు. పేదల ప్రజల సంక్షేమమే ద్యేయంగా వైద్యరంగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ముందుకు సాగాలని అభిలాషించారు. పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. అందువల్ల ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించుకునేలా వైద్యారోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఆర్ అండ్ బి శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎంఎల్‌సి ఎస్.మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎంఎల్‌సి తాతా మధూధన్ రావు, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విసి కరుణాకర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వైద్యశాఖ అధికారులు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News