Saturday, January 11, 2025

తెలంగాణ తీన్‌తెర్లు కాకుండా చూడాలె!

- Advertisement -
- Advertisement -

‘జెడ్’ తరం (2000 తర్వాత పుట్టినవారు) తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో పాల్గొన లేదు. వీరికి ఉద్యమ ఆకాంక్షలు, వాటి సాధనకు సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలు, నాయకుల కార్యదక్షత, కవులు, రచయితలు, బుద్ధిజీవుల భావజాల వ్యాప్తి, యువకులు, విద్యార్థుల త్యాగాలు, సకల జనులు చేసిన సమ్మె, ప్రజల మిలియన్ మార్చ్‌ల గురించి పెద్దగా తెలియదు.ఈ ప్రాంత చరిత్ర కూడా అంతగా తెలియకపోవచ్చు. ఇవన్నీ తెలిసినా కొంతమంది రాజకీయ నాయకులు, బుద్ధి జీవులు స్వప్రయోజనాల కోసం వాటిని విస్మరిస్తున్నారు. ఇప్పుడు త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నడిచొచ్చిన తొవ్వ ను గమనంలో ఉంచుకొని, అంబేడ్కర్ కలలుగన్న ప్రతి మనిషికి ఒకే విలువ ఉండే గమ్యం వైపు వడిగా దౌడు తీయాల్సిన అవసరమున్నది.

గాయి గత్తరలేపి తెలంగాణను ఆగం జేసే వ్యక్తులు, శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలె. తెలంగాణ తీన్‌తెర్లు కాకుండా కాపాడుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
తెలుగు కవి, గంగా జమున తెహజీబ్‌ని గానం చేస్తూ అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్న గులాం యాసిన్‌ని 1983 జనవరిలో మతకలహాలు బలిగొన్నాయి. యాసిన్ కల్వకుర్తిలో పుట్టినా హైదరాబాద్‌లో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డాడు. తెలంగాణ మట్టి మనిషి. కల్బుర్గి, ధబోల్కర్, గౌరీ లంకేష్‌ల కన్నా ముందు ‘మత సామరస్యం’ గురించి మాట్లాడినందుకు, రాసినందుకు ప్రాణాలు కోల్పోయిండు. ఇట్లా హైదరాబాద్ నగరంలో గొడవలు, ఘర్షణలు ప్రతి యేటా అమాయకుల బతుకులను బుగ్గిజేసేవి. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రాంతేతర నాయకులు పన్నాగం పన్ని హత్యలు చేయించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వారికి ప్రజల పాణాలంటే లెక్కలేదు. కర్ఫ్యూలు, బంద్‌లు, దుకాణాల లూటీ హైదరాబాద్‌కు ఆంధ్రా పాలకులు ఇచ్చిన శాపం. ఏ పండుగొచ్చినా పోలీసోళ్ల ప్రాణం మీదికి వచ్చేది. ఓల్డ్ సిటీలోని చాలా మంది ఇటు టోలిచౌకి మొదలు అటు నాగోల్ వరకు మకాం మార్చుకున్నారు.

సొంతిల్లున్నా బ్యాంక్ అప్పు పుట్టని వాటిని ఖాళీ చేసి అగ్వకు, సగ్వకు అమ్ముకున్నరు. ఇవి ఉమ్మడి రాష్ర్టంలో గంగాజమునా తెహజీబ్‌ని కాపాడిన ప్రజల కన్నీటి గాథలు. కండ్ల చూసిన కత్తుల కోలాటం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ని సైతం వదలని హంతక దాడులు, మతోన్మాదంతో కుత్తుకలుత్తరించుకున్న గతం. ఈ తొమ్మిదేండ్లలో ఇట్లాంటి సంఘటనలు హైదరాబాద్‌లో దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. రంజాన్ వినాయక చవితి ఒక్కసారి వచ్చినా, మొహర్రం బతుకమ్మ, బోనాలు బక్రీద్ ఏకకాలంలో జరిగినా ఎక్కడా శాంతి భద్రతలు అదుపుతప్పలేదు.
కొంత మంది ‘డోవ్‌ు’లు ఉన్నటువంటి కొత్త అంబేడ్కర్ సెక్రెటేరియట్‌ని కూల్చేస్తామని బీరాలు పలుకుతున్నారు. పోటీ పరీక్షలు ‘ఉర్దూ’ మాధ్యమంలో ఉండొద్దని అది ముస్లింలను అప్పీజ్ చేయడమే అంటూ తప్పుడు మాలు మాట్లాడుతున్నారు. మూర్తీభవించిన ఈ అజ్ఞానాన్ని రైట్ వింగ్ మీడియా, పెయిడ్ యూట్యూబర్స్, యూట్యూబ్ ఛానల్స్ పని గట్టుకొని ప్రచారంలో పెడుతున్నాయి.గతంలో కన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ పుకార్లను ప్రచారం చేస్తున్నది. కొట్లాటలు పెట్టించాలని వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు 24 ఇంటూ సెవెన్ పని చేస్తున్నా మత ఘర్షణలు హైదరాబాద్‌లో మచ్చుకు కూడా లేవు. ‘సెప్టెంబర్17’ని తెలంగాణ విమోచన దినంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రజల్లో చీలికలు తీసుకురావడానికి పన్నిన ఎత్తుగడ.

అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించడంతో బిజెపికి రాజకీయంగా లబ్ధి చేకూరలేదు. అందుకే ఇప్పటికీ రజాకార్ల పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలందరూ రజాకార్లే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నది. ఈ థియరీని ప్రచారం చేసేందుకు ‘రజాకార్ ఫైల్స్’ సినిమా తీసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం అస్మదీయులకు కట్టబెట్టిండ్రు. దీనికి తోడు జాతీయ స్థాయి నాయకులు ‘భాగ్యలక్ష్మి’ అమ్మవారి దర్శనంతో మత ఉద్రిక్తతలు పెంచి, ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా తెలంగాణ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నది. మొన్నటి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పాచికలేవి పారవని తేలడంతో హిందూముస్లిం ఓట్లలో రాష్ర్ట వ్యాప్తంగా చీలికలు తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకునేందుకు బిజెపి పావులు కదుపుతున్నది.అందుకే మజ్లిస్ పార్టీని రెచ్చగొట్టి దమ్ముంటే రాష్ర్టంలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఇట్లా పోటీ చేసినట్లయితే కొంత మేరకైనా ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి ఆ మేరకు బెనిఫిట్ పొందాలన్నది ఆ పార్టీ యోచన.

ఎక్కడ పోటీ చేయాలో, చేయకూడదో నిర్ణయించుకోవాల్సింది ఆ యా పార్టీలే తప్ప బయటివారు కాదు. అయినా మజ్లిస్ పార్టీ యుపిలో పోటీ చేసి బిజెపికి గెలుపులో సహాయ పడిందనే వాదన ఉండనే ఉన్నది.నిజానికి దేశ వ్యాప్తంగా ‘గోరక్షణ’ పేరిట అమాయకుల ప్రాణాలతో హిందూత్వ వాదులు చెలగాటం ఆడుతున్నారు. కొవిడ్ విస్తరణకు ముస్లింలే కారణమన్నారు. ‘హిజాబ్’, ‘హలాల్’ అంటూ ప్రజల ఆహార్యం, ఆహారంపై దాడి చేస్తున్నారు. అయినప్పటికీ హైదరాబాద్ గతంతో పోలీస్తే ప్రశాంతంగా ఉన్నది. ఈతొమ్మిదేండ్లలో గంగాజమునా తెహజీబ్‌ని కాపాడుకున్నది. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకునే వారి ఆగడాలకు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించడంవల్లనే ఇది సాధ్యమయింది. సిసిటివిల వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నది. ఎలక్ట్రానిక్ నిఘా, కమాండ్ కంట్రోల్‌తో రక్షణ చర్యలు చేపట్టారు. దీని వల్ల ఐటి రంగానికి మక్కాగా ఉన్నటువంటి బెంగళూరుని కాదని హైదరాబాద్‌లో పెట్టుబడులు పెరిగినాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ హిజాబ్, హలాల్ గొడవలుండడం, ఇక్కడ మత ఘర్షణలు లేకపోవడమనేది గుర్తుంచుకోవాలి.

202021 సంవత్సరానికి గాను ఇండియాలో ఐటి సెక్టార్‌లో 4,50,000ల ఉద్యోగాలు కొత్తగా భర్తీ అయ్యాయని ‘నాస్‌కావ్‌ు’ పేర్కొన్నది. ఇందులో 146,000 మంది బెంగళూరులో ఉద్యోగాల్లో చేరగా దానికన్నా నాలుగు వేల మంది అధికంగా అంటే 1,50,000ల మందికి హైదరాబాద్ ఐటి రంగంలో ఉద్యోగాలు లభించినాయని ఆ నివేదిక పేర్కొన్నది. అట్లాగే కార్యాలయాల స్పేస్ వినియోగంలోనూ హైదరాబాద్ నగరం బెంగళూరుని బీట్ చేసింది. 26% వృద్ధితో రూ. 1,83,569 కోట్ల ఐటి ఎగుమతులు జరిగినాయి. ఇదంతా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నందు వల్లనే జరిగినాయని చెప్పవచ్చు. ఇదంతా కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఐటిఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు నిరాకరించినప్పటికీ సాధించిన ప్రగతి. ఇంకా చెప్పాలంటే గతంలో ప్రకటించిన ప్రాజెక్టును కూడా బిజెపి ఉపసంహరించుకున్నది. ఇంత పక్షపాత వైఖరితో కేంద్రం వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సమర్ధత మూలంగానే ఇదంతా సాధ్యమయింది. ఇటీవల రెండు వారాల పాటు అమెరికా, ఇంగ్లాండ్‌లలో పర్యటించిన రాష్ర్ట ఐటి శాఖామంత్రి కెటి రామారావు 80కి పైగా బిజినెస్‌లు మీటింగ్‌ల్లో పాల్గొన్నారు.

ఇంకా అనేక సదస్సులు, రౌండ్ టేండ్ మీటింగ్‌ల్లో హైదరాబాద్‌లో పెట్టుబడులపై చర్చలు జరిపారు. తద్వారా కొత్తగా 42 వేల మందికి పది రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణలో, హైదరాబాద్‌లో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి కాబట్టే ప్రపంచంలోని ప్రతిఒక్క సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటయితున్నది. ఇప్పుడు మన పోటీ బెంగళూరుతో కాదు బీజింగ్ లాంటి ప్రపంచ నగరాలతో అని గుర్తుంచుకోవాలి.
ఈ ప్రగతి ఒక్క శాస్త్ర, సాంకేతిక రంగాలకే కాదు, దాదాపు అన్ని రంగాలకు విస్తరించింది.201213 ప్రాంతంలో హైదరాబాద్‌లో నాలుగు రోజులకోసారి నల్లా నీళ్ళు వచ్చేవి. తాగు నీటి కోసం ప్లాస్టిక్ బిందెల ప్రదర్శన నిత్యం ఏదో ఒక పార్టీ నేతృత్వంలో జరిగేది. అట్లాంటిది ఇప్పుడు 99.14 శాతం తెలంగాణ ప్రజలకు ‘మిషన్ భగీరథ’ కింద స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. మిషన్ కాకతీయ కింద 27,625 చెరువులను పునరుద్ధరించారు. దీని ద్వారా ఎందరికో ఆదరవు దొరికింది. అట్లాగే అమరుడు పోలీసు కిష్టయ్య బిడ్డ ప్రభుత్వ తోడ్పాటుతో డాక్టరయింది. నిఖత్ జరీన్ మెడల్స్ సాధించింది. ఇట్లా వ్యక్తిగతంగా ప్రతిభ కనబర్చిన తెలంగాణ వాళ్లు చాలా మందే ఉన్నరు.

తెలంగాణొస్తే ఏమొస్తది? ఏమొచ్చింది? అని మాట్లాడిన, మాట్లా డే వారికి కండ్లముందట కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు కోతలు లేని విద్యుత్తు సాక్ష్యంగా కనబడుతున్నది. 35 లక్షల బోరుబావులకు ఉచిత విద్యుత్తు అందుతున్నది. తద్వారా 40 45 లక్షల ఎకరాల్లో సాగు సుస్థిరత ఏర్పడింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కల దాదాపు నిజమయింది. వీటితో పాటు గ్రామాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం, దాదాపు ప్రతి జిల్లాకో వైద్య కళాశాల (కొన్ని మినహా), రైతు సంక్షేమం, సంక్షేమ పథకాలు, స్వచ్ఛ సర్వేక్షణ్, కొత్త కలెక్టరేటులు, సెక్రెటేరియట్, అమరవీరుల ప్రాంగణం అన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతికి తార్కాణాలు. అయితే ఇవి చూడ నిరాకరించిన బుద్ధిజీవులు ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఒకవైపు రహస్యంగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ, బహిరంగంగా మాత్రం తాము పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబర్లు సభ్యసమాజం తలదించుకునే భాషను మాట్లాడుతూ దానినే మీడియా స్వేచ్ఛ అంటూ హూంకరిస్తున్నారు. అధికార పార్టీని, నాయకులను తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు అహర్నిశలు ‘కృషి’ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడుతూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నరు.

అయితే నిష్పక్షపాతంగా, నీరక్షీర వివేకంతో, ప్రభుత్వం తప్పుదారిన పోతున్న సమయంలో సరైన బాట చూపించే బుద్ధిజీవుల అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉన్నది. నిజానికి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇంకా రావాల్సిన మేలైన మార్పులు చాలానే ఉన్నాయి. వాటిని గుర్తించి చెప్పాల్సిన బాధ్యత కూడా విద్యావంతులదే! ఈ పని అంతగా జరగడం లేదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న దశలో అక్కడ ఏమి జరుగుతున్నది? అని తెలుసుకోవడానికి కొంతమంది కవులు, రచయితలు, బుద్ధిజీవులు ప్రాజెక్టు సైట్స్‌కు వెళ్ళిండ్రు. అట్లా వెళ్ళడాన్ని ప్రభుత్వంతో పైరవీలు చేసే బుద్ధిజీవులు తప్పు పట్టిండ్రు. ఇంకొంతమంది వారికి బురద పూసే ప్రయత్నం చేసిండ్రు. ఇందులో కొంతమంది ఇప్పుడు షర్మిలకు సైతం మద్దతిస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పక్షపాతంతో వ్యవహరించే వారు ఉంటారు. దాన్ని అధిగమించి మంచిచెడూ రెండింటినీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వెలితేనే రాష్ర్టం ప్రగతి పథంలో నడుస్తుంది.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News