మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చే స్తోందని, చేసిన అప్పులకు ఏటా వడ్డీలు కట్టడానికే వచ్చే ఆదాయం సరిపోతోందని విపక్షాలు చేస్తున్న ప్రచారం పసలేనిదని తేలిపోయింది. ప్రభుత్వంపై చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులు చేసి ప్రజలపై ప్రభుత్వం మో యలేని భారం మోపుతోందని, తద్వారా రా ష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని వివిధ పార్టీ ల నేతలు, కెసిఆర్ అంటే గిట్టని వారు సోష ల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై బిఆర్‌ఎస్ వర్గాలు దీటుగా స్పందించాయి. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని వక్రీకరించి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలు ఆక్షేపించాయి. కేంద్రం తెచ్చిన అప్పులకు వడ్డీల కింద చెల్లిస్తున్నంది ఎంత.. తెలంగాణ వడ్డీల రూపంలో కడుతున్నదెంత..? తెలంగాణతో పోల్చితే మిగతా రాష్ట్రాలు ఎంత శాతం మేరకు వడ్డీగా చెల్లిస్తున్నాయన్నది గణాంకాలతో సహా బయటపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు తిరిగి వడ్డీల రూపంలో చెల్లించేందుకు రికార్డుస్థాయిలో 9.4 లక్షల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తోందని తేటతెల్లమవుతోంది. అంటే కేంద్రం ఖర్చు చేసే నిధుల్లో ఈ వడ్డీల చెల్లింపులే ఏకంగా 23.8 శాతం అన్నమాట. అదే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం (2023వ ఏడాదికి) కేవలం 15,220 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీలుగా చెల్లించబోతోందని రుజువయ్యింది. అంటే మొత్తం వ్యయంలో తెలంగాణ రాష్ట్రం వడ్డీలకు చెల్లించేది కేవలం 8 శాతం నిధులను మాత్రమే. అదే బిజెపి పాలిత డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో 10 శాతం నుంచి గరిష్టంగా 12 శాతం వరకూ వడ్డీలకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఈ వాస్తవాలను పక్కనబెట్టి కేంద్రంలోని కొందరు పెద్దలు, రాష్ట్రంలోని ఆ పార్టీల నేతలు కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి.
ఏ రాష్టం వడ్డీలకు ఎంత ఖర్చు చేస్తోందంటే..?
ఏ రాష్ట్రమైనా చేసిన అప్పులకు వడ్డీలను చెల్లించే నిధుల పరిమితి ఆయా రాష్ట్రాలు చేసే మొత్తం వ్యయంలో పది శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ బిజెపి పాలిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం 2023వ సంవత్సరంలో 27,055 కోట్ల రూపాయలను (సుమారు 11 శాతం) వడ్డీలుగా చెల్లిస్తోంది. గుజరాత్ మొత్తం వ్యయంలో 16.943 కోట్ల రూపాయలను (12 శాతం నిధులు) కేవలం వడ్డీలకే చెల్లిస్తోంది. ఇక త్వరలో ఎన్నికలు జరగబోయే కర్నాటక రాష్ట్రం బడ్జెట్‌లోని మొత్తం వ్యయంలో ఏటా 18,446 కోట్ల రూపాయలను (11 శాతం నిధులు) వడ్డీలుగా చెల్లిస్తోంది. తమిళనాడు రాష్ట్రం 28,618 కోట్ల రూపాయలను (14 శాతం) వడ్డీలుగా చెల్లిస్తోంది. మహారాష్ట్ర 26,551 కోట్లు, పశ్చిమ బెంగాల్ 25,325 కోట్ల రూపాయలు (16శాతం) , రాజస్థాన్ 18,446 కోట్ల రూపాయలు (11 శాతం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17,508 కోట్ల రూపాయలు (11 శాతం), మధ్య ప్రదేశ్ రాష్ట్రం 11,779 కోట్ల రూపాయలు (8 శాతం), తెలంగాణ రాష్ట్రం 15,220 కోట్ల రూపాయలు (8 శాతం) నిధులను వడ్డీలకు చెల్లిస్తున్నాయి.
అంటే చేసిన అప్పులకు వడ్డీల రూపంలో వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్న మొదటి టాప్ టెన్ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం పదో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్), రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ల నివేదికల్లో పొందుపరిచిన వివరాలేనని బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి కొందరు బిజెపి నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత డబుల్ ఇంజన్ రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వడ్డీల రూపంలోనే వేల కోట్ల రూపాయలను చెల్లిస్తూ కూడా తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయడం, ఎలాంటి కొరత లేకుండా నిరంతరం మంచినీటిని సరఫరా చేస్తుండటం, అనేక రాయితీలతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుండటం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు, కులవృత్తులను ప్రోత్సహిస్తూ, అదనంగా రైతుబంధు, దళితబంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతోనే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరం నుంచి మారుమూలనున్న గిరిజన గ్రామాల వరకూ ఎకనమిక్ యాక్టివిటీని విస్తరించడంతోనే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోందని వివరించారు. కానీ డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లోగానీ, కేంద్ర ప్రభుత్వంలోగానీ ఇలాంటి సమగ్ర ప్రణాళికలు లేకపోవడంతోనే అభివృద్ధి అనేదే లేకుండా పోయిందని అంటున్నారు. కేంద్రప్రభుత్వానికిగానీ, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి-సంక్షేమం అంటేనే పన్నులు పెంచడం, అవసరం ఉన్నా..లేకపోయినా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడమేననే ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని, లేకుంటే భారీ మూల్యాన్నే చెల్లించుకోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న కేంద్రం వడ్డీలు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాలతో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోగా, ఆ అప్పులకు వడ్డీల రూపంలో ఏడాదికి లక్షల కోట్ల రూపాయలను చెల్లించేందుకు భారత ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు తిరిగి వడ్డీలను చెల్లించేందుకు రికార్డుస్థాయిలో 9.4 లక్షల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తోంది. కేంద్రం ఖర్చు చేసే నిధుల్లో ఈ వడ్డీల చెల్లింపులే ఏకంగా 23.8 శాతం వరకూ ఉన్నాయని, అదే తెలంగాణ రాష్ట్రం చేసే మొత్తం వ్యయంలో (2023వ ఏడాదికి) కేవలం 15,220 కోట్ల రూపాయలు మాత్రమేనని, అంటే మొత్తం వ్యయంలో తెలంగాణ రాష్ట్రం వడ్డీలకు చెల్లించేది కేవలం 8 శాతం నిధులను మాత్రమేనని ఆర్ధికశాఖలోని కొందరు అధికారులు వివరించారు. అదే బిజెపి పాలిత డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో 10 శాతం నుంచి గరిష్టంగా 12 శాతం వరకూ వడ్డీలకు నిధులను ఖర్చు చేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. ఈ వాస్తవాలను పక్కనబెట్టి కేంద్రంలోని కొందరు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శిస్తున్నారని ఆ అధికారులు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం వడ్డీలకు చెల్లిస్తున్న 9.4 లక్షల కోట్ల రూపాయల నిధులు దక్షిణాది రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌లకు కేంద్ర వడ్డీల నిధులు సరిపోతాయని ఆర్ధిక నిపుణులు, ఆర్ధిక మంత్రిత్వశాఖల్లోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 153 లక్షల కోట్ల రూపాయలుండగా ఆ నిధులకు వడ్డీలు చెల్లించేందుకు ఏడాదికి 9.4 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. దొరికిన చోట దొరికినట్లుగా, అవసరం ఉన్నా.. లేక పోయినా లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేయడంతోనే ఇలాంటి దయనీయ పరిస్థితులు దాపురించాయని నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం చేసే మొత్తం వ్యయంలో ఏకంగా 23.8 శాతం నిధులను వడ్డీలకు చెల్లించడానికే కేటాయించాల్సి వచ్చిందని వివరించారు. అంతేగాక అప్పులిస్తామంటే చాలు ఎలాంటి షరతులకైనా కేంద్రం తలాడిస్తూనే ఉందని, అధిక శాతం వడ్డీలు చెల్లించేందుకు అంగీకరించడంతోనే రికార్డుస్థాయిలో 9.4 లక్షల కోట్ల రూపాయలను కేవలం వడ్డీలకే నిధులను ఖర్చు చేయాల్సి వస్తోందని, కానీ అసలు చెల్లింపులు చేయాల్సి వస్తే దేశాన్ని అమ్మకానికి పెడతారేమోననే అనుమానాలను నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటి వరకూ చేసిన అప్పులు చాలవన్నట్లుగా 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో మార్కెట్ బారోయింగ్స్ 15.4 లక్షల కోట్ల రూపాయలు, సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి మరో 11.8 లక్షల కోట్ల రూపాయలను రుణాల రూపంలో నిధులను సేకరించుకోనున్నట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంటే రానున్న ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మన దేశ అప్పులు 169,46,667 కోట్ల రూపాయలకు పెరుగుతాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అంచనా వేసిందని, ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం వడ్డీల రూపంలో వచ్చే ఏడాది చెల్లింపులు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుండవచ్చునని అంచనా వేస్తున్నారు.