అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక జెట్ స్కీని వెంకటరమణ అద్దెకు తీసుకున్నాడు. అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్లో దాన్ని వాడాడు. అయితే అదే సమయంలో మరో జెట్ స్కీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రెండో జెట్ స్కీని నడుపుతున్నది 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. వెంకటరమణది తెలంగాణలోని కాజీపేట.
ఎపిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మరో రెండు నెలలు ఉంటే అతని చదువు పూర్తయ్యేది. వెంకటరమణ భౌతికకాయాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కారణాలో అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎనిమిదికి చేరింది.