Wednesday, January 22, 2025

తెలంగాణ సుభిక్షం.. రాష్ట్రమంతా సస్యశ్యామలం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముందస్తు ప్రణాళికలతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నారని.. తద్వారా రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారుతూ ధాన్యాగారం అవతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లాలోని కురవి మండల కేంద్రంలో బొడ్రాయి పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపి, బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవితతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారివురువురూ తొలుత బొడ్రాయి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువు వద్ద నూతనంగా నిర్మించిన గంగమ్మ తలీ ఆలయాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగ జరుపుకుంటున్నామన్నారు. పెద్ద చెరువులో మంత్రి పూలు, పసుపు, కుంకుమలు చల్లి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులను చల్లంగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..చెరువుల పండుగ, ఆలయ ప్రారంభోత్సవాలు దీంతో పాటు కురవిలో బొడ్రాయి పునఃప్రతిష్టాపన, గంగ మ్మ ఆలయ ప్రారంభోత్సవాల్లో భాగస్వామురాలిని అవ్వడం సంతోషంగా ఉందన్నారు. మిని రిజర్వాజయర్‌గా కురవి పెద్దచెరువు నిర్మాణానికి మంత్రిగా కృషి చేస్తానని మంత్రి ప్రకటించారు.

ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో చెరువులకు మహర్ధశ వచ్చిందన్నారు. ఆయన దూరదృష్టితోనే మండువేసవి అయిన రోహిణీ కార్తెలో కూడా చెరువులు మత్తళ్లు పోయడం ప్రశంసనీయమన్నారు. కురవిలో రైతులు, గ్రామస్తులు సంతోషంగా కన్నుల పండుగాలా బొడ్రాయి పునః ప్రతిష్ట జరుపుకుంటున్నారని వివరించారు. బొడ్రాయి ప్రతిష్ట అనేది మహాలక్ష్మి అంశగా అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనంగా పేర్కోన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అని ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణంపైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగను ఇంత వైభవంగా నిర్వహిస్తున్నారని వివరించారు.

ప్రతీ ఒక్కరూ తమ మతాచారాలకు అనుగుణంగా దైవ చింతన కలిగి ఉండలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అందులో భాగంగానే ఆడపడుచులకు సైతం ఇంటింటా ఆహ్వానించి ఊరంతా ఐకమత్యంగా ఉండి ఊరి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని బొడ్రాయి తల్లీని ప్రతిష్టించుకుని ప్రార్థించడం తెలంగాణ సంస్కృతిలో భాగమే అని పేర్కోన్నారు. గ్రామ అభివృద్ధికోసం ఐకమత్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఇలాంటి పండుగలకు, సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని మంత్రి పేర్కోన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి గ్రామభ్యుదయం కోసం తమ సంప్రదాయాలను కొనసాగించాలనే తపన ఇంత వైభవంగా బొడ్రాయిని పునః ప్రతిష్టించుకోవడం అభినందనీయమన్నారు.

ఆ బొడ్రాయి తల్లి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా సుఖసంతోషాలతో ఉండేవిధంగా చూడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నూతక్కి పద్మ నర్సింహరావు, బీఆర్‌ఎస్ నాయకులు గుగులోతు శ్రీరామ్ నాయక్, ముత్యం వెంకన్నగౌడ్, బాదె నాగయ్య, డాక్టర్ సుందర్‌నాయక్, మాజీ ఆలయ చైర్మెన్లు రాజునాయక్, సోమిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కురవిలో బొడ్రాయి పునఃప్రతిష్టాపన వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొడ్రాయి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదాలు చేసి జ్ఞాపికలు అందించారు. ఆయన వెంట కురవి మండలానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News