Sunday, January 19, 2025

ఐటిలో మేటి

- Advertisement -
- Advertisement -

ఎగుమతుల్లో దేశ సగటును మించిపోయిన తెలంగాణ

రూ.183,569

కోట్లకు పెరిగిన ఎగుమతులు

26.14% వృద్ధి, జాతీయ సగటు 17.2%
కంటే 9% ఎక్కువ 8 అసాధారణ
వృద్ధి దేశంలోనే అగ్రస్థానం : 2021-22
ఐటి నివేదికను విడుదల చేస్తూ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ఎగుమతుల్లో దేశ సగటును మించి తెలంగాణ రాష్ట్ర అద్భుతమైన విజయాలను సాధిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో గత రికార్డులను బద్దలు కొడుతూ రాష్ట్ర ఐటి ఎగుమతులు 1,83,569 కోట్లకి పెరిగాయన్నారు. దీంతో ఐటి, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు అయిందన్నారు. ఇందులో జా తీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. బుధవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-2022 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఐటి శాఖ వార్షిక నివేదికను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటి ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే తెలంగాణ సాధించిన వృద్ధి రేటును ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా సాధించలేదన్నారు. ఇది సిఎం కెసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శమన్నారు. రాష్ట్రం వచ్చిన ఏడాది (2013…2014)లో ఐటి ఎగుమతులు 66,276 కోట్ల మేరకు ఉండగా…ప్రస్తుతం 1,83,569 కోట్లకు చేరిందన్నారు.

ఈ ప్రగతి ఒక్క రోజుల్లో వచ్చింది కాదన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ పదవి బాధ్యతలు చేపట్టిననాటి నుంచే కీలకమైన రంగాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారన్నారు. ఫలితంగా దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే కేవలం హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటి ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉండగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రబలంగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ నుంచి ఐటి ఎగుమతులు బాగా పెరగడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఒక రకంగా చెప్పాలంటే భారత జిడిపి గ్రోత్ (వృద్ధి రేటు) పడిపోతుంటే తెలంగాణ గ్రోత్ పెరుగుతుందన్నారు. ఈ ఫలితాలతోనే ఐటి రంగంలో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం వంటి ప్రధానమైన నగరాల్లో కూడా ఐటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 2035 కల్లా ఐటిఐఆర్ మద్దతు లేకుండానే రాష్ట్రంలో 13 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ధీమాను మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు.

ఈ నెల 20 టిహబ్ సెకండ్ ఫేజ్ ప్రారంభం

హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల20వ తేదీన టిహబ్… సెకండ్ ఫేజ్‌ను ప్రారంభించనున్నామన్నారు. అదే విధంగా టి..వర్క్ కొత్త ఫెసిలిటీను ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ హైదరాబాద్‌లో టివిలను తయారుచేస్తోందన్నారు. ఐదువందల మంది ఉద్యోగులతో ఏడాదికి 1.8 మిలియన్ టివిలను తయారు చేస్తున్నారన్నారు. అలాగే కండ్లకోయలో ఐటి కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో తమ బ్రాంచుల ఏర్పాటుకు 200 కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇక అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, బాష్ లాంటివి తమ అతిపెద్ద కార్యాలయాలని హైదరాబాద్‌లో స్థాపిస్తున్నాయని ఆయన వివరించారు.

ఇటీవల తాను జరిపిన దావోస్ పర్యటనలో హ్యుందాయితో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఒయు కూడా చేసుకుందన్నారు. ఆ కంపెనీ రాష్ట్రంలో రూ. 1400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందన్నారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ సిస్కా హైటెక్ సిటీలో తమ సంస్థను త్వరలో ప్రారంభించనుందన్నారు. ఐటితో పాటు స్పోర్ట్ ఈక్విప్‌మెంట్ మాన్యూఫ్యాక్షరింగ్ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఇక స్పేస్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉండగా హెల్త్ అండ్ అగ్రికల్చర్ రంగాలలో టెక్నాలజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఇందులో మొదటి స్థానంలో లక్ష్యద్వీప్ ఉండగా.. రెండవ స్థానంలో మన రాష్ట్రం కొనసాగుతోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News