Sunday, November 3, 2024

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనిపించనున్న తెలంగాణ శకటం!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ శకటానికి ఆమోదం తెలిపిన రక్షణశాఖ
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాంజీ గోండ్,
కుమురం భీం, చిట్యాల (చాకలి) ఐలమ్మల జీవితాల థీమ్‌కు ఆమోదం

మనతెలంగాణ/హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ‘కర్తవ్యపథ్’ (గతంలో రాజ్‌పథ్)పైన తెలంగాణ శకటం కనిపించనుంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015 సంవత్సరంలో ఒకసారి, 2020 రిపబ్లిక్ డే రోజున మరోసారి తెలంగాణ శకటం కనువిందు చేయగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ అవకాశం లభించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక కమిటీ తెలంగాణ ప్రభుత్వం తరఫున రూపొందిన ఈ థీమ్ (ఇతివృత్తం)ను పరిశీలించి సూచనప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపింది. త్రీ-డీ డిజైన్ చూసిన తర్వాత జనవరి మొదటి వారంలో లాంఛనంగా ప్రకటన చేయనుంది. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాంజీ గోండ్, కుమురం భీం, చిట్యాల (చాకలి) ఐలమ్మల జీవితాలను, ప్రజాస్వామిక తిరుగుబాటుకు థీమ్‌లకు ఈసారి చోటుదక్కనుంది.

ప్రతి ఏటా శకటాల ప్రదర్శన కోసం నిర్దిష్టమైన థీమ్‌ను ప్రకటించే రక్షణ శాఖ ఈసారి ‘వికసిత్ భారత్ – భారత్ లోక్‌తంత్ర కీ మాతృక’ అనే టాగ్‌లైన్‌తో రూపొందించింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించింది. గడువు ముగిసే సమయానికి (డిసెంబరు 26) మొత్తం 29 రాష్ట్రాలు వాటి థీమ్‌లను, డిజైన్‌లను సమర్పించాయి. పలు దఫాల సమావేశాలు నిర్వహించి ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున 23 శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన కూడా గణతంత్ర దినోత్సవం రోజున కర్తవ్యపథ్‌లో కనిపించనున్నాయి.
జనవరిలో అధికారికంగా ప్రకటించే …
జనవరి మొదటివారంలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఏయే రాష్ట్రాలకు చాన్స్ లభిస్తుందన్నది వెల్లడి కానుంది. కాకతీయుల ఏలుబడిలో ప్రజాస్వామ్య వ్యవస్థ అనే థీమ్‌ను తొలుత ప్రతిపాదించినా పలు మార్పులను ఆ కమిటీ సూచించింది. చివరకు నిర్మల్‌లోని ‘వెయ్యి ఉరుల మర్రి’ బ్యాక్ డ్రాప్‌తో రాంజీ గోండ్ పోరాటాన్ని, జల్ జంగల్ జమీన్ నినాదానికి దృశ్యరూపకంగా కొండలు, కోనలు, జోడేఘాట్లను కనిపించేలా ఒక బ్యాక్‌డ్రాప్‌తో కుమురం భీం ఉద్యమాన్ని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చిట్టాల (చాకలి) ఐలమ్మ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆమెను పంటల చేల నుంచి తీసుకెళ్లిన ఘటనకు ప్రతీకగా పచ్చటి పొలాల బ్యాక్‌డ్రాప్‌ను తెలంగాణ థీమ్‌లో కళాకారులు పొందుపరిచారు. కర్తవ్యపథ్ తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News