Monday, December 23, 2024

టిడిపిపై రేవంత్‌ రెడ్డి కుట్రలు.. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

- Advertisement -
- Advertisement -

టిటిడిపిపై రేవంత్‌రెడ్డి కుట్రలు….
తెలంగాణలో ఆపార్టీ నామ రూపాలు లేకుండా ఎత్తులు
రోజుకో నేతను కలిసిన కాంగ్రెస్ కండువా కప్పేందుకు ప్రయత్నాలు
మండవ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లిని చేర్చుకునేందుకు మంతనాలు
రేవంత్‌రెడ్డి తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు
రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీనే టార్గెట్ చేయడంపై ఆగ్రహం

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో త్వరగా జరిగే ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పడరాని తంటాలు పడుతున్నారు. కమలం, గులాబీ పార్టీల నుంచి ఆశించిన స్దాయిలో ఎమ్మెల్యే స్దాయి అభ్యర్థులు హస్తం పార్టీ వైపు రాకపోవడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీపై టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి కన్నేసి ఆపార్టీలో ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఆపార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదంటూ సూక్తులు వల్తిస్తూ తమ పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని కోరుతున్నట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకటించిన తరువాత అందులో 15 మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమను కాదని టికెటు ఇచ్చిన నేతలకు సహకరించమని, అవసరమైతే మరో పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థులను ఓడిస్తామని సవాల్ విస్తుతున్నారు. దీంతో ఏమి చేయలేక రేవంత్‌రెడ్డి తనకు రాజకీయంగా చాలా అవకాశాలు కల్పించిన టిడిపిని అడ్రస్సు లేకుండా చేయాలని కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.

గత నెల రోజుల నుంచి పాత టీడీపీ నేతలు ఒక్కొక్కరు కాంగ్రెస్‌లో చేరుతూ ఈ ఎన్నికల్లో మరో మారు తమ రాజకీయ భవిష్యత్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి హరీశ్ రావు పై విమర్శలు చేసిన టిడిపి మాజీ నేత, మల్కాజ్ గిరి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడు రోజుల కితం మండవ వెంకటేశ్వరరావును రేవంత్‌రెడ్డి ఆయన నివాసంలో కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు ఆయన సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగకుండా మరో సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఇటీవల రేవంత్ రెడ్డి కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

రెండుమూడు రోజుల్లో ఆయన హస్తం పార్టీలో చేరనున్నారని సమాచారం. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకుంటున్న రేవూరి పరకాల నుంచి తన విజయం సులభమని భావించి కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వీరితో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్‌లను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నారు. టిటిడిపి అధ్యక్షులు బిసి వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ఉండటంతో పార్టీ మరోసారి పుంజుకుంటుందనే అవకాశం ఉందని భావించి రేవంత్ పార్టీ ఎదగకుండా కుట్రలు చేస్తున్నట్లు తెలుగుదేశం సీనియర్లు మండిపడుతున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలను ఎదుర్కొనలేక బిసిల పార్టీగా ముద్రపడిన టిడిపి లేకుండా వక్రబుద్ది ప్రదర్శిస్తున్నారని విరుచుకపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News