Monday, December 23, 2024

ఏపి టిడిపి అధ్యక్షుడిని కలిసిన తెలంగాణ టిడిపి నేతలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో టిడిపి పోటీలో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయని ఫిర్యాదు

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడంతో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు తెలంగాణ టిడిపి నేతలు జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ మేరకు పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నాయకుల బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమలను కలిసింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో నిలబడటానికి గతంలో కంటే సానుకూల పరిస్థితులు ఉన్నాయని పార్టీ అగ్ర నేతలకు వారు వివరించారు. పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం అనివార్యంగా మారిందని, పోటీలో ఉండకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సూచించారు. తెలంగాణలో టిడిపి పోటీలో ఉండటం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయని, దీంతో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే అయోమయం నెలకొందని తెలంగాణ టిడిపి నాయకులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారు సానుకూలంగా స్పందిస్తూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అంశాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. అన్ని స్థానాల్లో కాకుండా పార్టీకి బలం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుందని వారు సూచించారు. అచ్చెన్నాయుడు, యనమలను కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, బిసి సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మేకల భిక్షపతి ముదిరాజ్, ప్రకాష్, రవీంద్రా చారి, నల్లగొండ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News