లోకల్ ఉద్యోగులదే పెత్తనం
అవినీతి, అక్రమాలను పట్టించుకోని దేవాదాయ శాఖ ఈఓలు
కొన్నిచోట్ల ఈఓల కొరతతో అవినీతి, అక్రమాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల సిఫార్సు లేఖలు ఆలయాల్లో బుట్టదాఖలు అవుతున్నాయి. చేతులు తడిపితేనే భక్తులకు దేవుడి దర్శనం లభిస్తుంది. దర్శనానికి వెళ్లినప్పుడు భక్తులు ప్రజాప్రతినిధుల లెటర్‌హెడ్‌లపై సిఫార్సు లేఖలను తీసుకెళతారు. అక్కడకు వెళ్లిన తరువాత ఫ్రొటోకాల్ డిపార్ట్‌మెంట్ లేదా సంబంధిత ఆ ఆలయ ఈఓకు ఈ సిఫార్సు లేఖలను అందచేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగా ఆ భక్తులకు దర్శనానికి సంబంధించి ఆ ఆలయ అధికారులు స్లాట్‌ను కేటాయిస్తారు. కొన్నిచోట్ల బ్రేక్ దర్శనం అయితే దానికి కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలను ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు స్థానికంగా ఆలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, కొందరు పర్మినెంట్ ఉద్యోగులు డబ్బులు కోసం తమ చేతివాటం చూపిస్తున్నారని, భక్తుల నుంచి దేవాదాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.
రెండు ముఖ్యమైన ఆలయాలకు ఈఓలుగా రెవెన్యూ శాఖ…
రాష్ట్రంలో 12 వేలకు పైగా చిన్న, పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలకు భారీగా భక్తులు వెళుతుంటారు. అందులో కొన్ని దేవాలయాలకు ఈఓలుగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన ఆర్‌డిఓ పైస్థాయి అధికారులు ఈఓలుగా వ్యవహారిస్తుండగా చాలా ఆలయాలకు దేవాదాయశాఖకు చెందిన వారే ఈఓలుగా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ఆలయాలకు ఈఓలు కూడా లేకపోవడం, కొన్నిచోట్ల ఈఓలకు రెండు ఆలయాలకు ఇన్‌చార్జీలుగా దేవాదాయ శాఖ నియమించింది. అయితే ఈఓల కొరతను అధిగమించడానికి దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై కొందరు అధికారులను పంపించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం యాదగిరిగుట్ట ఈఓ, భద్రాచలం ఈఓలు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన వారు కాగా, మిగతా చోట్ల దేవాదాయ శాఖకు చెందిన వారు ఈఓలుగా ఉన్నారు. యాదగిరిగుట్ట, భద్రాచలం ఈ రెండుచోట్ల విఐపి దర్శనాలు, సిఫార్సు లేఖలకు ఈఓలు తగినంత ప్రాధాన్యత ఇస్తుండడం, అక్రమాలు, అవినీతికి తావులేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుండడంతో మిగతా చోట్ల కూడా రెవెన్యూ అధికారులను ఈఓలుగా నియమించాలని దేవాదాయ శాఖ భావిస్తున్నట్టుగా తెలిసింది.
ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాలు..
ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలకు ఒక ఈఓ ఉన్నారు. చిన్నచిన్న ఆలయాలకు వాటి ప్రాధాన్యతను బట్టి రెండు, మూడు మండలాల్లోని ఆలయాలకు కలిపి ఒక ఈఓను దేవాదాయ శాఖ నియమించింది. ఈ ఆలయాలను పర్యవేక్షిస్తున్న ఈఓలు ఆలయాల అభివృద్ధిపై, అక్కడ జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ ఆలయాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు దేవాదాయ అధికారుల మధ్య గ్యాప్ తగ్గించేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నా ఈఓల్లో మార్పురావడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో వేములవాడ (రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం), యాదగిరిగుట్ట (లక్ష్మీ నరసింహా స్వామి), భద్రాచలం (శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం) బాసర (జ్ఞానసరస్వతి దేవస్థానం), వరంగల్ (శ్రీ భద్రకాళి దేవస్థానం), సికింద్రాబాద్, (గణేష్ ఆలయం), కొండగట్టు, (శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం), ధర్మపురి (శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం), కర్మన్ ఘాట్ (హునుమాన్ దేవస్థానం), బల్కంపేట (ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం), కురవి (వీరభద్రస్వామి), ఐనవోలు (మల్లికార్జున స్వామి), ములుగు (రామప్ప), గద్వాల్ (జోగులాంబ), కీసర (రామలింగేశ్వర స్వామి తదితర ఆలయాలకు భక్తులు భారీగా దర్శనానికి వెళుతుంటారు.